పుజారా, శ్రేయస్ అయ్యర్
India vs Australia, 3rd Test: ‘‘టీమిండియాలో కొంత మంది స్పిన్ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడగలరని విన్నాను. కానీ వాళ్ల ఆట తీరు మాత్రం నన్ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తొలిరోజు ఆస్ట్రేలియన్లు ఇంకాస్త ముందే టీమిండియాను ఆలౌట్ చేస్తారనుకున్నా.
పిచ్ సంగతి ఎలా ఉందన్న విషయం కాసేపు పక్కనపెడితే.. ఆస్ట్రేలియా స్పిన్నర్లు సరైన రీతిలో బౌలింగ్ చేశారు. తమకున్న అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. కానీ భారత బ్యాటర్లు మాత్రం ఫెయిలయ్యారు.
గత రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా తేలిపోయారో.. వీళ్లు కూడా అలాగే విఫలమయ్యారు. ముఖ్యంగా ఛతేశ్వర్ పుజారా భయపడుతూ బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్ ఆరంభం నుంచే అతడు నెర్వస్‌గా కనిపిస్తున్నాడు.
ఇక శ్రేయస్ అయ్యర్ స్పిన్ బౌలింగ్‌లో బాగా ఆడతాడని విన్నాను. కానీ.. ఇప్పటి వరకు అతడి నుంచి మెరుగైన బ్యాటింగ్ చూడలేకపోయాం. నేనైతే అతడి ఆట తీరుతో అస్సలు కన్విన్స్ కాలేకపోయాను. తనని చూస్తే వట్టి పిరికిపందలా అనిపించాడు’’ అని ఆస్ట్రేలియా టెస్టు దిగ్గజం ఇయాన్ చాపెల్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
పుజారా భయం భయంగా
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఛతేశ్వర్ పుజారా, శ్రేయస్ అయ్యర్ అంచనాలు అందుకోలేకపోయారని విమర్శించాడు. అదే సమయంలో.. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ చక్కగా సమన్వయం చేసుకుంటూ మెరుగైన ఇన్నింగ్స్ ఆడారని ప్రశంసించాడు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌లో మార్చి 1న మొదలైన మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, మూడో రోజు నుంచి బంతి స్పిన్‌కు టర్న్ అవుతుందని భావిస్తే.. తొలిరోజే గింగిరాలు తిరిగింది. దీంతో టీమిండియా బ్యాటర్లకు కష్టాలు తప్పలేదు.
అంతా రివర్స్
ఆసీస్ స్పిన్నర్లు మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నాథన్ లియోన్ 3, టాడ్ మర్ఫీ ఒక వికెట్ తీశారు. దీంతో భారత జట్టు 109 పరుగులకే ఆలౌట్ అయింది. ముఖ్యంగా వన్‌డౌన్ బ్యాటర్ పుజారా ఒక్క పరుగుకే పరిమితం కాగా.. ఆరోస్థానంలో వచ్చిన శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయి పూర్తిగా నిరాశపరిచాడు.
విరాట్ కోహ్లి 22, శుబ్‌మన్ గిల్ 21 పరుగులు చేయగా.. మిగతా వాళ్లెవరూ కనీసం 20 పరుగుల మార్కును అందుకోలేకపోయారు. మరోవైపు.. ఆస్ట్రేలియా రెండో రోజు ఆటలో భాగంగా 197 పరుగులకు ఆలౌట్ అయింది. ఖవాజా 60, లబుషేన్ 31 పరుగులతో రాణించి ఆసీస్‌కు ఆధిక్యాన్ని అందించారు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో పుజారా రాణిస్తుండటం విశేషం.
ముందుందిలే
ఈ నేపథ్యంలో ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో షోలో ఇయాన్ చాపెల్ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక అయ్యర్ రెండో టెస్టులో కేవలం 16 పరుగులు మాత్రమే చేయగా.. పుజారా 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఇయాన్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు.
‘‘వాళ్లిద్దరు విఫలమైన మాట వాస్తవమే! అయినా రెండు టెస్టుల్లో ఏం జరిగిందో చూశారు కదా! ఇప్పుడే ఇంకా అయిపోలేదు. ముందుంది అసలైన సవాల్’’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా రెండు విజయాలతో 2-0తో ఆధిక్యంలో ఉండగా.. మిగిలిన రెండు టెస్టుల్లో సత్తా చాటాలని ఆసీస్ ఉవ్విళ్లూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment