టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ సారథి, కామెంటేటర్ మైకేల్ వాన్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టాడు. రోహిత్ నిర్ణయం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు సంతోషాన్ని మిగిల్చి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
సిరీస్ 1-1తో సమంగా
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.
ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా శనివారం మూడో టెస్టు మొదలైంది. గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
బ్యాటింగ్ చేయడం సులువవుతుందనే
ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. వికెట్‌పై కాస్త పచ్చిక ఉన్నట్లు కనిపిస్తోంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. పిచ్ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
మ్యాచ్ సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ చేయడం సులువవుతుందనే ఉద్దేశంతోనే బౌలింగ్ ఎంచుకున్నట్లు రోహిత్ శర్మ తెలిపాడు. ఇక ఆసీస్ సారథి కమిన్స్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
కమిన్స్‌దీ అదే మాట
తాను కూడా టాస్ గెలిచి ఉంటే.. తొలుత బౌలింగ్ ఎంచుకునే వాడినన్నాడు. అయితే, ఈ ఇద్దరు కెప్టెన్ల వ్యాఖ్యలకు విరుద్ధంగా మైకేల్ వాన్ కామెంట్ చేయడం విశేషం.
రోహిత్ శర్మ నిర్ణయం తప్పు
‘‘రోహిత్ శర్మ నిర్ణయంతో ప్యాట్ కమిన్స్ మనసులో గంతులేస్తూ ఉంటాడు. తాను టాస్ ఓడిపోయినందుకు సంతోషపడి ఉంటాడు. గత చరిత్ర ఆధారంగా అతడు బ్యాటింగే ఎంచుకుని ఉండేవాడు. ఏదేమైనా రోహిత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని తప్పుచేశాడు’’ అని మైకేల్ వాన్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.
కొత్త బంతితో నో మ్యాజిక్!
కాగా గబ్బా పిచ్‌పై కొత్త బంతితో భారత పేసర్లు పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయారు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ అటాక్ ఆరంభించగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్‌లు కూడా రంగంలోకి దిగారు. బుమ్రా ఆరు ఓవర్ల బౌలింగ్‌లో 8, సిరాజ్ నాలుగు ఓవర్లలో 13, ఆకాశ్ దీప్ 3.2 ఓవర్లలో 2 పరుగులు ఇచ్చారు.
ఇక ఆసీస్ ఇన్నింగ్స్ 13.2 ఓవర్ల వద్ద ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి కంగారూ జట్టు వికెట్ నష్టపోకుండా 28 రన్స్ చేసింది. అయితే, ఆ తర్వాత వర్షం తెరిపినివ్వకపోవడంతో తొలిరోజు ఆటను అంతటితో ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment