ప్యాట్ కమిన్స్ బృందంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ విమర్శల వర్షం కురిపించాడు. పెర్త్ టెస్టులో టీమిండియా యువ ఆటగాళ్ల చేతిలోనూ మానసికంగా ఓడిపోయారంటూ ఎద్దేవా చేశాడు. జట్టులో ఏ ఒక్కరిలోనూ పోరాటపటిమ కనబడలేదని.. ఇకనైనా కాస్త ఆటపై దృష్టి పెట్టి విజయాల బాటపట్టాలని సూచించాడు. భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
యాషెస్ సిరీస్ మాదిరే
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ మాదిరే కంగారూ జట్టుకు ఈ సిరీస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఇక టీమిండియాతో టెస్టు అంటే కేవలం ఆటకే పరిమితం కాకుండా ప్లేయర్లు స్లెడ్జింగ్ చేయడంలోనూ ముందే ఉంటారు. అందుకు తగ్గట్లుగా భారత ఆటగాళ్లూ బదులిచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి.
స్లోగా బౌల్ చేస్తున్నాడు
ఇదిలా ఉంటే.. పెర్త్ టెస్టులోనూ ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నా.. వాటి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంది. అయితే, ఈ టీజింగ్ మూమెంట్లలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఉద్దేశించి చాలా స్లోగా బౌల్ చేస్తున్నాడంటూ వ్యాఖ్యానించడం హైలైట్‌గా నిలిచింది.
295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడి
మరోవైపు.. స్టార్క్.. భారత అరంగేట్ర పేసర్ హర్షిత్ రాణాను ఉద్దేశించి.. ‘‘నీకంటే నేనే ఫాస్ట్‌గా బౌల్ చేస్తాను’’ అని వ్యాఖ్యానించాడు. అయితే, రాణా చిరునవ్వుతోనే స్టార్క్‌కు బదులిచ్చాడు. అయితే, అతడిని అవుట్ చేసి తన సత్తా చాటడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఆసీస్ 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?
ఈ నేపథ్యంలో మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బయటి నుంచి ప్రేక్షకుడిగా మ్యాచ్ చూస్తున్న నాకు.. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఏమాత్రం పోరాటపటిమ కనిపించలేదు. ముఖ్యంగా ఓ అరంగేట్ర ఆటగాడు.. యువ ఓపెనర్.. మన సొంతగడ్డ మీద.. మిచెల్ స్టార్క్‌ను స్లెడ్జ్ చేస్తూ.. స్లోగా బౌలింగ్ చేస్తున్నావనడం.. అయినా మనలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
బ్యాట్‌తోనూ.. బాల్‌తోనూ మనం సమాధానం ఇవ్వలేకపోయాం. అసలు ఆప్టస్ స్టేడియంలో మీరేం చేశారు?’’ అని ది వెస్టర్న్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో ఆసీస్ జట్టును విమర్శించాడు. ఇక టీమిండియాకు భయపడితే పనులు జరగవని.. అడిలైడ్‌లో మాత్రం తప్పక విజృంభించాలని కమిన్స్ బృందానికి మిచెల్ జాన్సన్ సూచించాడు.
ఈసారి గనుక ఛాన్స్ ఇస్తే
లేనిపక్షంలో వాళ్లను ఎదుర్కోవడం మరింత కష్టమవుతుందని టీమిండియా గురించి ఆసీస్‌కు మిచెల్ జాన్సన్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబరు 6- 10 వరకు రెండో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పింక్ బాల్‌తో జరిగే ఈ టెస్టులోనూ గెలుపొందాలని పట్టుదలగా ఉన్న టీమిండియా.. అందుకు తగ్గట్లుగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో గులాబీ బంతితో సాధన చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పీఎం ఎలెవన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది.
ఇక తొలి టెస్టుకు దూరంగా ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుబ్‌మన్ గిల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరారు. మరోవైపు.. జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ మార్ష్ గాయాల రూపంలో ఆసీస్‌కు షాక్ తగిలింది. కాగా ఆసీస్- భారత్ మధ్య మొత్తం ఐదు టెస్టులు జరుగనున్నాయి.
చదవండి: వెళ్లు వెళ్లు.. వెనక్కి వెళ్లు: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్!
Comments
Please login to add a commentAdd a comment