ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ ౩-1 తేడాతో ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్, దుబాయ్-పాకిస్తాన్ లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి భారత్ జట్టు ఎంపిక క్రికెట్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత భారత్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తినట్టు దుమారం చెలరేగడం, విదేశీ పర్యటనలో కొంతమంది స్టార్ క్రికెటర్ల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
ఆస్ట్రేలియా సిరీస్ పరాజయం తర్వాత భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రక్షాళన చేయబోతున్నట్టు ప్రకటించి ఇందుకోసం పది మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో దేశవాళీ పోటీల్లో అందరూ తప్పనిసరిగా ఆడాలని సిఫార్సు చేసింది. భారత్ జట్టు ఎంపిక దేశవాళీ పోటీలలో క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల తర్వాత జరిగిన భారత్ జట్టు ఎంపిక విషయంలో ఈ నిబంధనలేవీ పాటించినట్లు కనిపించలేదు. కంటితుడుపు ప్రకటనలు తప్ప దేశవాళీ పోటీల్లో పరుగుల ప్రవాహం సృష్టిస్తున్న విదర్భ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ కి మరో మరు మొండి చేయి చూపించడమే ఇందుకు చక్కని ఉదాహరణ. మరి దేశవాళీ టోర్నమెంట్లలో అద్భుతంగా ఆడి ప్రయోజనమేంటో అర్థం కాదు.
కరుణ్ నాయర్‌కు మొండిచేయి
33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తరపున ఆడుతూ ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 752 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో నాయర్ బ్యాటింగ్ సగటు 752.00. నాయర్ ఏడు ఇన్నింగ్స్‌లలో ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. విదర్భకు సారధి అయిన నాయర్ జట్టు ఫైనల్ కి చేరడంలో కీలక భూమిక వహించాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్ దేశవాళీ పోటీల్లో వన్డే ఫార్మాట్ లో జరుగుతుండటం ఇక్కడ గమమనించాల్సిన మరో ముఖ్యాంశం.
నాయర్ పై సచిన్ ప్రశంసల జల్లు
జట్టు ఎంపికకు కొద్ది గంటల ముందు ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే టోర్నమెంట్ లో నాయర్ ప్రదర్శన పై లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ప్రశంసల జల్లు కురిపించాడు. " 7 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలతో 752 పరుగులు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఈ స్థాయి లో రాణించాలంటే అపారమైన కృషి, పట్టుదల అవసరం. ఇదే రీతిలో ఆడి మరిన్ని ఘన విజయాలు సాధిస్తావని ఆశిస్తున్నా!, అని సచిన్ స్వయంగా కరుణ్ నాయర్ కి ట్వీట్ చేసాడు. అయితే భారత్ జట్టు ఎంపిక సమయంలో ఇవేమి లెక్కలోకి రాలేదు.
అగార్కర్ కంటి తుడుపు మాటలు
జట్టు ఎంపిక అనంతరం భారత్ జట్టు సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ టెస్ట్ క్రికెటర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నాయర్ ప్రస్తుత అద్భుతమైన ఫామ్ ను, అత్యుత్తమ గణాంకాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకుందని చెబుతూనే, జట్టు సెలక్షన్ కమిటీ చాలా కఠినమైన పరీక్షను ఎదుర్కొందని వివరించాడు. “ 750-ప్లస్ సగటు తో పరుగులు సాధించడం మామూలు విషయం కాదు. అయితే మేము 15 మందితో కూడిన జట్టు ను మాత్రమే ఎంపిక చేయాలి. అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు," అని తేల్చి చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమైనప్పటికీ, అయితే జట్టు సమతౌల్యం విషయాన్ని కూడా సెలక్షన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, వివరించాడు. అంతర్జాతీయ అనుభవం మరియు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఎంతో ప్రాధాన్యం ఉన్న టోర్నమెంట్‌లో ఆడే క్రికెటర్ల పై ఎంతో ఒత్తిడి ఉండనుందని. ఈ కారణంగా అనుభవం ఉన్నవారికే ప్రాధాన్యమిచ్చామని వివరించాడు.
రోహిత్, కోహ్లీలకు ఢోకా లేదు
ఊహించిన విధంగానే ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ లను ఇంగ్లాండ్ సీరీస్ కి, ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ కి ఎంపిక చేయడం విశేషం. ఆస్ట్రేలియా పిచ్ ల పై ఘోరంగా విఫలమైన ఈ ఇద్దరూ సీనియర్ ఆటగాళ్లు దుబాయ్ లోని బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ ల పై రాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. ప్రధానంగా వీరిద్దరి వైఫల్యం కారణంగానే భారత్ జట్టు ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ లో ఘోర పరాజయం చవిచూసింది. అయితే అపార అనుభవం కారణంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో వీరిద్దరి కి స్థానం కల్పించారు.
అయితే ఆస్ట్రేలియా పర్యటనలో అంతగా రాణించలేకపోయిన ఓపెనర్ శుభమన్ గిల్ మళ్ళీ జట్టులో స్థానము కల్పించడమే కాకా, వైస్ కెప్టెన్ గా నియమించడం ఆశ్చర్యం కలిగించింది. “గిల్ గతంలో శ్రీలంకలో జరిగిన సీరీస్ లో వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్ల వ్యవహారశైలిని కూడా ఎంపిక సమయంలో పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్లకు నాయకత్వం వహిస్తున్నారు. జట్టుకి నాయకత్వం వహించే నైపుణ్యం ఉన్న ఆటగాళ్ల పై ఎప్పుడూ ద్రుష్టి పెట్టాల్సిందే, ”అని అగార్కర్ చెప్పాడు.
ఫిబ్రవరి 6న ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరి 20న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత్ జట్టు ఎంపిక అయితే పూర్తయింది. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ జట్టు ఎలా రాణిస్తుందో అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం.
Comments
Please login to add a commentAdd a comment