Champions trohy
-
మళ్ళీ పాత పాటే పాడిన బీసీసీఐ సెలక్టర్లు
ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.కరుణ్ నాయర్‌కు మొండిచేయి33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లుజట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.అగార్కర్ కంటి తుడుపు మాటలు జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదుఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. -
విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌లో సెంచరీలు కొట్టాలి: యూనిస్ ఖాన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని యూనిస్ విజ్ఞప్తి చేశాడు. పాక్ అభిమానులంతా విరాట్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. పాక్‌కు వచ్చి సెంచరీలు చేయడం ఒక్కటే విరాట్ కెరీర్లో లోటుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. విరాట్‌కు పాక్‌లో చాలామంది అభిమానులున్నారని తెలిపాడు.కాగా, యూనిస్ ఖాన్ లాగే చాలా మంది మాజీలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు. బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బీసీసీఐకు సంబంధించిన కొందరు వ్యక్తులు అందిస్తున్న సమాచారం మేరకు భారత ప్రభుత్వం టీమిండియా పాక్‌లో పర్యటించేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీని కోరినట్లు సమాచారం. భారత్ అభ్యర్దనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోని పీసీబీ వస్తే రాండీ.. పోతే పోండీ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఐసీసీ సమావేశంలో కూడా పాక్ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే అంశాన్ని పాక్ ఐసీసీకి వదిలిపెట్టినట్లు సమాచారం. టోర్నీ ప్రారంభానికి చాలా సమయం ఉండటంతో ఈ విషయంపై మున్ముందు మరిన్ని చర్చలకు ఆస్కారం ఉంది. క్రికెట్‌ను అభిమానించే నిజమైన భారతీయులు మాత్రం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు. కాగా, ముంబై దాడుల ఘటన అనంతరం టీమిండియా పాకిస్తాన్లో పర్యటించని విషయం తెలిసిందే. ఈ మధ్యలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్‌లు ఎదురెదురుపడ్డాయి. ఇటీవలికాలంలో భారత్, పాక్ తలపడినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మంచి సఖ్యత ఉన్నట్లు కనిపించింది. పాక్ జట్టులోని కొందరు విరాట్, రోహిత్ శర్మలతో కలిసి మెలిసి తిరిగారు. బాబర్, రిజ్వాన్ లాంటి పాక్ స్టార్లు పలు సందర్భాల్లో విరాట్, రోహిత్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తంగా చూస్తే.. భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య సహృదయ వాతావరణం ఉన్నట్లే కనిపిస్తుంది. మరి టీమిండియా ఈసారైనా పాక్‌లో పర్యటిస్తుందో లేదో వేచి చూడాలి. -
నేటి నుంచి ‘నంబర్‌వన్’ పోరాటం
మ. గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్.... ఈ హోదా ఉన్న జట్టు ఎలా ఆడాలో భారత్ అలాగే ఆడుతోంది. వన్డేల్లో ఇటీవల కాలంలో ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించగలమనే ధీమాను చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఏడు వన్డేల సిరీస్ ఆడేందుకు భారత్ వచ్చింది. అది కూడా 6-1తో సిరీస్ గెలిస్తే నంబర్ వన్ ర్యాంక్ సాధించొచ్చు అనే లక్ష్యంతో. కానీ ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి చూస్తే... కనీసం 4-3తో సిరీస్ గెలవడం కూడా అద్భుతమే అనుకోవాలి. పుణే: చాంపియన్స్ ట్రోఫీ, ముక్కోణపు సిరీస్, జింబాబ్వేతో వన్డే సిరీస్...ఇలా గత మూడు వన్డే టోర్నీలు చూస్తే భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతుంది. ఏ ఒక్కరిపైనో ఆధార పడకుండా జట్టులో ప్రతీ ఒక్కరూ తమ బాధ్యత సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు. దాంతో ఎలాంటి తడబాటు లేకుండా విజయాలు ధోనిసేన వశమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కచ్చితంగా భారత్ ఫేవరెట్. టి20 మ్యాచ్‌లో ఏకంగా 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్... వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అసలే అనుభవం లేని ఆటగాళ్లతో ఇబ్బంది పడుతున్న కంగారూలు ఈ సిరీస్ గెలవాలంటే అద్భుతాలు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం పుణేలోని సుబ్రతోరాయ్ సహారా స్టేడియంలో జరుగుతుంది. సమష్టితత్వం... టి20లో సంచలన విజయం సాధించిన జట్టుతోనే భారత్ తొలి వన్డేలోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి రాయుడు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, ధోని, జడేజాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక టి20 మ్యాచ్‌లో 35 బంతుల్లోనే అజేయంగా 77 పరుగులతో చెలరేగి యువరాజ్ ఫామ్‌లోకి రావడం భారత్ బలాన్ని మరింత పెంచింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా టి20 కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వన్డేల్లో భువనేశ్వర్, అశ్విన్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా కూడా చాలా కాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. స్పిన్నర్లను ఎదుర్కోలేని ఆసీస్ కొత్త కుర్రాళ్ల బలహీనతను భారత బౌలర్లు సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన గత రెండు వన్డేల్లోనూ ధోని టీమ్ గెలిచింది. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ (2011) తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో వన్డే ఆడలేదు. వాట్సన్ మినహా... క్లార్క్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కొరత ఏర్పడింది. అందులోనూ భారత గడ్డపై ఎవరూ పెద్దగా ఆడింది లేదు. జట్టులో వాట్సన్, మిచెల్ జాన్సన్లకే వందకుపైగా వన్డేలతో పాటు ఐపీఎల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. దాంతో వాట్సన్‌పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధార పడింది. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్ నెగ్గడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. అయితే టి20 తరహాలో కాకుండా 50 ఓవర్ల పాటు ఆసీస్ నిలబడటం కీలకం. కెప్టెన్ బెయిలీ, ఫించ్, వన్డే స్పెషలిస్ట్ వోజెస్, ఫెర్గూసన్ ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్. మెక్కే, ఫాల్క్‌నర్, కౌల్టర్, వాట్సన్ ప్రధాన బౌలర్లు. ఆల్‌రౌండర్‌గా మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. సమర్ధుడైన స్పిన్నర్ లేకపోవడం ఆసీస్ బలహీనత. జట్టులో డోహర్తి ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్ కాగా, భారత్‌పై లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఎప్పుడూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యం లో తొలి వన్డేకు ముందు అన్ని రంగాల్లో భారత్ ఆధిక్యంలో కనిపిస్తోంది. జట్లు (అంచనా) భారత్: ధోని(కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, వినయ్ కుమార్. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, హ్యూస్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, హాడిన్, మెక్కే, జాన్సన్, ఫాల్క్‌నర్, డోహర్తి.