ఆద్యంతం ఆసక్తి రేపిన భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌ను రోహిత్ సేన 1-3తో ఓడి పరాజయంతో ముగించింది. తద్వారా పదేళ్ల తర్వాత కంగారూ జట్టు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar)ని తమ సొంతం చేసుకుంది.
అయితే, స్వదేశంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల అద్భుత ప్రదర్శన కారణంగానే ఇది సాధ్యమైందా? అంటే.. నిజంగా లేదనే చెప్పాలి. భారత్ బ్యాటర్ల తప్పిదాల వల్లే ఆసీస్ జట్టుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ విజయం దక్కిందని చెప్పక తప్పదు.
ఈ సిరీస్ లో భారత్ తరుఫున పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్కడు మాత్రమే అద్భుతంగా ఆడాడు. నిజానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ సైతం ఈ విషయాన్నిఅంగీకరించరు. వాస్తవానికి ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ బుమ్రా ని ఎదుర్కొనడానికి భయపడ్డారనేది చేదు నిజం.
'బుమ్రా వేరే గ్రహం నుంచి వచ్చాడా?'
మెల్‌బోర్న్ టెస్టు అనంతరం ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ సైతం బుమ్రా పై ప్రశంసలు కురిపించడం విశేషం. "బుమ్రా ఒక్కడూ వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఆడుతున్నాడు" అని గిల్‌క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. గిల్‌క్రిస్ట్ మాత్రమే కాకుండా అనేక మంది ఇతర మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సైతం బుమ్రాని ప్రశంసలతో ముంచెత్తారు. బుమ్రాని వాళ్ళు వెస్టిండీస్ దిగ్గజాలతో పోల్చడం విశేషం.
ఆదివారం సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో బుమ్రా మైదానంలోకి రాకపోవడంతో భారత్ ఓటమి ఖాయమైపోయింది. ఈ మ్యాచ్ కి ముందు బుమ్రా హావభావాలను భారత్ ఆటగాళ్లకన్నా ఆస్ట్రేలియా క్రికెటర్లు, వాళ్ళ అభిమానులు, కామెంటేటర్లు ఎక్కువగా నిశితంగా పరిశీలించాలంటే అతని ప్రాముఖ్యమేమిటో అర్ధమౌతుంది.
ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో నాలుగో రోజు బుమ్రా భారత్ ని గెలిపించేందుకు బాగా శ్రమించడంతో అతని శరీరం తట్టుకోలేకపోయింది. దీని ఫలితంగా, ఈ సిరీస్‌లో ఏకంగా 32 వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియాలో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పినప్పటికీ భారత్ పరాజయంతో వెనుదిరగాల్సి వచ్చింది.
ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ అంతంతమాత్రమే
ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాట్సమెన్ మెరుగ్గా ఆడారనడం సరికాదు. అయితే ఆస్ట్రేలియా బ్యాటర్ల ప్రతిభ కన్నా భారత్ బ్యాటింగ్ లైనప్‌లో అస్థిరత వారిని గెలిపించిందంటే సబబుగా ఉంటుందేమో. ఈ సిరీస్ లో భారత్ బ్యాటర్ల టాప్ ఆర్డర్ (1 నుండి 7) వరకు సగటు 24.67తో పోలిస్తే.. ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ సగటు 28.79 మాత్రమే. టీమిండియా బ్యాటర్ల రెండు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలతో పోలిస్తే.. ఇక్కడ ఆస్ట్రేలియా బ్యాటర్ల నాలుగు సెంచరీలు, ఎనిమిది అర్ధసెంచరీలతో కాస్త పైచేయి సాధించారు.
ఇక తొమ్మిదో స్థానం నుంచి పదకొండో స్థానాల బ్యాటర్ల ఆట తీరును పరిగణనలోకి తీసుకుంటే.. భారత్ సగటు 9.64తో కాగా ఆస్ట్రేలియా సగటు 15గా నమోదైంది. ఇక ఈ సిరీస్‌లో బుమ్రా తర్వాత మరో సానుకూలాంశం యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్. అతడు 43.44 సగటుతో 391 పరుగులు సాధించి ఈ సిరీస్‌లో భారత్ తరఫున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి అడపాదడపా మెరుపులు మెరిపించారు కానీ నిలకడగా రాణించలేదు.
ఇక రిషబ్ పంత్ చివరి మ్యాచ్ లో అబ్బురపరిచాడు. అయితే, ఈ సిరీస్‌లో టీమిండియా తరఫున ప్రధానంగా వైఫల్యం చెందినది మాత్రం కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పక తప్పదు.రోహిత్ శర్మ అయిదు ఇన్నింగ్స్‌లలో 6.20 సగటు కేవలం 31 పరుగులు సాధించగా, కోహ్లీ ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉండటం విశేషం.
మేనేజ్‌మెంట్ తప్పిదాలు కూడా
మొత్తం మీద భారత్ బ్యాటర్ల వైఫల్యం.. టీమ్ మేనేజ్‌మెంట్ తప్పిదాలే టీమిండియా కొంపముంచాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మెల్‌బోర్న్ నాలుగో రోజు ఆటముగిసేలోగా ఆస్ట్రేలియా బ్యాటర్లని ఆలౌట్ చేయడంలో వైఫల్యం.. అదే రోజు యశస్వి జైస్వాల్ వరుసగా క్యాచ్‌లు జారవిడవడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక మెల్‌బోర్న్‌లో గెలుపొంది ఆధిక్యం సంపాదించిన ఆస్ట్రేలియా.. అదే ఆత్మవిశ్వాసం తో సిడ్నీలో గెలిచి పదేళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment