
గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్ కెప్టెన్ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.
నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో క్లీన్‌స్వీప్, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కెప్టెన్‌గానే కాదు.. వైస్ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్!
ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని పేస్ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్ కెప్టెన్ ఇవ్వాలని భావిస్తున్నాం.
నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్‌లు ఆడడు. కాబట్టి కెప్టెన్‌కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్‌లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.
గాయం తిరగబెట్టే అవకాశం!
కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. పేస్ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ 2023-25 సీజన్‌లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.
వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఆరంభ మ్యాచ్‌లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.
ఈ క్రమంలో బుమ్రా ఫిట్‌నెస్ దృష్ట్యా ఇంగ్లండ్‌లోనూ అతడిని వరుస మ్యాచ్‌లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.
బుమ్రా వంటి విలువైన ఫాస్ట్ బౌలర్‌ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
రేసులో ఆ మూడు పేర్లు
ఒకవేళ బుమ్రాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్ పంత్ లేదంటే.. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్‌తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్‌లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు.
కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్ రిచ్ లీగ్ ఫైనల్ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. జూన్ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది.
చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్ పంత్