భారత్‌తో మూడో టెస్టు.. చరిత్ర సృష్టించిన హెడ్‌.. వరల్డ్‌ రికార్డు | Ind vs Aus: Travis Head Slams Century In Brisbane Becomes First In World To | Sakshi
Sakshi News home page

భారత్‌తో మూడో టెస్టు: ట్రవిస్‌ హెడ్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర

Published Sun, Dec 15 2024 11:00 AM | Last Updated on Sun, Dec 15 2024 1:06 PM

Ind vs Aus: Travis Head Slams Century In Brisbane Becomes First In World To

భారత్‌తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ శతకంతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఆదివారం వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో ట్రవిస్‌ హెడ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతోంది.

తొలిరోజు వర్షం వల్ల అంతరాయం
పెర్త్‌ వేదికగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టులో భారత్‌ గెలుపొందగా.. అడిలైడ్‌ పింక్‌బాల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ 1-1తో సమమైంది. ఈ క్రమంలో భారత్‌- ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్‌లో శనివారం మూడో టెస్టు ఆరంభమైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుని.. కంగారూలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఆరంభంలో భారత పేసర్ల జోరు
అయితే, వర్షం కారణంగా తొలి రోజు ఆట 13.2 ఓవర్ల వద్ద ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో 28/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆదివారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత పేసర్లు కట్టడి చేశారు. ఓపెనర్లలో నాథన్‌ మెక్‌స్వీనీ(9) అవుట్‌ చేసిన భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. ఉస్మాన్‌ ఖవాజా(21) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

టీమిండియా బౌలర్లకు తలనొప్పి
ఇక ఆంధ్ర కుర్రాడు, టీమిండియా నయా సంచలనం నితీశ్‌ రెడ్డి మార్నస్‌ లబుషేన్‌(12)ను పెవిలియన్‌కు పంపడంతో.. 75 పరుగుల స్కోరు వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అయితే, ట్రవిస్‌ హెడ్‌ రాకతో సీన్‌ రివర్స్‌ అయింది. స్టీవ్‌ స్మిత్‌తో కలిసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. టీమిండియా బౌలర్లకు తలనొప్పిగా మారాడు.

ట్రవిస్‌ హెడ్‌ వరల్డ్‌ రికార్డు.. సరికొత్త చరిత్ర
క్రీజులో పాతుకుపోయిన హెడ్‌.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో 115 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు వరల్డ్‌ రికార్డును సాధించాడు. ఒకే ఏడాదిలో ఒక వేదికపై రెండు ఇన్నింగ్స్‌లోనూ గోల్డెన్‌ డకౌట్‌(కింగ్‌ పెయిర్‌) కావడంతో పాటు.. అదే వేదికపై సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

గత ఏడు ఇన్నింగ్స్‌లో ఇలా
గబ్బా మైదానంలో గత మూడు ఇన్నింగ్స్‌లోనూ ట్రవిస్‌ హెడ్‌ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటయ్యాడు. తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం శతక్కొట్టాడు. ఈ క్రమంలోనే అరుదైన ఘనత అతడి ఖాతాలో జమైంది. గబ్బా స్టేడియంలో గత ఏడు ఇన్నింగ్స్‌లో హెడ్‌ సాధించిన పరుగులు వరుసగా.. 84(187), 24(29), 152(148), 92(96), 0(1), 0(1), 0(1).

ఇక ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఒకే వేదికపై రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్‌ కావడంతో పాటు సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలోనూ ట్రవిస్‌ హెడ్‌ చోటు దక్కించుకున్నాడు. 
ఈ లిస్టులో ఉన్నది వీరే..
1. వాజిర్‌ మహ్మద్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- 1958
2. అల్విన్‌ కాళిచరణ్‌- పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌- 1974
3. మార్వన్‌ ఆటపట్టు- కొలంబో ఎస్‌ఎస్‌సీ- 2001
4. రామ్‌నరేశ్‌ శర్వాణ్‌- కింగ్‌స్టన్‌- 2004
5. మహ్మద్‌ ఆఫ్రాఫుల్‌- చట్టోగ్రామ్‌ ఎంఏ అజీజ్‌- 2004
6. ట్రవిస్‌ హెడ్‌- బ్రిస్బేన్‌ గబ్బా- 2024.

బుమ్రా బౌలింగ్‌లో
ఇదిలా ఉంటే.. ఆదివారం టీ విరామ సమయానికి ఆసీస్‌ 70 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హెడ్‌ సెంచరీ, స్మిత్‌ హాఫ్‌ సెంచరీ(65*) పూర్తి చేసుకున్నారు. కాగా టెస్టుల్లో హెడ్‌కి ఇది తొమ్మిదో శతకం. అదే విధంగా టీమిండియా మీద మూడోది. అంతేకాదు.. ఇందులో రెండు(అడిలైడ్‌, గబ్బా) వరుసగా బాదడం విశేషం.

బ్రేక్‌ అనంతరం.. సెంచరీ(101) పూర్తి చేసుకున్న స్మిత్‌, 152 పరుగులు సాధించిన హెడ్‌ను బుమ్రా అవుట్‌ చేశాడు. ఈ స్పీడ్‌స్టర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు క్యాచ్ ఇచ్చి స్మిత్‌, పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి హెడ్‌ పెవిలియన్‌ చేరారు.

చదవండి: రోహిత్‌ శర్మ నిర్ణయం సరికాదు.. కమిన్స్‌ సంతోషించి ఉంటాడు: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement