seized vehicles
-
జరిమానా కట్టకపోతే వేలమే!
సాక్షి, హైదరాబాద్: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సరిగా చెల్లించనందుకు గాను సీజ్ చేసిన వస్తువులకు సంబంధించిన జరిమానాను నిర్దేశిత గడువులోపు వ్యాపారులు చెల్లించకపోతే ఆ వస్తువులను లేదా సరుకులను వేలంలో అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 129 (1) ప్రకారం జరిమానా విధించిన 15 రోజుల్లో చెల్లించకపోతే ఆ సరుకులను ఈ వేలంలో అమ్మేసేందుకు పన్నుల శాఖ అధికారులకు అనుమతినిచ్చింది. జరిమానాను సకాలంలో చెల్లించకపోతే డీలర్‌కు నోటీసులివ్వాలని, నోటీసులు ఇచ్చాక 15 రోజుల్లోపు వేలంలో పాల్గొనేవారి నుంచి బిడ్లు స్వీకరించాలని, బిడ్లలో అర్హత పొందిన వారికి వస్తువులను అమ్మేసి ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని వసూలు చేయాలని, మిగిలిన బిడ్లు దాఖలు చేసిన వారి ఫీజు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది. సీజ్ చేసిన వస్తువులు 15 రోజుల్లోపు అమ్మాల్సిన స్వభావం కలిగి ఉంటే షెడ్యూల్‌ను నిర్ణీత అధికారి మార్చుకునే వెసులుబాటు కల్పించింది. అయితే నోటీసు జారీ చేయడానికి ముందే ఆ వస్తువులను భద్రపరిచేందుకు అయ్యే ఖర్చులను ప్రభుత్వానికి డీలర్ చెల్లిస్తే వేలం ప్రక్రియను నిలిపివేయనుంది. ఐటీసీకి కొత్త నిబంధనలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందేందుకు డీలర్లు, సరఫరాదారులు పాటించాల్సిన నిబంధనల్లోనూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సీఎస్ సోమేశ్‌కుమార్ తాజాగా జారీ చేశారు. సరఫరాదారులు జీఎస్టీఆర్ ఫాం–1లో ఇన్వాయిస్ల వివరాలు పొందుపర్చాల్సి ఉండగా డీలర్లు జీఎస్టీఆర్–2బీలో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. అప్పుడే ఐటీసీ వర్తించేందుకు అనుమతి లభిస్తుంది. అలాగే చెల్లించిన పన్నును రీఫండ్ కింద తిరిగి పొందాలంటే ఇన్వాయిస్లపై యునిక్ ఐడెంటిటీ నెంబర్ (యూఐఎన్)ను రాయాల్సి ఉంటుందని, లేదంటే డీలర్ ధ్రువీకరణను జతపర్చాల్సి ఉంటుందని నిబంధనలను సవరించింది. ప్రతి సంవత్సరం సమర్పించిన రిటర్న్‌లను డీలర్ల స్వీయ ధ్రువీకరణతో ఫిబ్రవరి 28లోపు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు.. గోల్డెన్ చాన్స్!
హిమాయత్‌నగర్‌కు చెందిన ఫార్మా ఉద్యోగి తరుణ్ (పేరు మార్చడమైంది) గతేడాది మార్చిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు. ఆయన బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ బైక్ ఖరీదు సుమారు రూ. 11 వేల వరకు ఉండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ. 10,500 జరిమానా విధిస్తుండటంతో బైక్ ఖరీదు, చలానా ఖరీదు ఒకే స్థాయిలో ఉండటంతో ఆయన బైక్‌ను స్టేషన్లో వదిలేశారు. ఇది ఒక్క తరుణ్ పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనదారులు జరిమానా రూ. 10,500 చెల్లించలేక బైక్ ఖరీదు దాదాపుగా అంతే ఉండటంతో అక్కడే వదిలేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019 మార్చి నుంచి 2021 డిసెంబర్ వరకు సుమారు 5,776 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాయి. ఆయా వాహనాలను సీజ్ చేసి స్టేషన్ల ఆవరణల్లో ఉంచారు. అవికాస్తా దుమ్ముకొట్టుకుపోతున్నాయి. తమ వాహనాలు పాడవుతాయనే ఆందోళన ఉన్నా... అంత జరిమానా కట్టే పరిస్థితి లేక బాధపడని వారుండరు. ► అయితే ప్రభుత్వం వారందరికీ ఓ అవకాశాన్ని కల్పించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులు లోక్‌అదాలత్‌లో తాము మద్యం సేవించి వాహనం నడిపినట్లు అంగీకరిస్తే రూ. 2100 చెల్లించి ఆ కేసు నుంచి బయటపడి తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్పించారు. 36 నుంచి 100 బీఏసీ ఉంటే రూ. 2100, 100 నుంచి 200 బీఏసీ ఉంటే రూ. 3100, 200 నుంచి 300 బీఏసీ ఉంటే రూ. 4100 చెల్లించాలి. ► వాహనదారుడు మాత్రం తాను మద్యం సేవించి వాహనం నడిపినట్లు లోక్ అదాలత్‌లో ఒప్పుకోవాల్సి ఉంటుంది. ► ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్నగర్, బేగంపేట పోలీస్స్టేషన్ల పరిధిలో 736 వాహనాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొని వాహనాలను తీసుకున్నారు. ► మనో రంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కోర్టులో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. మరికొన్ని రోజులు ఈ అవకాశాన్ని కల్పించారు. సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని వెళ్తే లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించి వాహనాన్ని రిలీజ్ చేస్తున్నారు. వచ్చే నెల 12 వరకు... ► లోక్ అదాలత్ మార్చి 12వ తేదీ వరకు కొనసాగనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, డీసీఎంలు ఇలా అన్ని వాహనాలు సీజ్ అయి పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఉండగా వీరంతా ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చి పోలీసులను సంప్రదిస్తే పోలీసులే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జరిమానా చెల్లింపజేసి వాహనాన్ని అందజేస్తారు. మంచి అవకాశం చాలా మంది వాహనదారులు వేలాది రూపాయలు చెల్లించుకోలేక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు తీసుకోలేకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో సీజ్ చేసిన వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. ► కొన్ని ఖరీదైన కార్లు, ఖరీదైన బైక్‌లు కూడా ఉన్నాయి. వీరందరికీ ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అప్పటికే ప్రచారం చేశారు. ► సంబంధిత వాహనదారులకు కూడా లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించి సమాచారం ఇస్తున్నారు. రోజూ వంద నుంచి 200 వాహనాలు ఇలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనాలు విడుదల అవుతున్నాయని సబంధిత వర్గాలవారు చెబుతున్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్; సీజ్ చేసిన వాహనాలు వెనక్కు...
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అతిగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు తెలంగాణ హైకోర్టు తీర్పు కాస్తా ఉపశమనాన్నిస్తోంది. గతంలో పట్టుబడిన వాహనాలను సీజ్ చేస్తూ నడిపేవారికి కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం చలానా చెల్లించే వారు. ఇటీవల హైకోర్టు తీర్పుతో ఈ పద్ధతికి ట్రాఫిక్ పోలీసులు ఫుల్స్టాప్ పెట్టారు. సాక్షి, బంజారాహిల్స్: ఏడాదిగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలను మెల్లమెల్లగా కోర్టుకు తీర్పుకు లోబడి ఇచ్చేస్తున్నారు. గడిచిన రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా మద్యం సేవించి పట్టుబడ్డ వారి నుంచి వాహనాలను సీజ్ చేయకుండా సమీప ప్రాంతంలో ఉండే వారి బంధుమిత్రులను పిలిపించి ఆ వాహనాలను ఇచ్చి పంపిస్తున్నారు. ► బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 615 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సీజ్ చేశారు. ► జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 645 వాహనాలను సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అత్యధిక వాహనాలు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పట్టుబడగా ఆ తర్వాత స్థానం మలక్‌పేటలో పట్టుబడ్డారు. 6,7 స్థానాల్లో వరుసగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఉన్నాయి. ► కోర్టు తీర్పుతో సీజ్ చేసిన వాహనాలను బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ప్రకారం యజమానులకు అప్పగిస్తున్నారు. ► సీజ్ చేసిన వాహనాలను అప్పగించే క్రమంలో మార్గదర్శకాలు అనుసరిస్తున్నారు. గత అయిదేళ్లుగా నగరంలో డ్రంక్ అండ్డ్రైవ్ నిర్వహిస్తుండగా ఏటా కేసులు పెరగడమే కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ► వాహనదారులకు కౌన్సెలింగ్‌తో పాటు న్యాయస్థానంలో హాజరుస్తున్నారు. అయినా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఇటీవల కొంత మందిపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. (చదవండి: Metro trains: ఆరుకొట్టంగనే మెట్రో రైలు) జూబ్లీహిల్స్ అంటేనే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. ► పబ్‌లు, క్లబ్‌లు, ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లు జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నాయి. అర్ధరాత్రి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు ఈ ఏరియాలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. ► శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు అయిదు వేర్వేరు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకొని ఆ వాహనాలను సీజ్ చేసేవారు. దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ► జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏ నెలకు ఆ నెల కేసులు తగ్గుముఖం పట్టి రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గింది. ► డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులను కట్టడి చేయడంలో ట్రాఫిక్ పోలీసులు రాత్రి 4 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తుండటంతో చాలా వరకు కేసులు తగ్గుముఖం పట్టాయనే చెప్పొచ్చు.(చదవండి: ఒలెక్ట్రాకు ఎంఎస్ఆర్టీసీ నుంచి 100 బస్సులకు ఆర్డరు) ► నగరంలో మిగతా ప్రాంతాలతో పోల్చి చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తక్కువే. ► పబ్‌ల నుంచి యువకులు అర్ధరాత్రి మద్యం సేవించి బయటికి వస్తూ వాహనాలను నడుపుతుండటం దీని వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో తనిఖీలు అర్ధరాత్రి వరకు చేపడుతున్నారు. -
వైరల్: రాత్రి బైక్ సీజ్‌పై వివరణ ఇచ్చిన ఏసీపీ
సాక్షి, శామీర్‌పేట్: ట్రాఫిక్ పోలీసులు రాత్రి సమయంలో బైక్ సీజ్ చేయడంతో అర్ధరాత్రి వరకు మైనర్ బాలిక, ఇద్దరు యువకులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నగరంలోని బోరబండకు చెందిన రిషిక కీసరలోని గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ప్రభుత్వం విద్యాసంస్థలను మూసివేయడంతో బుధవారం సాయంత్రం రిషికను ఇంటికి తీసుకొచ్చేందుకు బాలిక మామ కిరణ్ అతడి స్నేహితుడితో కలిసి బైక్‌పై వచ్చాడు. ఆమెను తీసుకువెళ్తుండగా మార్గమధ్యలో తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ట్రిపుల్ రైడింగ్, బైక్ నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకపోవడంతో బైక్‌ను సీజ్ చేశారు. డబ్బులు లేవని వేడుకున్నా పోలీసులు స్పందించకపోవడంతో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. లిఫ్ట్ అడుక్కుని అవస్థలు పడుతూ తెల్లవారుజామున ఇంటికి చేరినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇంటికి వెళ్లేందుకు సౌకర్యం కల్పించాం.. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి గురువారం రాత్రి శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. త్రిబుల్ రైడింగ్, లైసెన్స్ లేని కారణంగా కేసు నమోదు చేశామని, ఆ సమయంలో బైక్‌పై ప్రయాణిస్తున్న బాలిక అతడి మామకు ఇంటికి వెళ్లేందుకు సౌకర్యం కల్పించామన్నారు. నగరంలోని వై జంక్షన్ వరకు ఓ కంపెనీ బస్సులో పంపించామని, అక్కడి నుంచి ఇంటికి చేరుకునేందుకు దారి ఖర్చులకు రూ.100 ఇచ్చినట్లు వివరించారు. -
వాహనాల వేలం ఎప్పుడో..?
ఖిలా వరంగల్: ప్రమాదాలు, వివిధ సందర్భాల్లో రవాణాశాఖ అధికారులు, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి తుప్పుపడుతున్నాయి. ఇలాంటి వాహనాలు ఒకటో రెండో ఉన్నాయనుకుంటే పొరపడినట్లే..!. కొన్ని వందల ఆటోలు, ద్విచక్ర వాహనాలతోపాటు ఇతర వాహనాలు ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంలో తుప్పిపట్టి శిథిలమయ్యాయి. దీంతో రూ.లక్షల ప్రజాధనం వృథా అయింది. అయినా అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఆరు నెలల్లో.. వివిధ కారణాలతో పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది సీజ్ చేసిన వాహనాలను రవాణాశాఖ సీక్ యార్డుకు తరలిస్తారు. వీటిని విడిపించుకోవడానికి యజమానులకు శాఖ నిబంధనల మేరకు ఆరు నెలలు సమయం ఉంటుంది. విడిపించుకోలేకపోతే ఆరు నెలలు తర్వాత ఆయా వాహనాలను వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. అయితే, రవాణాశాఖ అధికారులు ఆ మేరకు వ్యవహరించడం లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయంలో వేలం నిర్వహించిన దాఖలాలు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, నాలుగున్నరేళ్లుగా వాహనాలు ఒకేచోట ఉండటంతో తుప్పుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. సీజ్ చేసిన సమయంలో బాగా నడిచిన వాహనాలు ఎండకు ఎండి వానకు తడిసి పిచ్చి మొక్కలు మొలిచాయి. ఇప్పుడు వాటిని విక్రయించాలన్నా అమ్ముడుపోని పరిస్థితి నెలకొందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ వేలంలో విక్రయించినా వాటిపై ఉన్న ట్యాక్స్, పెనాల్టీలు, ఇతర జరిమానాలు మొత్తం కలిపిన శాఖకు 50 శాతం కూడా రెవెన్యూ వచ్చేలా లేదు. సకాలంలో వాహనాలను వేలం వేసి ఉంటే పూర్తి సొమ్ము ఖజానాకు జమ అయ్యేదని పలువురు పేర్కొంటున్నారు. కమిషనర్‌కు నివేదిక అందజేస్తాం.. తనిఖీల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు, రోడ్డు టాక్స్ చెల్లించని వాహనాలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణంకు తరలిస్తాం. వాహన యజమానలు ఆరు నెలల్లోపు జరిమానా చెల్లించి విడిపించుకునే వీలుంటుంది. అలా తీసుకోకపోతే వారి చిరునామాకు మూడుసార్లు నోటీసులు పంపుతాం. అయినా స్పందించకపోతే ప్రకటన ద్వారా వాటిని వేలం నిర్వహించి విక్రయిస్తాం. ప్రస్తుతం నాలుగేళ్లలోపు సీజ్ చేసిన వాహనాలే కార్యాలయ ప్రాంగణంలో ఉన్నావి. డీటీసీకి నివేదిక అందజేసి శాఖ నిబంధనల ప్రకారం వేలం నిర్వహించి ఆర్సీలు అందజేస్తాం.– కంచి వేణు, ఎంవీఐ, వరంగల్ అర్బన్ -
సీఎం జగన్ నిర్ణయం.. వాహనదారులు హర్షం
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇచ్చే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను సీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భౌతిక దూరం పాటించాలని వాహనదారులకు సీపీ సూచించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల వాహనదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పంపిణీ ప్రక్రియలో విధులు నిర్వహించే పోలీసులను పీపీఈ కిట్లు ధరించాలని ఆయన కోరారు. (సీఎం వైఎస్ జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు) అపరాధ రుసుము లేకుండానే వాహనాలను ఇస్తున్నామని చెప్పారు. తిరిగి తప్పు చేయకుండా వాహనదారుల నుంచి బాండ్స్ రూపంలో పూచీకత్తు తీసుకుంటున్నామని వెల్లడించారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద సీజ్ చేసిన వాహనాలకు చలానా ఇచ్చి పంపుతున్నామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కొనసాగుతాయని.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. -
వాహనాల విడుదలకు మోక్షం
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. రూ.500 జరిమానా చెల్లించి తమ వాహనాలను తీసుకెళ్లవచ్చని పోలీసులు తెలిపారు. జరిమానా డబ్బులను పేటీఎం, ఫోన్ పే, మీ సేవ ద్వారా చెల్లించవచ్చని సూచించారు. ఇక ఎపిడమిక్ డిసీస్ యాక్ట్ కింద పోలీసులు సీజ్ చేసిన వాహనాలను మాత్రం కోర్టుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వైన్ షాపులతో పాటు, నిర్మాణ, కిరాణా తదితర వ్యాపారాలకు సర్కారు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు కూడా సీజ్ చేసిన వాహనాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు దాదాపుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేశారు. ఇందులో సివిల్ పోలీసులు లక్షకు పైగా, ట్రాఫిక్ పోలీసులు మరో 50 వేల వరకు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తాజా నిర్ణయంతో వాహన దారులకు భారీ ఊరట లభించింది. -
కోడెల తనయుడు శివరామకృష్ణకు బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, గుంటూరు: టీఆర్ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామకృష్ణకు ఉచ్చు బిగుస్తోంది. రవాణా శాఖ అధికారులు విచారణ వేగవంతం చేశారు. టీఆర్ లేకుండా బైక్‌లు విక్రయించిన 138 మంది వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్లో కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లో బైక్‌ల విక్రయాల్లో భారీ కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్) లేకుండా 800 బైక్‌లను కోడెల శివరామ్ విక్రయించాడు. ఈ వ్యవహారంలో ఇటీవల గౌతమ్ షోరూమ్‌ను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. టీఆర్, లైఫ్ ట్యాక్స్‌ల పేరుతో వినియోగదారుల నుంచి ఒక్కో బైక్‌కు రూ.8–10 వేల వరకూ కోడెల శివరామ్ వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా మోసం చేశాడు. రూ.కోటి మేర ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాడు. వాహనదారుల నుంచి స్టేట్మెంట్లు.. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా డెలివరీ చేసిన బైక్‌ల వివరాలను ఇన్వాయిస్లోని చిరునామాల ఆధారంగా గుర్తించారు. రవాణా శాఖ అధికారులు స్వయంగా బైక్‌లు కొనుగోలు చేసిన ఇళ్లకు వెళ్లి స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 138 మంది నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులకు స్టేట్మెంట్లు ఇచ్చిన వినియోగదారులందరూ బైక్ కొనుగోలు సమయంలో తమకు టీఆర్ ఇవ్వలేదని, లైఫ్ ట్యాక్స్, టీఆర్ ఫీజుల పేరుతో రూ. 8–10 వేల వరకూ వసూలు చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. వినియోగదారుల నుంచి స్టేట్మెంట్ సేకరించిన అధికారులు స్టేట్మెంట్లను రవాణా శాఖ కమిషనర్‌కు నివేధించారు. విచారణ రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. విచారణ అనంతరం శివరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదుచేస్తారు. బైక్‌లు స్వాధీనం చేసుకున్న ఫైనాన్స్ కంపెనీలు.. టీఆర్ లేకుండా గౌతమ్ షోరూమ్ యాజమాన్యం 800 బైక్‌లు విక్రయించింది. వీటిలో చాలా వరకూ బైక్‌లను వినియోగదారులు ఫైనాన్స్ రూపంలో కొనుగోలు చేశారు. టీఆర్ జనరేట్ కాకపోవడంతో వినియోగదారులు కిస్తీ (ఇన్స్టాల్మెంట్స్) చెల్లించలేదు. దీంతో ఫైనాన్స్ కంపెనీలు బైక్‌లను స్వాధీనం చేసుకున్నాయి. టీఆర్ జనరేట్ కాకపోవడంతో ఆ బైక్‌లు రిజిస్ట్రేషన్ అవ్వక వేరొకరికి బైక్‌లు విక్రయించడానికి వీల్లేక ఫైనాన్స్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రికవరీ చేసిన బైక్‌లన్నింటినీ ఫైనాన్స్ కంపెనీలు తమ గోడౌన్స్‌లో ఉంచుకున్నాయి. టీఆర్ లేని వాహనాలను నడపడం నేరం తాత్కాలిక రిజిస్ట్రేషన్(టీఆర్) లేని వాహనాలను నడపడం నేరం. రవాణా శాఖ అధికారులు తనిఖీల్లో టీఆర్ లేనట్టు గుర్తిస్తే ఎంవీఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి భారీ అపరాద రుసుం విధించి వాహనం సీజ్ చేస్తారు. అదే విధంగా టీఆర్ లేని వాహనం ఢీ కొని ఎవరైన గాయాలపాలైన, మృతి చెందిన వాహనదారునిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. దురదృష్టవశాత్తు వాహనదారుడు మృతి చెందితే ఇన్సూరెన్స్ వంటి ఇతర స్కీమ్‌లు వర్తించవు. గౌతమ్ షోరూమ్ నుంచి టీఆర్ లేకుండా బైక్‌లు విక్రయించినవారు బైక్‌లను రోడ్డుపై తిప్పడానికి వీల్లేదు. – మీరా ప్రసాద్, డీటీసీ గుంటూరు -
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
దాచేపల్లి: అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న 240 బస్తాల రేషన్ బియ్యంతో పాటుగా రూ.2.76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణలోని కోదాడ పరిసర ప్రాంతాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తంగెడ మేజర్ కాలువ కరకట్ట మీదుగా నకరికల్లు వైపు తరలిపోతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కరకట్ట మీద మకాం వేశారు. కరకట్టపై వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో రేషన్‌బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పౌరసరఫరాల గిడ్డంగుల నుంచి వచ్చిన బియ్యం బస్తాలను నేరుగా లారీలోనే తరలిస్తుండటం గమనార్హం. లారీలో ఉన్న చిట్యాల ఆంజనేయులు, మేదరాజు కృష్ణశివదీప్, కిచ్చంశెట్టి గిరి, పి, క్రాంతి, శోఠెం జాన్‌బాబులను అదుపులోకి తీసుకుని లారీలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో రేషన్‌బియ్యం విక్రయించగా వచ్చిన రూ. 2.76లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటుగా ముందు ఎస్కార్ట్‌గా వస్తున్న మరో ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, రేషన్‌బియ్యాన్ని సేకరించి విక్రయించే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ నెల 17వతేదీన దాచేపల్లి సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 400బస్తాల రేషన్‌బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పట్టుబడిన రేషన్‌బియ్యాన్ని ఆర్ఐ సునీత పరిశీలించారు. సరుకును రెవెన్యూ అధికారులకు అప్పగించారు. -
15 ఆటోలు సీజ్
రెంజల్(బోధన్) : మోటారు వాహణ చట్టానికి విరుద్ధంగా నడుపుతున్న 15 ఆటోలను సీజ్ చేసినట్లు బోధన్ ఆర్టీవో రాజు తెలిపారు. శనివారం మండలంలోని సాటాపూర్‌లో జరిగిన వారాంతపు సంతకు ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలను ఆయన తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాటిని పట్టుకుని సీజ్ చేశారు. ఇటీవల మెండారాలో జరిగిన సంఘటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం మూడు రోజులపాటు ప్రత్యేక స్పెషల్‌డ్రైవ్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిట్‌నెస్‌లేని ఆటోలను గుర్తించి సీజ్ చేస్తామన్నారు. సాటాపూర్ చౌరస్తాలో పలువురు ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
సీజ్ చేసిన వాహనాలకు 23న వేలం
పాత శ్రీకాకుళం: గత కొన్నేళ్లుగా ట్యాక్సు చెల్లించని కారణంగా సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 23న బహిరంగ వేలం వేస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ సి.హెచ్.శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూరల్ మండలం తండేవలస గ్రామంలోని శ్రీకాకుళం ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ వాహనాలన్నీంటికీ బహిరంగ వేలం వేస్తామన్నారు. సీజ్ చేసిన వాటిలో 37 ఆటోరిక్షాలు, కారు, జీపు ఉన్నట్టు తెలిపారు. ఈ వాహనాలన్నీ ఎచ్చెర్ల, పూసపాటిరేగ, లావేరు, జేఆర్‌పురం, మెళియాపుట్టి, శ్రీకాకుళం, ఆర్టీసీ డిపో, శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్, పొందూరు, కొత్తూరు, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం, ఉప రవాణాశాఖ కార్యాలయ పరిధిలో ఉన్నట్టు పేర్కొన్నారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించిన యజమానులు గాని, ఫైనాన్సియర్లు గాని ప్రభుత్వ బకాయిలు చెల్లించి వేలం తేదీకి ముందుగా వారి వారి వాహనాలను విడిపించుకోవచ్చునన్నారు. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వారు పై ప్రాంతాల్లో ఉన్న వాహనాలు చూసుకొని నిబంధనలు ప్రకారం పాల్గొనాలన్నారు. వేలంలో పాల్గొన్నవారు రూ. 3,000ను సెక్రటరీ, ఆర్టీఏ శ్రీకాకుళం పేరున డ్రాఫ్టు తీయాలని, దీనిని తిరిగి ఇవ్వబడదని, అదనంగా మరో రూ.200 సర్వీసు చార్జీకింద చెల్లించాలని తెలిపారు. మిగిలిన వివరాలకు తండేవలసలోని ఉప రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్శించాలని కోరారు. -
దొంగ వాహనాలపై తిరిగిన పోలీసుల సస్పెన్షన్
హైదరాబాద్: సీజ్ చేసిన వాహనాలను దర్జాగా వాడుకున్న పోలీసులకు చుక్కెదురైంది. వీరి బండారాన్ని బయట పెట్టిన 'సాక్షి' కథనాలకు పోలీసు యంత్రాంగం స్పందించింది. సీసీఎస్ సీఐలు మధుమమోహన్, ప్రసాద్, ఎస్ఐ శ్రీనివాస్, ఏఎస్ఐ గురునాధం, హెడ్ కానిస్టేబుల్ మోహన్ లను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను సొంత పనుల కోసం వాడుకుంటున్న వైనాన్ని ఫొటోలతో సహా 'సాక్షి' బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన కమిషనర్.. ఈ కేసులో పలువురు పోలీసులను సస్పెండ్ చేశారు.