
టీమిండియాతో పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్కోరు సాధించింది. శుక్రవారం నాటి తొలి రోజు ఆటలో భారత్‌ను 180 పరుగులకే ఆలౌట్ చేసిన కంగారూలు.. తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆటను మొదలుపెట్టిన కమిన్స్ బృందం మరో 251 పరుగులు జమ చేసి ఆలౌట్ అయింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్నస్ లబుషేన్(64) అర్ధ శతకంతో మెరవగా.. ఐదో నంబర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్(140) భారీ శతకం బాదాడు. టీమిండియా బౌలర్లకు కొరకాని కొయ్యగా మారి.. 141 బంతుల్లోనే 140 పరుగులు స్కోరు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం.
అద్భుత యార్కర్‌తో హెడ్‌కు చెక్
అయితే, ప్రమాదకారిగా మారిన హెడ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు భారత బౌలర్లు కఠినంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సిరాజ్‌కు అతడి వికెట్ దక్కించుకోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ 82వ ఓవర్‌లో బంతితో బరిలోకి దిగిన సిరాజ్.. అద్భుత యార్కర్‌తో హెడ్‌ను బౌల్డ్ చేశాడు.
‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’
ఇక కీలక వికెట్ దక్కిన ఆనందంలో సిరాజ్.. హెడ్‌ను ఉద్దేశించి ‘‘ఇక వెళ్లు’’ అన్నట్లుగా సైగ చేస్తూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు బదులుగా హెడ్ సైతం అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. దీంతో మరింతగా కోపం తెచ్చుకున్న సిరాజ్.. ‘‘ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో’’ అన్నట్లు ఉగ్రరూపం ప్రదర్శించాడు. అయితే, హెడ్ మాత్రం తన సెంచరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రేక్షకులకు అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు.
డీఎస్‌పీ సర్‌కు కోపం వచ్చింది
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘‘డీఎస్‌పీ సర్‌కు కోపం వచ్చింది. శతకం బాదిన ఆటగాడికి తనదైన స్టైల్లో సెండాఫ్ ఇచ్చాడు’’ అంటూ అభిమానులు సరదాగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అతి చేయవద్దు సిరాజ్.. కాస్త సంయమనం పాటించు’’ అని హితవు పలుకుతున్నారు.
కాగా భారత బౌలర్లలో పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ నాలుగేసి వికెట్లతో చెలరేగగా..నితీశ్ రెడ్డి ఒక వికెట్ దక్కించుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.
పెర్త్ వేదికగా తొలి టెస్టులో 295 పరుగులతో ఆసీస్‌ను ఓడించిన భారత్.. రెండో టెస్టులో కాస్త తడబడుతోంది. అడిలైడ్ వేదికగా ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసే సరికి కమిన్స్ బృందం.. రోహిత్ సేనపై 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: IND vs AUS: జైశ్వాల్ కళ్లు చెదిరే క్యాచ్.. విరాట్ కోహ్లి రియాక్షన్ వైరల్
The end of a sensational innings! 🗣️#AUSvIND pic.twitter.com/kEIlHmgNwT
— cricket.com.au (@cricketcomau) December 7, 2024
Comments
Please login to add a commentAdd a comment