త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ వన్డే సిరీస్, తర్వాత ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో పాల్గొనే భారత్ జట్టుకి హైదరాబాద్ పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఎంపిక చేయకపోవడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. ఈ జట్టులో సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ తో పాటు ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు స్థానం లభించింది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ కి వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్న బుమ్రా స్థానంలో హర్షిత్ రాణాను ఎంపిక చేశారు.
30 ఏళ్ల సిరాజ్ గత మూడు సంవత్సరాలుగా వన్డే ఫార్మాట్‌లో భారత్ ప్రధాన పేస్ బౌలర్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. 2023లో శ్రీలంకతో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన (6/21)తో ప్రత్యర్థి జట్టును 50 పరుగులకే ఆలౌట్ చేసాడు. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో సైతం రాణించి 14 వికెట్లు తీసి భారత్ జట్టు రన్నరప్ గా నిలవడంతో తన వంతు పాత్ర పోషించాడు. ఇంతవరకు 44 వన్డే మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసిన సిరాజ్ కి భారత్ జట్టులో స్థానం దక్కక పోవడం ఆశ్చర్యకర పరిణామం.
అయితే బుమ్రా పూర్తిగా కోలుకుంటాడో లేదో ఇంకా పూర్తిగా తెలీదు. ఏంతో అనుభవజ్ఞుడైన ప్పటికీ గాయం నుంచి కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తున్న షమీ ఎలా రాణిస్తాడో తెలీదు. ఈ నేపధ్యం లో సిరాజ్‌కు బదులుగా ఇప్పటివరకు ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడిన ఎడమచేతి వాటం బౌలర్ అర్ష్‌దీప్‌ను జట్టుకి ఎంపిక చేయడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ ముగ్గురితో పాటు, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లకు హార్దిక్ పాండ్యా భారత పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గ జట్టు లో ఉంటాడు.
సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం బుమ్రా ఫిట్‌నెస్ గురించి ప్రశ్నలు తలెత్తినప్పుడు, కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, “జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో మాకు ఖచ్చితంగా తెలియదు. అందుకే కొత్త బంతితో మరియు పాత బంతితో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్ ని జట్టులోకి తీసుకున్నాము. జట్టులో సిరాజ్ లేకపోవడం దురదృష్టకరం," అని అన్నాడు.
అయితే ఇటీవల జరిగిన గవాస్కర్-బోర్డర్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో సిరాజ్ రాణించినప్పటికీ, జట్టుకి అవసరమైన సమయంలో అతను వికెట్లు తీయలేక పోయాడన్నది వాస్తవం. బుమ్రా ఐదు టెస్టుల్లో 34.82 సగటు తో 32 వికెట్లు పడగొట్టాడు. విదేశీ పర్యటన లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ లో అయిదు టెస్ట్ మ్యాచ్ లు ఆడి 31.15 సగటు తో 20 వికెట్లు పడగొట్టినప్పటికీ కీలక సమయంలో మరో వైపు రాణిస్తున్న బుమ్రాకి సిరాజ్ సరైన చేయూత ఇవ్వలేకపోయాడు. బహుశా ఈ కారణంగానే సెలెక్టర్లు సిరాజ్ ని జట్టు నుంచి తప్పించారని భావించాలి. అయితే తన లోపాలను సరిదిద్దుకొని మళ్ళీ జట్లులోకి రాగాల సత్తా సిరాజ్ కి ఉంది. అయితే ఇందుకోసం సిరాజ్ చిత్తశుద్ధి తో ప్రయత్నించాలి. షమీ మళ్ళీ జట్టు లోకి వచ్చినప్పటికీ 34 ఏళ్ళ వయస్సులో సుదీర్ఘ కాలం జట్టులో కొనసాగే అవకాశాలు తక్కువే. ఇప్పటికే అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించి ఎంతో అనుభవం సంపాదించిన సిరాజ్ తన బౌలింగ్ కి మరింత మెరుగులు దిద్దుకొని రాణిస్తాడని ఆశిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment