ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. అయితే, ఇందుకు హర్షిత్ స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్- భారత్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ దూరం కాగా.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.
ఇక పెర్త్‌లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య ఆసీస్ సైతం తొలి రోజే బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆది నుంచే ఆసీస్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ పేస్ దళ నాయకుడు బుమ్రా వికెట్ల వేట మొదలుపెట్టగా.. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా అతడికి సహకారం అందించారు.
రాణా తొలి వికెట్ అతడే
ఫలితంగా శుక్రవారం నాటి ఆటలో టీమిండియా పైచేయి సాధించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. సిరాజ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్(11) రూపంలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 67 రన్స్ మాత్రమే చేసింది.
అంతేకాదు.. శనివారం నాటి రెండో రోజు ఆరంభంలోనే వికెట్ తీసి మరోసారి దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకారిగా మారుతున్న అలెక్స్ క్యారీ(21)ని బుమ్రా అవుట్ చేయగా.. నాథన్ లియాన్(5)ను హర్షిత్ పెవిలియన్‌కు పంపాడు.
అయితే, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం క్రీజులో పాతుకుపోయి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో బుమ్రా.. హర్షిత్‌ను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో మూడో బంతిని హర్షిత్ బౌన్సర్‌గా సంధించగా.. స్టార్క్ హెల్మెట్‌కు తగిలింది.
హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను
దీంతో కంగారూపడిన హర్షిత్ స్టార్క్ వైపు చూస్తూ అంతే ఓకే కదా అన్నట్లు సైగలతోనే అడిగాడు. ఇందుకు బదులుగా నవ్వులు చిందించిన స్టార్క్.. ‘‘హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’’ అంటూ ఐపీఎల్‌లో తాము కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఇక స్టార్క్ మాటలతో ఒక్కసారిగా హర్షిత్ చిరునవ్వులు చిందిస్తూ అలాగే అన్నట్లు తలూపాడు. మామూలుగా ఆసీస్- భారత్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ మొదట గుర్తుకువస్తుంది. అయితే, హర్షిత్- స్టార్క్ మాత్రం ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అభిమానులను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా ఐపీఎల్-2024లో హర్షిత్ రాణా, స్టార్క్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. జట్టును చాంపియన్‌గా నిలపడంలో ఈ ఇద్దరు పేసర్లు తమ వంతు పాత్రలు పోషించారు. అదీ సంగతి!!
104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
ఇక క్రీజులో పాతుకుపోయి జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన స్టార్క్ వికెట్‌ను ఆఖరికి హర్షిత్ దక్కించుకోవడం విశేషం. మొత్తంగా 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిన స్టార్క్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.
Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2
— cricket.com.au (@cricketcomau) November 23, 2024
Comments
Please login to add a commentAdd a comment