సిడ్నీ టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ ఓటమితో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను జారవిడుచుకుంది.
డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే సిడ్నీ టెస్టులో భారత్ గెలవాల్సి ఉండింది. అయితే టాపార్డర్ బ్యాటర్ల ఘోర వైఫల్యం కారణంగా భారత్ ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది.
భారత్ ఆధిపత్యానికి తెరపడింది
ఈ సిరీస్‌లో భారత్ వైఫల్యం ఊహించిందే. భారత్ పది సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కోల్పోవడం బాధాకరం. 2018-19 మరియు 2021-22లో ఆస్ట్రేలియా గడ్డ పై వరుసగా రెండు సార్లు అద్భుతమైన ప్రదర్శనలతో చాలా కాలం పాటు ఈ ట్రోఫీ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించడం భారత్ క్రికెట్‌కు ఏంతో గర్వకారణం. అయితే ఇలా ఓటమి చెందడం భారత్ క్రికెట్ అభిమానులకి ఒకింత బాధాకరమే.
అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 0-3తో ఘోర ఓటమి చవిచూసిన అనంతరం జరిగిన ఈ టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. గతంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వరుసగా రెండుసార్లు ఓటమి చవిచూడటం, గత కొంత కాలంగా టెస్టుల్లో భారత్ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయి లో లేదనేది వాస్తవం. ఇది భారత్ క్రికెట్ అభిమానులు అంగీకరించక తప్పదు. ఈ నేపథ్యంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ అద్భుతంగా రాణిస్తుందని భావించడం హాస్యాస్పదమే.
భారత్ బ్యాటర్ల ఘోర వైఫల్యం
క్రికెట్లోని పాత నానుడిని భారత్ అభిమానులు ఇక్కడ గుర్తు చేసుకోవాలి. " బ్యాటర్లు మ్యాచ్‌లను గెలిపిస్తారు. బౌలర్లు సిరీస్‌లను గెలిపిస్తారు" అనేది ఈ సిరీస్ లో మరో మారు నిజమైంది. హేమాహేమీలైన భారత్ బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమవడంతో భారత్ టాపార్డర్ బ్యాటర్లు చతికిలపడ్డారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అడపా దడపా మెరుపులు మెరిపించినా , ప్రతీసారి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆడతారని భావించడం సరైన పద్దతి కాదు.
భారత్ టాపార్డర్ బ్యాటర్లు అదీ ఓపెనర్ కేఎల్ రాహుల్, ఎడమ చేతి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ సిరీస్ లోని తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ భాగస్వామ్యం మినహాయిస్తే, భారత్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా నిలదొక్కుకొని ఆడినట్టు కనిపించ లేదు. ఆస్ట్రేలియా వంటి ఏంతో ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఈ రీతిలో బ్యాటింగ్ చేస్తే భారత్ జట్టు గెలుస్తుందని ఆశించడం కూడా తప్పే!
బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా
ఈ సిరీస్ మొత్తం పేస్ స్పియర్‌హెడ్ జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అన్న రీతిలో సాగింది. బుమ్రా ఈ సిరీస్ లో ఒంటి చేత్తో భారత్ జట్టుని నడిపించాడు. తన అద్భుత ప్రదర్శన తో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ లో భారత్ కి విజయం చేకూర్చాడు. ఈ సిరీస్ లో మొత్తం 12.64 సగటుతో 32 వికెట్లు పడగొట్టి, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు.
1977-78 ఆస్ట్రేలియా పర్యటనలో బిషన్ సింగ్ బేడీ 31 వికెట్ల రికార్డును బుమ్రా ఈ సిరీస్ లో అధిగమించడం విశేషం. గాయంతో బుమ్రా చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ముందు వైదొలగడంతో ఈ సిరీస్ ని కనీసం డ్రా చేయాలన్న భారత్ ఆశలు అడుగంటాయి. బుమ్రా లేని భారత్ బౌలింగ్ అనేకమంది హేమాహెమీలున్న ఆస్ట్రేలియా జట్టును సొంత గడ్డపై తక్కువ స్కోరు కి ఆలౌట్ చేస్తుందని భావించడం అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉండదు!
Comments
Please login to add a commentAdd a comment