టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేలా కనిపించడం లేదు. ఆసీస్‌తో మూడో టెస్టు నుంచే ఈ బెంగాల్ బౌలర్ భారత జట్టుకు అందుబాటులో ఉంటాడని వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇటీవల... వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే
‘‘షమీ టీమిండియా కిట్ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ పూర్తి కాగానే అతడు కూడా కంగారూ గడ్డపై అడుగుపెట్టనున్నాడు’’ అని పేర్కొన్నాయి. అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. ఇప్పటికే టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైపోయింది.
బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం ఈ మ్యాచ్ ఆరంభమైంది. మరోవైపు.. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టులో షమీ పేరును చేర్చారు సెలక్టర్లు. కాగా దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21 నుంచి జనవరి 18 వరకు జరుగనుంది.
షమీతో పాటు ముకేశ్ కుమార్ ఎంపిక
ఈ నేపథ్యంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో పాల్గొనబోయే తమ జట్టులో ఇరవై మంది ఆటగాళ్లకు చోటిచ్చింది. సుదీప్ కుమార్ ఘరామీ కెప్టెన్సీలో ఆడబోయే ఈ టీమ్‌కు టీమిండియా స్టార్లలో మహ్మద్ షమీతో పాటు ముకేశ్ కుమార్‌ను కూడా ఎంపిక చేసింది. అదే విధంగా షమీ తమ్ముడు మహ్మద్ కైఫ్ కూడా ఈ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
చీలమండ గాయానికి సర్జరీ
కాగా 34 ఏళ్ల షమీ చివరగా వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. స్వదేశంలో జరిగిన ఈ ఐసీసీ టోర్నీలో షమీ 24 వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత అతడు చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు.
దేశీ టీ20 టోర్నీలో షమీ అదుర్స్
ఈ నేపథ్యంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందిన షమీ.. దాదాపు ఏడాది తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో బెంగాల్ తరఫున బరిలోకి దిగాడు. ఈ టోర్నమెంట్లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడి 7.85 ఎకానమీతో పదకొండు వికెట్లు తీశాడు.
టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయి.. కానీ
తద్వారా టీ20 క్రికెట్‌లో 201 వికెట్లు పూర్తి చేసుకున్నాడు షమీ. ఈ క్రమంలో షమీ ఇక ఆస్ట్రేలియా విమానం ఎక్కడమే తరువాయి అనుకున్న తరుణంలో.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. షమీ కోసం టీమిండియా తలుపులు తెరిచే ఉన్నాయని.. అయితే, అతడి ఫిట్‌నెస్‌పై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని పేర్కొన్నాడు.
షమీకి బైబై చెప్పేశారా?
కాగా షమీ ఫిట్‌గానే ఉన్నప్పటికీ ఐదు రోజుల క్రికెట్(టెస్టు) ఆడేందుకు అతడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అందుకే బీసీసీఐ అతడిని ఆసీస్ పర్యటన నుంచి పూర్తిగా పక్కనపెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు షమీ సిద్ధం కావడం విశేషం.
ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే రెండు టెస్టులు పూర్తి చేసుకున్న టీమిండియా.. బ్రిస్బేన్(డిసెంబరు 14-18), మెల్‌బోర్న్(డిసెంబరు 26-30), సిడ్నీ(జనవరి 3-7)లో మిగిలిన మూడు టెస్టులు ఆడనుంది. మరోవైపు.. షమీ భాగమైన బెంగాల్ జట్టు.. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 21న ఢిల్లీతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
విజయ్ హజారే ట్రోఫీ-2024కు బెంగాల్ జట్టు
సుదీప్ కుమార్ ఘరామి (కెప్టెన్), మహ్మద్ షమీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఛటర్జీ, కరణ్ లాల్, షకీర్ హబీబ్ గాంధీ (వికెట్ కీపర్), సుమంత గుప్తా, శుభమ్ ఛటర్జీ, రంజోత్ సింగ్ ఖైరా, ప్రదీప్తా ప్రామాణిక్, కౌశిక్ మైటీ, వికాస్ సింగ్, ముకేశ్ కుమార్, సక్షీమ్ చౌదరి, రోహిత్ కుమార్, మహ్మద్ కైఫ్, సూరజ్ సింధు జైస్వాల్, సయాన్ ఘోష్, కనిష్క్ సేథ్.
చదవండి: భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్ హెడ్ వరల్డ్ రికార్డు.. సరికొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment