సీజ్ చేసిన వాహనాలకు 23న వేలం
పాత శ్రీకాకుళం: గత కొన్నేళ్లుగా ట్యాక్సు చెల్లించని కారణంగా సీజ్ చేసిన వాహనాలకు ఈ నెల 23న బహిరంగ వేలం వేస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ సి.హెచ్.శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూరల్ మండలం తండేవలస గ్రామంలోని శ్రీకాకుళం ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ వాహనాలన్నీంటికీ బహిరంగ వేలం వేస్తామన్నారు. సీజ్ చేసిన వాటిలో 37 ఆటోరిక్షాలు, కారు, జీపు ఉన్నట్టు తెలిపారు. ఈ వాహనాలన్నీ ఎచ్చెర్ల, పూసపాటిరేగ, లావేరు, జేఆర్‌పురం, మెళియాపుట్టి, శ్రీకాకుళం, ఆర్‌టీసీ డిపో, శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్, పొందూరు, కొత్తూరు, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం, ఉప రవాణాశాఖ కార్యాలయ పరిధిలో ఉన్నట్టు పేర్కొన్నారు. సీజ్ చేసిన వాహనాలకు సంబంధించిన యజమానులు గాని, ఫైనాన్సియర్లు గాని ప్రభుత్వ బకాయిలు చెల్లించి వేలం తేదీకి ముందుగా వారి వారి వాహనాలను విడిపించుకోవచ్చునన్నారు.
వేలంలో పాల్గొనేందుకు ఆసక్తిగల వారు పై ప్రాంతాల్లో ఉన్న వాహనాలు చూసుకొని నిబంధనలు ప్రకారం పాల్గొనాలన్నారు. వేలంలో పాల్గొన్నవారు రూ. 3,000ను సెక్రటరీ, ఆర్‌టీఏ శ్రీకాకుళం పేరున డ్రాఫ్టు తీయాలని, దీనిని తిరిగి ఇవ్వబడదని, అదనంగా మరో రూ.200 సర్వీసు చార్జీకింద చెల్లించాలని తెలిపారు. మిగిలిన వివరాలకు తండేవలసలోని ఉప రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్శించాలని కోరారు.