టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాలని యూనిస్ విజ్ఞప్తి చేశాడు. పాక్ అభిమానులంతా విరాట్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. పాక్‌కు వచ్చి సెంచరీలు చేయడం ఒక్కటే విరాట్ కెరీర్‌లో లోటుగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. విరాట్‌కు పాక్‌లో చాలామంది అభిమానులున్నారని తెలిపాడు.
కాగా, యూనిస్ ఖాన్ లాగే చాలా మంది మాజీలు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు. బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. బీసీసీఐకు సంబంధించిన కొందరు వ్యక్తులు అందిస్తున్న సమాచారం మేరకు భారత ప్రభుత్వం టీమిండియా పాక్‌లో పర్యటించేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీని కోరినట్లు సమాచారం.
భారత్ అభ్యర్దనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోని పీసీబీ వస్తే రాండీ.. పోతే పోండీ అన్న రీతిలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఐసీసీ సమావేశంలో కూడా పాక్ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనే అంశాన్ని పాక్ ఐసీసీకి వదిలిపెట్టినట్లు సమాచారం. టోర్నీ ప్రారంభానికి చాలా సమయం ఉండటంతో ఈ విషయంపై మున్ముందు మరిన్ని చర్చలకు ఆస్కారం ఉంది. క్రికెట్‌ను అభిమానించే నిజమైన భారతీయులు మాత్రం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు.
కాగా, ముంబై దాడుల ఘటన అనంతరం టీమిండియా పాకిస్తాన్‌లో పర్యటించని విషయం తెలిసిందే. ఈ మధ్యలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాక్‌లు ఎదురెదురుపడ్డాయి. ఇటీవలికాలంలో భారత్, పాక్ తలపడినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మంచి సఖ్యత ఉన్నట్లు కనిపించింది. పాక్ జట్టులోని కొందరు విరాట్, రోహిత్ శర్మలతో కలిసి మెలిసి తిరిగారు. బాబర్, రిజ్వాన్ లాంటి పాక్ స్టార్లు పలు సందర్భాల్లో విరాట్, రోహిత్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. మొత్తంగా చూస్తే.. భారత్, పాక్ ఆటగాళ్ల మధ్య సహృదయ వాతావరణం ఉన్నట్లే కనిపిస్తుంది. మరి టీమిండియా ఈసారైనా పాక్‌లో పర్యటిస్తుందో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment