ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. టెస్టు ఫార్మాట్లో పరుగులు రాబట్టలేక ఈ మాజీ కెప్టెన్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. గత పదమూడు ఇన్నింగ్స్‌లో కలిపి స్మిత్ చేసిన పరుగులు కేవలం 232. ఇందులో ఒకే ఒక్క అర్ధ శతకం ఉంది.
స్మిత్‌కు చేదు అనుభవం
ఇక టీమిండియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ స్టీవ్ స్మిత్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టుల్లో అతడు చేసిన పరుగులు 0, 17, 2. ఈ నేపథ్యంలో ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. 2015 తర్వాత అతడు కనీసం టాప్-10లో కూడా నిలవలేకపోవడం ఇదే తొలిసారి.
వేటు వేసేందుకు రెడీ
ఈ పరిణామాల నేపథ్యంలో భారత్‌తో మూడో టెస్టులో స్మిత్‌పై వేటు వేసేందుకు ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అతడికి కొన్నాళ్లపాటు విశ్రాంతి పేరిట తప్పించనున్నట్లు సమాచారం.
అయితే, ఆసీస్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం.. స్మిత్ త్వరలోనే మునుపటి లయను అందుకుని.. పరుగుల వరద పారిస్తాడని ధీమా వ్యక్తం చేయడం విశేషం.
1-1తో సమంగా
కాగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో తమకు చివరిదైన ఈ సిరీస్‌లో కనీసం నాలుగు గెలిస్తేనే.. భారత్ నేరుగా ఫైనల్లో అడుగుపెడుతుంది.
ఇక ఆసీస్‌తో తొలి టెస్టులో 295 పరుగులు తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టులో మాత్రం పది వికెట్ల తేడాతో ఓడింది. ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్‌లోని గాబా మైదానంలో డిసెంబరు 14- 18 వరకు మూడో టెస్టు నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
అప్పుడు భీకర ఫామ్‌లో..
2014-2017 మధ్య స్టీవ్ స్మిత్ ఏడాదికి కనీసం ఐదు నుంచి ఆరు శతకాలు బాదాడు. అదే స్థాయిలో హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. గతేడాది సైతం సగటున 42.22తో పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో మూడు శతకాలు నమోదయ్యాయి.
అయితే, ఈ ఏడాది మాత్రం ఒక్కసారి కూడా అతడు బ్యాట్ ఝులిపించలేకపోయాడు. ప్రస్తుతం అతడి బ్యాటింగ్ సగటు 23.20. 2010 తర్వాత ఇదే స్మిత్ లోయెస్ట్ యావరేజ్.
చదవండి: ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే: రిక్కీ పాంటింగ్
Comments
Please login to add a commentAdd a comment