ఒకరిని మరొకరు తప్పు పట్టలేం
జస్‌ప్రీత్ బుమ్రా వ్యాఖ్య
బ్రిస్బేన్: భారత స్టార్ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మరోసారి తన స్థాయిని ప్రదర్శిస్తూ 6 వికెట్లతో చెలరేగాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ సిరీస్‌లో ఇప్పటికే 18 వికెట్లు తీసిన అతను... ఆస్ట్రేలియా గడ్డపై 50 వికెట్లు తీసిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అయితే మూడో టెస్టులో బుమ్రాకు మిగతా బౌలర్ల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో ఆసీస్ భారీ స్కోరు సాధించింది.
ఈ నేపథ్యంలో ఇతర బౌలర్లపై వచ్చిన విమర్శలను బుమ్రా తిప్పికొట్టాడు. వారిలో చాలా మంది కొత్తవారేనని, ఇంకా నేర్చుకుంటున్నారని మద్దతు పలికాడు. ‘జట్టులో ఇతర సభ్యుల వైపు వేలెత్తి చూపించే పని మేం చేయం.
నువ్వు ఇది చేయాలి, నువ్వు అది చేయాలి అంటూ శాసించే దృక్పథం కాదు మాది. ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వస్తున్నారు. ఆస్ట్రేలియాలాంటి చోట రాణించడం అంత సులువు కాదు. ముఖ్యంగా మా బౌలింగ్‌లో సంధి కాలం నడుస్తోంది. కొన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవంతో వారికి నేను అండగా నిలవాలి.
వారంతా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రయాణంలో మున్ముందు మరింత మెరుగవుతారు’ అని బుమ్రా వ్యాఖ్యానించాడు. జట్టు బ్యాటింగ్ వైఫల్యంపై కూడా అతను స్పందించాడు. ‘బ్యాటర్లు విఫలమయ్యారని, వారి వల్ల మాపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పడం సరైంది కాదు. జట్టులో 11 మంది ఉన్నాం. కొందరికి అనుభవం చాలా తక్కువ.
వారు నేర్చుకునేందుకు తగినంత అవకాశం ఇవ్వాలి. ఎవరూ పుట్టుకతోనే గొప్ప ఆటగాళ్లు కాలేరు. నేర్చుకునే ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. సవాళ్లు ఎదురైనప్పుడు కొత్త తరహాలో వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ సిరీస్‌లో మూడు టెస్టుల్లో మూడు భిన్నమైన పిచ్‌లు ఎదురయ్యాయి.
నేను వాటి కోసం సిద్ధమయ్యాను. గతంలో అంచనాల భారంతో కాస్త ఒత్తిడి ఉండేది. ఇప్పుడు వాటిని పట్టించుకోవడంలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తా. నేను బాగా ఆడని రోజు మిగతా బౌలర్లు వికెట్లు తీయవచ్చు’ అని బుమ్రా వివరించాడు.
సిరాజ్‌కు గాయం!
ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న మరో పేసర్ సిరాజ్‌కు బుమ్రా అండగా నిలిచాడు. అతను స్వల్ప గాయంతో బాధపడుతూనే బరిలోకి దిగాడని, సిరాజ్‌లో పోరాట స్ఫూర్తి చాలా ఉందని మెచ్చుకున్నాడు. ‘మైదానంలోకి దిగిన తాను బాగా బౌలింగ్ చేయకపోతే జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని సిరాజ్‌కు తెలుసు.
అందుకే స్వల్ప గాయంతో ఉన్నా బౌలింగ్‌కు సిద్ధమయ్యాడు. కొన్నిసార్లు బాగా బౌలింగ్ చేసినా వికెట్లు దక్కవని, పోరాడటం ఆపవద్దని అతనికి చెప్పా. ఎందరికో రాని అవకాశం నీకు వచ్చిందంటూ ప్రోత్సహించా. అతనిలో ఎలాంటి ఆందోళన లేదు. ఎంతకైనా పట్టుదలగా పోరాడే అతని స్ఫూర్తి నాకు నచ్చుతుంది. అది జట్టుకూ సానుకూలాశం’ అని బుమ్రా అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment