ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. పేసర్ల విజృంభణ కారణంగా పటిష్ట స్థితిలో నిలిచింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆసీస్ టూర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం పెర్త్‌లో మొదటి టెస్టు ఆరంభమైంది.
ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగడంతో
టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్, ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, బాల్ ఆది నుంచే బాగా స్వింగ్ కావడంతో భారత బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. తమకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఆసీస్ పేసర్లు ఆది నుంచే చెలరేగారు. మిచెల్ స్టార్క్ టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను డకౌట్ చేసి ఆసీస్‌కు శుభారంభం అందించాడు.
అదే విధంగా.. క్రీజులో నిలదొక్కున్న మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(26)ను సైతం స్టార్క్ పెవిలియన్‌కు పంపాడు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్ వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0)ను అవుట్ చేసి తన ఖాతా తెరిచాడు. అంతేకాదు కీలకమైన విరాట్ కోహ్లి(5) వికెట్‌ను కూడా తానే దక్కించుకున్నాడు.
పంత్, నితీశ్ రాణించగా..
అయితే, రిషభ్ పంత్(37), అరంగేట్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(41) పట్టుదలగా నిలబడి.. ఆసీస్ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ .. టీమిండియాను మెరుగైన స్కోరు దిశగా నడిపించారు. వీరిద్దరు రాణించడం వల్ల.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా వాళ్లలో ధ్రువ్ జురెల్(11), వాషింగ్టన్ సుందర్(4), హర్షిత్ రాణా(7), కెప్టెన్ బుమ్రా(8) నిరాశపరిచారు.
వికెట్ల వేట మొదలు పెట్టిన బుమ్రా
ఆసీస్ పేసర్లలో హాజిల్‌వుడ్ ఓవరాల్‌గా నాలుగు, కమిన్స్, స్టార్క్, మిచెల్ మార్ష్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియాకు.. బుమ్రా ఆది నుంచే చుక్కలు చూపించాడు. ఓపెనర్, అరంగేట్ర బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని అవుట్ చేసి వికెట్ల వేట మొదలుపెట్టాడు.
ఒకే ఓవర్లో ఇద్దరిని అవుట్ చేసి
ఆ తర్వాత ఒకే ఓవర్లో స్టీవ్ స్మిత్(0), ఉస్మాన్ ఖవాజా(8)లను అవుట్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఆసీస్ కష్టాల్లో పడిన వేళ.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ పరుగులు చేయకపోయినా.. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.
హర్షిత్ రాణాకు తొలి వికెట్
మొత్తంగా 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు చేసిన లబుషేన్‌ను సిరాజ్ అవుట్ చేశాడు. అంతకు ముందు మార్ష్(6) వికెట్‌ను కూడా సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ట్రవిస్ హెడ్(11)ను బౌల్డ్ చేసి హర్షిత్ రాణా టెస్టుల్లో తన తొలి వికెట్ నమోదు చేయగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(3) వికెట్‌ను భారత సారథి బుమ్రా దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా 27 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 67 మాత్రమే పరుగులు చేసింది. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ కంటే 83 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
కాగా అలెక్స్ క్యారీ(19*), స్టార్క్(6*) మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి క్రీజులో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా ఓవరాల్‌గా నాలుగు వికెట్లు తీయగా.. సిరాజ్ రెండు, రాణా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
చదవండి: బుమ్రాను ఒప్పించిన కోహ్లి.. ఆరంభంలోనే ఆసీస్‌కు షాకులు
Comments
Please login to add a commentAdd a comment