యువ పేసర్ ప్రసిద్ కృష్ణ సేవలను ఉపయోగించుకోవడంలో టీమిండియా యాజమాన్యం విఫలమైందని భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ అన్నాడు. ఫామ్‌లో ఉన్న బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. వేరొకరిని తుదిజట్టులో ఆడించడం కోసం ప్రసిద్‌ను పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా 2023లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు 28 ఏళ్ల ప్రసిద్(Prasidh Krishna).
షమీ లేకపోవడంతో
కర్ణాటకకు చెందిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చి.. రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే, బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)కి సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరమైన కారణంగా ప్రసిద్‌కు మరోసారి టెస్టు జట్టులో చోటు దక్కింది.
పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్‌లతో కలిసి ఫాస్ట్ బౌలర్ల విభాగంలో ప్రసిద్ స్థానం సంపాదించాడు.
అయితే, బుమ్రా, సిరాజ్‌లతో పాటు హర్షిత్ రాణాకు మేనేజ్‌మెంట్ ప్రాధాన్యం ఇచ్చింది. పెర్త్ వేదికగా అతడికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ కృష్ణకు మొండిచేయి ఎదురైంది.
ఆకాశ్ దీప్ గాయం కారణంగా
ఇక ఆసీస్‌తో తొలి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన హర్షిత్ రాణా.. అడిలైడ్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం తేలిపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో హర్షిత్‌పై వేటు వేసిన యాజమాన్యం.. తర్వాతి రెండు టెస్టుల్లో ఆకాశ్ దీప్‌ను ఆడించింది. దీంతో మరోసారి ప్రసిద్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
అయితే, కీలకమైన ఐదో టెస్టుకు ముందు ఆకాశ్ గాయపడటంతో ప్రసిద్ కృష్ణకు ఎట్టకేలకు తుదిజట్టులో చోటు దక్కింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఆఖరి టెస్టులో ప్రసిద్ మెరుగ్గా రాణించాడు. స్టీవ్ స్మిత్(33), అలెక్స్ క్యారీ(21), బ్యూ వెబ్‌స్టర్(57) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.
అనధికారిక సిరీస్‌లోనూ సత్తా చాటి
మొత్తంగా 15 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఇలా విలువైన వికెట్లు తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకే ఆలౌట్ చేయడంలో ప్రసిద్ తన వంతు పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తన సత్తా ఏమిటో చాటుకోగలిగాడు. అంతేకాదు.. అంతకు ముందు భారత్-‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ప్రసిద్ కృష్ణ పది వికెట్లతో మెరిశాడు.
తప్పు చేశారు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్ స్పందిస్తూ.. ‘‘టెస్టు సిరీస్ మొదలుకావడానికి ముందు భారత్-‘ఎ’ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉందో చూసిన తర్వాత కూడా.. ప్రసిద్‌ను కాదని హర్షిత్ రాణాను ఎంపిక చేయడం బుర్రలేని పని.
ప్రసిద్ మంచి రిథమ్‌లో ఉన్నాడు. అయినా సరే.. సిరీస్ ఆరంభం నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకోకుండా మేనేజ్‌మెంట్ తప్పుచేసింది’’ అని పేర్కొన్నాడు.
కాగా సిడ్నీ వేదికగా శుక్రవారం మొదలైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లొ 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఆసీస్‌ను 181 పరుగులకే కుప్పకూల్చి నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది.
అనంతరం శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బారత్ 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని ఆసీస్ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: IND vs AUS: పంత్ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment