జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)... ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. దిగ్గజ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు అందరూ ఇదే మాట చెబుతారనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్లుగా టీమిండియా పేస్ దళ నాయకుడిగా కొనసాగుతున్న బుమ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) 2024-25 సిరీస్‌లోనూ భారమంతా తానే మోస్తున్నాడు.
గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సారథిగా భారత్‌కు భారీ విజయం అందించిన బుమ్రా.. సిడ్నీ టెస్టు సందర్భంగా మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులంతా బుమ్రా నామసర్మణ చేస్తున్నారు. ఆసీస్‌తో ఆఖరి టెస్టు గండాన్ని గట్టెక్కించగలిగే వీరుడు బుమ్రా మాత్రమే అని విశ్వసిస్తున్నారు.
నిజానికి.. స్వదేశంలో జరిగే సిరీస్‌లలో టీమిండియా స్పిన్నర్లదే పైచేయి గా నిలుస్తుంది. కానీ విదేశీ గడ్డపై జరిగే సిరీస్‌లలో అక్కడి పిచ్లకు అనుగుణంగా పేస్ బౌలర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే ఇక్కడే టీమిండియా మేనేజ్‌మెంట్ ముందు చూపుతూ వ్యవహరించడంలో విఫలమైందని చెప్పవచ్చు.
షమీ ఉంటే బుమ్రాపై భారం తగ్గేది
ఆస్ట్రేలియా వంటి ఎంతో ప్రాముఖ్యం గల సిరీస్ ముందుగా పేస్ బౌలర్లని పదును పెట్టడంలో బోర్డు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీకి గాయంతో దూరం కావడం భారత్ జట్టుకు ప్రధాన సమస్యగా మారింది.
షమీ ఎంతో అనుభవజ్ఞుడు. పైగా ఆస్ట్రేలియాలో గతంలో రాణించి తన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. షమీ అండగా ఉన్నట్లయితే బుమ్రా పై ఇంతటి ఒత్తిడి ఉండేది కాదన్నది వాస్తవం.
గతంలో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్ వంటి బౌలర్లు జట్టులో ఉన్నప్పుడు భారత్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండేది. మహమ్మద్ సిరాజ్ చాల కాలంగా జట్టులో ఉన్నప్పటికీ, నిలకడగా రాణించడం లో విఫలమయ్యాడనే చెప్పాలి.
యువ బౌలర్లకు సరైన మార్గదర్శకత్వం ఏది?
ఈ నేపధ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంతోమంది యువ బౌలర్లు రంగ ప్రవేశం చేస్తున్నప్పటికీ వారికి సరైన తర్ఫీదు ఇవ్వడంలోనూ.. సీనియర్ బౌలర్లు గాయాల బారిన పడకుండా వారిని సరైన విధంగా మేనేజ్ చేయడంలో భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు విఫలమైంది.
ఐపీఎల్ పుణ్యమా అని భారత్ క్రికెట్‌కు ప్రస్తుతం పేస్ బౌలర్ల కొరత లేదు. కానీ ఉన్నవారికి సరైన తర్ఫీదు ఇచ్చి వారు అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లో రాణించే విధంగా తీర్చిదిద్దడం కచ్చితంగా బోర్డుదే బాధ్యత.
ఇటీవల కాలంలో ఉమ్రాన్ మాలిక్, మయాంక్ యాదవ్, నవదీప్ సైనీ, శార్దూల ఠాకూర్, అర్షదీప్ సింగ్, వరుణ్ ఆరోన్, టి నటరాజన్ వంటి అనేక మంది యువ బౌలర్లు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. వారికి భారత్ క్రికెట్ జట్టు అవసరాలకి అనుగుణంగా సరైన రీతిలో తర్ఫీదు ఇస్తే బాగుంటుంది.
వాళ్లకు అనుభవం తక్కువ
ఇక తాజా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు బుమ్రా, సిరాజ్‌లతో పాటు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా కూడా ఎంపికయ్యారు. అయితే, ఈ ముగ్గురూ అదనపు పేసర్లుగా అందుబాటులో ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్‌లపైనే భారం పడింది. అయితే, సిరాజ్ నిలకడలేమి కారణంగా బుమ్రా ఒక్కడే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది.
నిజానికి.. బుమ్రా ఈ సిరీస్ లో సంచలనం సృష్టించాడు. ఒంటి చేత్తో తొలి టెస్టులో భారత జట్టుకి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్‌లో ఇంతవరకు 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
మూడు మార్లు ఐదు కన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. 1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ టెస్ట్ మ్యాచ్‌లో అధిగమించడం విశేషం. అయితే, ఆఖరిదైన సిడ్నీ టెస్టులో భాగంగా శనివారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా గాయపడ్డాడు. అయితే, మైదానం నుంచి నిష్క్రమించే ముందు బుమ్రా కీలకమైన ఆస్ట్రేలియన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ని అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు.
చివరి ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌పై అనిశ్చితి
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరుగుతున్న ఐదవ మరియు చివరి టెస్టులో రెండో రోజు ఆటలో అసౌకర్యానికి గురైన బుమ్రా మ్యాచ్ మధ్యలో వైదొలిగాడు. బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది.
మ్యాచ్ అనంతరం పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మాట్లాడుతూ బుమ్రా పరిస్థితిపై వివరణ ఇచ్చాడు. బుమ్రా పరిస్థితిని భారత వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నాడు. "జస్‌ప్రీత్ బుమ్రాకు వెన్నునొప్పి ఉంది. వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది" అని వ్యాఖ్యానించాడు.
3 ఐపీఎల్ సీజన్లకు సరిపడా ఓవర్లు వేశాడు
నిజానికి 2024 నుంచి ఇప్పటి దాకా(జనవరి 4) టెస్టుల్లో అత్యధిక బంతులు బౌల్ చేసింది బుమ్రానే. ఏకంగా 367 ఓవర్లు అంటే.. 2202 బాల్స్ వేసింది అతడే!.. ఈ విషయంలో బుమ్రా తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్(1852 బాల్స్) ఉన్నాడు.
ఇక బుమ్రా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 908 బంతులు వేశాడు. అంటే 151.2 ఓవర్లు అన్నమాట. ఇది ఐపీఎల్ మూడు సీజన్లలో ఒక బౌలర్ వేసే ఓవర్లకు దాదాపు సమానం.
ఐపీఎల్‌లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడి.. ప్రతి మ్యాచ్‌లోనూ నాలుగు ఓవర్ల కోటాను బౌలర్ పూర్తి చేశాడంటే.. మూడు సీజన్లు కలిపి అతడి ఖాతాలో 168 ఓవర్లు జమవుతాయి. అదే.. 13 మ్యాచ్‌లు ఆడితే 156 ఓవర్లు. అదీ సంగతి. ఇంతటి భారం పడితే ఏ పేసర్ అయినా గాయపడకుండా ఉంటాడా? ఇందుకు బోర్డు బాధ్యత వహించనక్కర్లేదా?!
చదవండి: నిజమైన నాయకుడు.. అసలైన లెజెండ్: సురేశ్ రైనా
Comments
Please login to add a commentAdd a comment