క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ చివరి దశకి చేరుకుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో శుక్రవారం ప్రారంభం కానున్న ఐదో టెస్టు ఈ సిరీస్‌లో ఆఖరిది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆసీస్‌తో సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించాలని భారత్ ఆశిస్తోంది.
సిడ్నీలో టీమిండియా రికార్డు ఎలా ఉంది?
అయితే, సిడ్నీలో భారత్ రికార్డు అంతగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే రీతిలో లేదు. ఈ వేదిక మీద భారత్ ఇంతవరకు పదమూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఒక్కసారి మాత్రమే గెలుపొందింది. ఏడు సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. మిగిలిన అయిదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ప్రస్తుత సిరీస్‌లో పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్ తర్వాత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir).. భారత్ సెలెక్టర్లని ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara)ని ఆస్ట్రేలియాకి పంపించాల్సిందిగా కోరినట్టు వార్తలు వచ్చాయి. మెల్‌బోర్న్‌లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో పరాజయం చవిచూసిన నేపథ్యంలో భారత్ జట్టులో ఐకమత్యం లోపించిందని వాటి సారాంశం.
అతడు లేని లోటు సుస్పష్టం
ఈ సంగతిని పక్కనపెడితే.. ప్రస్తుతం టీమిండియాలో పుజారా వంటి బ్యాటర్‌లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టెస్టులో పుజారా రికార్డ్ అటువంటిది మరి. ఆస్ట్రేలియాలో 47.28 సగటుతో 11 మ్యాచ్‌లలో అతడు.. 993 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు సింహస్వప్నంగా నిలిచాడు.
అంతేకాదు.. సిడ్నీ వేదిక పైన పుజారా 2018-19 టెస్ట్‌లో ఏకంగా 193 పరుగులు సాధించి టెస్టును డ్రాగా ముగించాడు. ప్రస్తుత భారత్ జట్టులో అటువంటి పోరాట పటిమ కలిగిన బ్యాటర్లు ఒక్కరూ కన్పించడం లేదు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసినా పట్టించుకోకుండా పుజారా నిబ్బరంగా బ్యాటింగ్ చేసి ఏకంగా 1258 బంతులని ఎదుర్కొన్నాడు.
పుజారాతో కలిసి పంత్ కూడా
జట్టులోని ప్రధాన ఆటగాడు అంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే, మిగిలిన ఆటగాళ్లందరిలో అదే ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. నాటి ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ 169 పరుగులు సాధించి అజేయంగా నిలవడం ఇందుకు నిదర్శనం. పుజారా తో కలిసి అతడు 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం గమనార్హం.
భారత జట్టు పుజారా బ్యాటింగ్ నుంచి నేర్చుకోవాల్సి ఎంతో ఉంది. టెస్టు మ్యాచ్‌లలో బ్యాటింగ్ చాలా భిన్నంగా ఉంటుంది. పుజారా లాగా ప్రత్యర్థి బౌలర్లను నిబ్బరంగా ఎదుర్కొనే ధైర్యం ప్రస్తుత భారత్ బ్యాటర్లలో కొరవడిందని నిర్వివాదాంశం. ఏది ఏమైనా ప్రస్తుత భారత్ జట్టులో పుజారా వంటి బ్యాటర్ లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇదే ఆస్ట్రేలియా ఆటగాళ్లు కోరుకునేది.
కనీసం డ్రా అయినా
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేలవమైన ఫామ్.. టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన తప్పిదాలు ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చాయి. కనీసం చివరి టెస్టులోనైనా భారత ఆటగాళ్లు తమ తడబాటు ధోరణి తగ్గించుకొని టెస్ట్ మ్యాచ్‌కి అనుగుణంగా బ్యాటింగ్ చేస్తే.. ఈ సిరీస్‌ని డ్రా చేసుకున్న తృప్తి అయినా మిగులుతుంది.
చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment