మినీ వేలం: యువ క్రికెటర్‌కు కళ్లు చెదిరే ధర.. ఎవరీ కమలిని? | Who Is Uncapped G Kamalini Mumbai Indians Bought For Rs 1 60 Crore | Sakshi
Sakshi News home page

WPL: మినీ వేలంలో పదహారేళ్ల ప్లేయర్‌పై కనక వర్షం.. ఎవరీ కమలిని?

Published Sun, Dec 15 2024 4:05 PM | Last Updated on Sun, Dec 15 2024 5:13 PM

Who Is Uncapped G Kamalini Mumbai Indians Bought For Rs 1 60 Crore

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) మినీ వేలం సందర్భంగా తమిళనాడుకు చెందిన ఓ యువ క్రికెటర్‌పై కనక వర్షం కురిసింది. పదహారేళ్ల జి. కమలిని కోసం ముంబై ఇండియన్స్‌ భారీ మొత్తం ఖర్చు చేసింది. అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ కేటగిరీలో ఉన్న ఈ ఆల్‌రౌండర్‌ను ఏకంగా రూ. 1.60 కోట్లకు కొనుగోలు చేసింది.

19 స్థానాల కోసం
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మినీ వేలంలో మొత్తం 120 మంద మహిళా క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఐదు జట్లలో కలిపి ఖాళీగా ఉన్న 19 స్థానాల కోసం భారత్‌ నుంచి 91 మంది, విదేశాల నుంచి 29 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు.

రూ. 10 లక్షల కనీస ధర
ఇక బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ వేలంపాటలో జి. కమలిని రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆమె కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ బిడ్‌ వేసింది. అయితే, ఈ ఆల్‌రౌండర్‌ను ఎలాగైనా తమ జట్టులోకి చేర్చుకోవాలని పట్టుబట్టిన ముంబై యాజమాన్యం.. ఢిల్లీతో పోటీ పడి ఆమె ధరను కోటి దాటించింది.

అయినప్పటికీ ఢిల్లీ వెనక్కి తగ్గకపోవడంతో మరో అరవై లక్షలు పెంచి ఏకంగా 1.60 కోట్ల రూపాయలకు ముంబై కమలిని సేవలను సొంతం చేసుకుంది. కాగా అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ అయినప్పటికీ జి.కమలిని కోసం వేలంలో భారీ డిమాండ్‌ రావడానికి కారణం.. ఆమె నైపుణ్యాలే.

భారీ సిక్సర్లతో విరుచుకుపడే లెఫ్టాండర్‌
ఇటీవల జరిగిన అండర్‌-19 మహిళల టీ20 ట్రోఫీలో తమిళనాడు టైటిల్‌ గెలవడంలో జి. కమలినిది కీలక పాత్ర. ఈ టోర్నమెంట్లో ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి ఆమె 311 పరుగులు చేసింది. భారీ సిక్సర్లతో విరుచుకుపడే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌గానూ సేవలు అందించింది.

అంతేకాదు.. ఈ లెగ్‌బ్రేక్‌ స్పిన్నర్‌ వివిధ కేటగిరీల్లో తమిళనాడు తరఫున వికెట్‌ కీపర్‌గానూ బరిలోకి దిగింది. అందుకే ఈ ఆల్‌రౌండర్‌ కోసం ముంబై భారీ మొత్తం ఖర్చు చేసింది. 

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ కోసం
కాగా ముంబై ఇండియన్స్ మహిళా జట్టులో నాలుగు ఖాళీలు ఉండగా.. ఒక స్థానం జి. కమలిని భర్తీ చేసింది. ఇక ఈ వేలంలో కమలిని కంటే ముందు సౌతాఫ్రికా పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నదినె డి క్లర్క్‌ను ముంబై కొనుక్కుంది. ఆమె కోసం రూ. 30 లక్షలు వెచ్చించింది.

డాటిన్‌కు రూ. 1.70 ​కోట్లు
మరోవైపు.. వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డియోండ్రా డాటిన్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 1.70 కోట్లకు సొంతం చేసుకుంది. యూపీ వారియర్స్‌తో పోటీపడీ మరీ డాటిన్‌ను దక్కించుకుంది. అదే విధంగా సిమ్రన్‌ షేక్‌ కోసం గుజరాత్‌ అత్యధికంగా రూ. 1.90 కోట్లు ఖర్చు చేసింది.

అయితే, తొలి రౌండ్‌లో పూనమ్‌ యాదవ్‌, స్నేహ్‌ రాణా(కనీస ధర రూ. 30 లక్షలు) వంటి భారత ప్లేయర్లు అమ్ముడుపోకుండా మిగిలిపోయారు. 

కాగా డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్‌ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌, యూపీ వారియర్స్‌ పేరిట ఐదు జట్లు పాల్గొంటున్నాయి. 

చదవండి: BGT: మహ్మద్‌ షమీకి బైబై!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement