క్రికెటర్లలో తరచూ గాయాలబారిన పడే వారి జాబితాలో ఫాస్ట్‌బౌలర్లే ఎక్కువగా ఉంటారు. పేసర్లు సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించాలంటే తగినంత విశ్రాంతి తీసుకుంటూనే ఫిట్‌నెస్ కూడా కాపాడుకోవాలి. అందుకోసం వారు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. తాను కూడా ఆ కోవకే చెందిన వాడిని అంటున్నాడు హర్షిత్ రాణా.
న్యూఢిల్లీకి చెందిన ఈ 22 ఏళ్ల రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సత్తా చాటి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన హర్షిత్ రాణా.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుకు ఎంపికయ్యాడు. కంగారూ జట్టుతో ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో పాల్గొనే సువర్ణావకాశం ముంగిట నిలిచాడు.
మా నాన్న కల
ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా ఇప్పటిదాకా క్రికెటర్‌గా తన ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి పంచుకున్నాడు. ‘‘నేను తరచూ గాయాల బారిన పడేవాడిని. అప్పుడు మా నాన్న కొండంత అండగా నిలబడ్డారు. ప్రతి అడుగులోనూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపారు. ఇంగ్లండ్ గడ్డపై నేను టీమిండియాకు ఆడితే చూడాలనేది మా నాన్న కల. నాకైతే ఎల్లప్పుడూ ఆస్ట్రేలియాలో ఆ జట్టుతో పోటీ పడటం అంటేనే ఇష్టం.
ఏదేమైనా ఈరోజు నేను ఈ స్థాయికి చేరానంటే దానికి కారణం మా నాన్నే. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా ఉంటారు. వారికి అన్నిరకాలుగా పోటీ ఇచ్చేందుకు నేను కూడా సిద్ధంగానే ఉన్నాను’’ అని హర్షిత్ రాణా పేర్కొన్నాడు. కాగా టీనేజ్‌లో హర్షిత్ ఎదుర్కొన్న ఫిట్‌నెస్ సమస్యల గురించి అతడి తండ్రి ప్రదీప్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు వెల్లడించారు.
తరచూ గాయాలు
‘‘ముందు వెన్ను నొప్పి, తర్వాత తొడ కండరాల గాయం.. ఆ తర్వాత మోకాలి గాయం.. అనంతరం భుజం నొప్పి.. శరీరంలోని దాదాపు ప్రతీ అవయవానికి ఏదో ఒక సందర్భంలో గాయమైంది. గాయపడ్డ ప్రతిసారీ నేను తనను ఆస్పత్రికి తీసుకువెళ్లేవాడిని. ఆయుర్వేద వైద్యులను కూడా సంప్రదించాను. ఎవరు ఏ సలహా ఇచ్చినా పాటించేవాడిని. హర్షిత్ ఫిట్‌గా మారేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాము’’ అని ప్రదీప్ పేర్కొన్నారు.
17 కిలోల బరువు తగ్గి.. లక్కీ ఛాన్స్
కాగా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు హర్షిత్ రాణా 17 కిలోల మేర బరువు తగ్గాడు. కఠిన సవాళ్లను అధిగమిస్తూ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే దాకా చేరుకున్నాడు. ఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా హర్షిత్ తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు.
ఆ తర్వాత కూడా జట్టుతో ప్రయాణించాడు. కానీ.. తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. అయితే, మహ్మద్ షమీ ఫిట్‌నెస్ కారణాల దృష్ట్యా జట్టుకు దూరమైన కారణంగా.. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపికయ్యే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.
ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.
రిజర్వు ప్లేయర్లు: ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖలీల్ అహ్మద్.
చదవండి: Ind vs NZ 3rd Test: బుమ్రా వద్దు.. సిరాజ్‌ను ఆడించండి: దినేశ్ కార్తిక్
Comments
Please login to add a commentAdd a comment