భారత్ బ్యాటర్లు తమ తప్పిదాల నుంచి పాఠం నేర్చుకుంటున్నట్టు లేదు. అదే పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్ల అనాధిపత్యానికి తలొగ్గుతున్నారు. అత్యంత ప్రతిష్టాకరమైన చివరి టెస్ట్ లోనూ భారత్ బ్యాటర్లు మరోసారి చతికిలబడి మొదటి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆలౌటయ్యారు. పేలవమైన ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి వైదొలగి విశ్రాంతి తీసుకోగా మిగిలిన బ్యాటర్లు అదే తరహాలో బాధ్యతారహితంగా ఆడి తొలి రోజు నే తమ ప్రత్యర్థులకు ఆధిక్యాన్ని కట్టబెట్టారు.
రోహిత్ శర్మ వైదొలిగినా భారత్ బ్యాటర్ల ఆటతీరుతో ఎలాంటి మార్పు రాలేదు. పిచ్ని అర్థం చేసుకొని నిలదొక్కుకొని ఆడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇందుకు మాజీ కెప్టెన్, జట్టులోని సీనియర్ బాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా ఎలాంటి మినహాయింపు లేదు. మ్యాచ్ కి ముందు చెమటోడ్చి ప్రాక్టీస్ చేసే కోహ్లీ, బ్యాటింగ్ దిగిన వెంటనే తన పాత పంధా నే అనుసరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ప్రతిసారి అతను ఒకే తరహాలో ఔట్ కావడం నమ్మశక్యంగాని చేదు నిజం.
ఎంతో అనుభవజ్ఞుడైన కోహ్లీ కూడా తన బ్యాటింగ్ లోపాలను సరిచేసుకునే ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ అవుటైన తీరు చూస్తే టెస్ట్ క్రికెట్ లో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల శకం ముగిసినట్లే అనిపిస్తోంది. ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్ పది పరుగులు మాత్రం చేసి వెనుదిరిగిన తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కోహ్లీ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినట్టు కనబడలేదు.
కోహ్లీ మొదటి బంతికే వెనుదిరగాల్సింది. పేసర్ స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ పట్టుకొనే ప్రయత్నం లో విఫలమై గాల్లో విసిరివేయగా దానిని మార్నస్ లబుషేన్ పట్టుకున్నప్పటికీ మూడో అంపైర్ జోయెల్ విల్సన్ బంతి నేలను తాకినట్లు తేల్చాడు. ప్రారంభంలోనే ఈ అవకాశం లభించినా కోహ్లీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
69 బంతుల్లో కేవలం 17 పరుగులు చేసిన అనంతరం బోలాండ్ బౌలింగ్ లోనే ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బంతిని బాధ్యతారహితమైన షాట్ కొట్టబోయి మరో సారి స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 36 ఏళ్ళ కోహ్లీ ఈ తరహా లో ఔటవ్వడం ఇది ఆరోసారి. కోహ్లీ ఔటైన అనంతరం మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక రిటైర్ అవ్వడమే మేలని విమర్శకులు దుమ్మెత్తిపోశారు.
రోహిత్ స్థానంలో వచ్చిన శుభ్‌మన్ గిల్ ప్రారంభం లో బాగానే బ్యాటింగ్ చేసాడు. అయితే లంచ్‌కి ముందు చివరి బంతికి స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ లో స్లిప్ల్స్ లో 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఈ సిరీస్ లో గిల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు 20 పరుగులకి చేరుకున్నాడు. కానీ ఒక్కసారి కూడా 31 స్కోర్ ని దాటలేదు.
వికెట్ కీపర్ రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఐదో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ కి చేరుకోగలిగింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖవాజా ని కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత్ ని ఈ టెస్ట్‌లో గట్టికించే బాధ్యత మరో సారి బుమ్రా భుజస్కందాలపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment