IND vs AUS 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. ఆసీస్‌దే ఆధిపత్యం | India Vs Australia Pink Ball Test Day2 Match Live Score Updates, Highlights, Top Headlines In Telugu | Sakshi
Sakshi News home page

IND Vs AUS 2nd Test: ముగిసిన రెండో రోజు ఆట.. ఆసీస్‌దే ఆధిపత్యం

Published Sat, Dec 7 2024 9:36 AM | Last Updated on Sat, Dec 7 2024 5:17 PM

India vs Australia pink ball Test Day2: live updates and highlights

Ind vs Au pink ball Test Day2: అడిలైడ్‌ టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. శనివారం నాటి ఆటలోనూ ఆతిథ్య ఆస్ట్రేలియానే టీమిండియాపై పైచేయి సాధించింది. తొలుత తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసిన ఆసీస్‌.. 157 పరుగుల ఆధిక్యం సంపాదించింది.

ఈ క్రమంలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన తర్వాత బంతితోనూ జోరు కొనసాగించింది. ఈ పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ పేసర్ల ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ 24 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కేఎల్‌ రాహుల్‌ ఏడు పరుగులకే నిష్క్రమించాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌(28) రాణించగా.. విరాట్‌ కోహ్లి(11), రోహిత్‌ శర్మ(6) మరోసారి విఫలమయ్యారు. ఆట పూర్తయ్యేసరికి రిషభ్‌ పంత్‌ 28, నితీశ్‌ కుమార్‌ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలో 24 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 128 రన్స్‌ చేసింది. 

ఆసీస్‌ కంటే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 29 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌, బోలాండ్‌ రెండేసి వికెట్లు తీయగా.. స్టార్క్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు. కాగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌట్‌ అయిన విషయం తెలిసిందే. 

ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్‌ 
అడిలైడ్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా పింక్‌ బాల్‌ టెస్టు కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌట్‌ అయింది. హెడ్‌ భారీ సెంచరీ(140), లబుషేన్‌ (64) అర్ధ శతకం కారణంగా ఈ మేరస్కోరు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌ నాలుగేసి వికెట్లు తీయగా.. నితీశ్‌, అశ్విన్‌ ఒక్కో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.  టీమిండియా కంటే తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలైంది.

ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌
ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో టీమిండియా సారథి రోహిత్‌ శర్మ(6) బౌల్డ్‌ కావడంతో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. నితీశ్‌ రెడ్డి క్రీజులోకి వచ్చాడు. పంత్‌ 20 పరుగులతో ఆడుతున్నాడు. భారత్‌ స్కోరు: 105/5 (20.5). ఆసీస్‌ కంటే 52 పరుగులు వెనుకబడిన టీమిండియా

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో గిల్‌(28) బౌల్డ్‌. రోహిత్‌ శర్మ క్రీజులోకి వచ్చాడు. పంత్‌ 11 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు:  86/4 (17.2). ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ కంటే ఇంకా 71 పరుగుల వెనుకంజలో టీమిండియా

మూడో వికెట్‌ డౌన్‌
విరాట్‌ కోహ్లి రూపంలో టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్‌ ఇచ్చి కోహ్లి(11) పెవిలియన్‌ చేరాడు. రిషభ్‌ పంత్‌ క్రీజులోకి రాగా.. గిల్‌ 20 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 66/3 (14.3)

ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన టీమిండియా
రెండో ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే టీమిండియాకు షాక్‌ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(7) ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ పెవిలియన్‌కు పంపగా.. బోలాండ్‌ యశస్వి జైస్వాల్‌(24)ను అవుట్‌ చేశాడు. టీమిండియా స్కోరు 42/2 (8.1). గిల్‌ ఏడు, కోహ్లి సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.

పదో వికెట్‌ డౌన్‌
సిరాజ్‌ బౌలింగ్‌లో బోలాండ్‌(0) బౌల్డ్‌ కావడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా
డిన్నర్‌ ముగిసిన తర్వాత మైదానంలో అడుగుపెట్టిన ఆసీస్‌కు సిరాజ్‌ గట్టి షాకిచ్చాడు. మిచెల్‌ స్టార్క్‌(18)ను అవుట్‌ చేశాడు. దీంతో ఆసీస్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. స్కాట్‌ బోలాండ్‌క్రీజులోకి వచ్చాడు. ఆసీస్‌ స్కోరు: 332/9 (85.4)

ఎనిమిదో వికెట్‌ డౌన్‌..
ప్యాట్‌ కమ్మిన్స్‌ రూపంలో ఆసీస్‌ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కమ్మిన్స్‌.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 85 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్‌: 332/8. ప్రస్తుతం కంగారులు 152 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

సిరాజ్‌ సూపర్‌ యార్కర్‌.. హెడ్‌ క్లీన్‌ బౌల్డ్‌
ట్రావిస్‌ హెడ్‌ వికెట్‌ భారత్‌ ఎట్టకేలకు సాధించింది. మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతమైన బంతితో హెడ్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. హెడ్‌ 141 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 140 పరుగులు చేసి ఔటయ్యాడు. 82 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది.

ఆరో వికెట్‌ డౌన్‌.. కారీ ఔట్‌
ఎట్టేకేలకు భారత్‌ వికెట్‌ సాధించింది. 15 పరుగులు చేసిన అలెక్స్‌ క్యారీ.. మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 77 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 282/6

ట్రావిస్‌ హెడ్‌ సూపర్‌ సెంచరీ
పింక్‌బాల్‌ టెస్టులో ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. 111 బంతల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. హెడ్‌ ప్రస్తుతం 112 పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నాడు. 73 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఆసీస్‌ ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 87 పరుగుల ఆధి​‍క్యంలో కొనసాగుతోంది. 

ఐదో వికెట్‌ డౌన్‌.. 
మిచెల్‌ మార్ష్‌ రూపంలో ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మార్ష్‌.. అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ట్రావిస్‌ హెడ్‌ హాఫ్‌ సెంచరీ
62 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 21 పరుగుల ఆధి​‍క్యంలో కొనసాగుతోంది. క్రీజులో ట్రావిస్‌ హెడ్‌(61 బ్యాటింగ్‌), మిచెల్‌ మార్ష్‌(2 బ్యాటింగ్‌) ఉన్నారు.

టీ బ్రేక్‌కు ఆసీస్‌ స్కోరంతంటే?
రెండో రోజు ఆట టీబ్రేక్‌ సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్‌ హెడ్‌(53 బ్యాటింగ్‌), మిచెల్‌ మార్ష్‌(2 బ్యాటింగ్‌) ఉన్నారు.

ఆసీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..
లబుషేన్‌ రూపంలో ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 64 పరుగులు చేసిన లబుషేన్‌.. నితీశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. యశస్వి జైశ్వాల్‌ అద్బుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు. 56 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

లబుషేన్‌ హాఫ్‌ సెంచరీ..
ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌ ఎట్టకేలకు తన ఫామ్‌ను అందుకున్నాడు. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో లబుషేన్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 50 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌.. మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. క్రీజులో లుబుషేన్‌(50), హెడ్‌(21) ఉన్నారు.

ఆసీస్‌ మూడో వికెట్‌ డౌన్‌..
స్టీవ్‌ స్మిత్‌ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన స్మిత్‌.. బుమ్రా బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

బుమ్రా మ్యాజిక్‌.. ఆసీస్‌ రెండో వికెట్‌ డౌన్‌
👉 ఓపెనర్‌ నాథన్‌ మెక్‌స్వీనీ(39) బుమ్రా బౌలింగ్‌లో ఓటయ్యాడు. వికెట్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఓటై పెవిలియన్‌ చేరాడు.  

రెండో రోజు ఆట ప్రారంభం.. 
అడిలైడ్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా పింక్‌ బాల్‌ టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత బౌలింగ్‌ ఎటాక్‌ను మహ్మద్‌ సిరాజ్‌ ఆరంభించాడు. ఇక తొలి రోజు ఆటలో ఆసీస్‌ వికెట్‌ నష్టానికి 88 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్నస్‌ లబుషేన్‌(23), నాథన్‌ మెక్‌స్వీనీ(39) ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement