
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) గెలిచిన టీమిండియా దాదాపు రెండున్నర నెలల విరామం తర్వాత మైదానంలో దిగనుంది. ఐపీఎల్-2025 ముగిసిన తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్‌లో వెళ్లనున్న ఈ టూర్‌లో భాగంగా ఇంగ్లిష్ జట్టుతో ఐదు టెస్టులు ఆడనుంది.
వరుస ఓటములు
కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma)కు, హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌కు ఇది విషమ పరీక్ష కానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ అత్యుత్తమంగా కొనసాగుతున్నా.. కొంతకాలంగా టెస్టుల్లో మాత్రం తేలిపోతోంది.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్ కావడం.. ఆస్ట్రేలియా గడ్డపై ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో ఓడిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో సత్తా చాటితేనే రోహిత్- గంభీర్ జోడీకి కాస్త ఉపశమనం లభిస్తుంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమని చెప్పాడు. అంతేకాదు.. ఆసీస్‌తో టెస్టుల్లో తాను ఆడి ఉంటే హ్యాట్రిక్ కొట్టేవాళ్లమని పేర్కొన్నాడు.
ఈ మేరకు.. ‘‘క్రికెటర్‌గా జాతీయ జట్టుకు ఆడాలని నాకూ ఉంటుంది. ఇంగ్లండ్‌తో తదుపరి టెస్టు సిరీస్‌కు నేనైతే సిద్ధంగానే ఉన్నాను. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తూనే ఉన్నాను.
ఒకవేళ జట్టుకు నా అవసరం ఉంటే.. కచ్చితంగా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతా. దేశవాళీ క్రికెట్‌లో నేను విరామం లేకుండా ఆడుతూనే ఉన్నాను. అంతేకాదు.. గత రెండేళ్లుగా కౌంటీల్లోనూ ఆడుతున్నా. భారీ స్థాయిలో పరుగులు రాబడుతున్నా.
నేను ఆడితే కచ్చితంగా గెలిచేవాళ్లం
కాబట్టి నాకు గనుక ఈసారి అవకాశం వస్తే కచ్చితంగా.. దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటా’’ అని పుజారా రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఇక దశాబ్దకాలం తర్వాత టీమిండియా ఆసీస్‌కు బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కోల్పోవడం గురించి ప్రస్తావన రాగా..
‘‘అవును.. నేను నమ్మకంగా చెప్పగలను.. ఒకవేళ నేను జట్టులో ఉంటే కచ్చితంగా మేము హ్యాట్రిక్ కొట్టేవాళం. ఇందులో సందేహమే లేదు’’ అని పుజారా పేర్కొన్నాడు.
ఇక సొంతగడ్డపై ఆడటం ఇంగ్లండ్‌కు సానుకూల అంశమే అయినా ఈసారి టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పుజారా అభిప్రాయపడ్డాడు. ‘‘ఇంగ్లండ్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ రిటైర్ అయిన తర్వాత ఆ జట్టు బలహీనపడింది. వారిద్దరు తుదిజట్టులో లేకుంటే ప్రత్యర్థి జట్టుకు మంచిదే కదా! ఈసారి టీమిండియా కచ్చితంగా మంచి స్కోర్లతో విజయం సాధిస్తుంది’’ అని పుజారా ధీమా వ్యక్తం చేశాడు.
కాగా విదేశీ గడ్డపై ముఖ్యంగా ఆసీస్‌లో టీమిండియా తొలిసారి టెస్టు సిరీస్ నెగ్గడంలో ఛతేశ్వర్ పుజారాది కీలక పాత్ర. అయితే, వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈ ‘నయా వాల్’కు అవకాశాలు తగ్గిపోయాయి.
చివరగా అతడు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో టీమిండియాకు ఆడాడు. ఆస్ట్రేలియాతో నాటి పోరులో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత పుజారా దేశీ, కౌంటీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు.
చదవండి: IPL 2025: అతడి గురించి ఎవరూ మాట్లాడమే లేదు.. మూడో స్థానంలో ఆడిస్తారా?
Comments
Please login to add a commentAdd a comment