ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్(Prime Ministers XI)తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 59 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. తద్వారా భారత ఇన్నింగ్స్‌లో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. పీఎం ఎలెవన్‌తో మ్యాచ్ సందర్భంగా జైస్వాల్‌కు కోపమొచ్చింది.
తనను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన ఆసీస్ పేసర్ జాక్ నిస్బెట్(Jack Nisbet)కు బ్యాట్‌తో పాటు.. నోటితోనూ గట్టిగానే సమాధానమిచ్చాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు.. డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు ఆడనుంది.
తొలిరోజు ఆట టాస్ పడకుంగానే
అయితే, పింక్ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో.. ఆసీస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో గులాబీ బంతితో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. రెండురోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా శనివారం నాటి తొలిరోజు ఆట టాస్ పడకుంగానే ముగిసిపోగా.. రెండో రోజు సవ్యంగా సాగింది. అయితే, ఈ మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు.
కాన్‌స్టాస్ శతకం
కాన్‌బెర్రా వేదికగా ఆదివారం టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో పీఎం ఎలెవన్ జట్టు ఓపెనర్ సామ్ కాన్‌స్టాస్ శతకం(107)తో చెలరేగగా.. మిగతా వాళ్లలో హనో జాకబ్స్(61), జాక్ క్లేటన్(40) మెరుగ్గా రాణించారు. మిగతా వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పీఎం జట్టు 43.2 ఓవర్లలో 240 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
భారత బౌలర్లలో పేసర్లు హర్షిత్ రాణా నాలుగు వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ రెండు, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఒక్కో వికెట్ పడగొట్టారు. స్పిన్నర్లలో వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజకు తలా ఒక వికెట్ దక్కింది.
42.5 ఓవర్లలోనే ఛేదించినా
ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఓపెనర్ యశస్వి జైస్వాల్ శుభారంభం అందించగా.. కేఎల్ రాహుల్(27 రిటైర్డ్ హర్ట్), శుబ్‌మన్ గిల్(50- రిటైర్డ్ హర్ట్) రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ(3) మాత్రం విఫలం కాగా.. నితీశ్ రెడ్డి(42), వాషింగ్టన్ సుందర్(42 నాటౌట్) అదరగొట్టారు.
మిగతా వాళ్లలో రవీంద్ర జడేజా(27) ఫర్వాలేదనిపించగా.. సర్ఫరాజ్ ఖాన్(1) పూర్తిగా విఫలమయ్యాడు. దేవ్‌పడిక్కల్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిజానికి రోహిత్ సేన 42.5 ఓవర్లలోనే 241 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించినా... ప్రాక్టీస్ కోసం పూర్తి ఓవర్లు ఆడటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. టీమిండియా ఇన్నింగ్స్‌లో ఆరో ఓవర్‌ను పీఎం ఎలెవన్ పేసర్ జాక్ నిస్బెట్ వేశాడు. అతడి బౌలింగ్‌లో తొలి రెండు బంతులను యశస్వి జైస్వాల్ బౌండరీకి తరలించగా.. నిస్బెట్ జైస్వాల్‌ను చూస్తూ ఏదో అన్నాడు.
వెనక్కి వెళ్లు..
ఇందుకు బదులుగా.. ‘‘వెనక్కి వెళ్లు.. వెళ్లి బౌలింగ్ చెయ్’’ అని జైస్వాల్ కౌంటర్ ఇచ్చాడు. దీంతో చిరునవ్వుతోనే వెనక్కి వెళ్లిన నిస్బెట్ ఆఖరి వరకు రాకాసి బౌన్సర్లతో జైస్వాల్‌ను తిప్పలు పెట్టాడు.
దీంతో ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఆఖరి వరకు తగ్గేదేలే అన్నట్లు తలపడ్డారు. ఇక నిస్బెట్ ఓవర్లో జైస్వాల్ ఎనిమిది పరుగులు రాబట్టగా.. అతడు మాత్రం వికెట్‌లెస్‌గా వెనుదిరిగాడు. జైస్వాల్‌ను అవుట్ చేయాలన్న అతడి కల నెరవేరలేదు.
అంతే కాదు మ్యాచ్ మొత్తంలో ఆరు ఓవర్లు వేసిన 21 ఏళ్ల నిస్బెట్ 32 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే, ఎనిమిదో ఓవర్లో మరోసారి బరిలోకి దిగిన నిస్బెట్ జైస్వాల్‌ను పరుగులు రాబట్టకుండా అడ్డుకోగలిగాడు.
చదవండి: బీసీసీఐ మ్యాచ్.. 10కి 10 వికెట్లు సాధించిన 18 ఏళ్ల యువ కెరటం
Yashasvi Jaiswal took it up to Jack Nisbet in Canberra but the fiery NSW quick wasn't backing down! 👀 #PMXIvIND pic.twitter.com/tX3O86wEv2
— cricket.com.au (@cricketcomau) December 1, 2024
Comments
Please login to add a commentAdd a comment