ఫోటో కర్టసీ: బీసీసీఐ డొమస్టిక్
కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్‌లో బిహార్ స్పిన్నర్ ఘనత
పట్నా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న కూచ్ బెహార్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్‌లో బిహార్ ఎడంచేతి వాటం స్పిన్నర్ సుమన్ కుమార్ అద్భుతం చేశాడు. రాజస్తాన్‌తో ఇక్కడి మొయిన్ ఉల్ హఖ్ స్టేడియంలో ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో 18 ఏళ్ల సుమన్ ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసుకున్నాడు. సుమన్ 33.5 ఓవర్లలో 20 మెయిడెన్లు వేసి 53 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టాడు.
సుమన్ ధాటికి రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 75.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. బిహార్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 467 పరుగులకు ఆలౌటైంది. 285 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బిహార్ జట్టు రాజస్తాన్‌ను ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో రాజస్తాన్ జట్టు బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. మొత్తం 137.5 ఓవర్లలో రాజస్తాన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేయడంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది.
కూచ్ బెహార్ ట్రోఫీ చరిత్రలో ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా సుమన్ కుమార్ గుర్తింపు పొందాడు. గతంలో ఆంధ్ర బౌలర్ మెహబూబ్ బాషా (2010లో త్రిపురపై 44 పరుగులకు 10 వికెట్లు), మణిపూర్ పేస్ బౌలర్ రెక్స్ రాజ్‌కుమార్ సింగ్ (2018లో అరుణాచల్ ప్రదేశ్‌పై 11 పరుగులకు 10 వికెట్లు) ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment