ఇంగ్లండ్ యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్ అతడేనంటూ బ్రూక్‌ను కొనియాడాడు. స్వదేశంలోనే.. విదేశీ గడ్డపై కూడా అతడు బ్యాట్ ఝులిపించే తీరు చూడముచ్చటగా ఉంటుందని ప్రశంసించాడు.
అగ్రపీఠం అధిరోహించిన బ్రూక్
కాగా 25 ఏళ్ల హ్యారీ బ్రూక్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో తొలిసారి అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌తో పరుగుల వరద పారిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. తాజా ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ (898 రేటింగ్ పాయింట్లు)గా నిలిచాడు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బ్రూక్ వరుసగా 171, 123, 55 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నంబర్‌వన్‌గా ఉన్న మరో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (898)ను వెనక్కి నెట్టి అగ్రపీఠం అధిరోహించాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్ గురించి ఐసీసీ రివ్యూ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్ అతడే
‘‘ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అతడే అనుకుంటున్నా. కేవలం సొంతగడ్డ మీద మాత్రమే కాదు.. విదేశాల్లోనూ అద్భుత ఆట తీరుతో అలరిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు దేశాల్లో ఏకంగా ఏడు శతకాలు నమోదు చేశాడు. అతడొక క్లాస్ ప్లేయర్. బ్రూక్ బ్యాటింగ్ చేస్తూ ఉంటే చూడటం నాకు ఎంతో ఇష్టం’’ అని రిక్కీ పాంటింగ్ హ్యారీ బ్రూక్‌ను కొనియాడాడు.
ఏడు సెంచరీలు విదేశీ గడ్డపైనే
కాగా రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన హ్యారీ బ్రూక్.. ఇప్పటి వరకు టెస్టుల్లో ఎనిమిది శతకాలు బాదాడు . ఇందులో ఏడు సెంచరీలు విదేశీ గడ్డపై చేసినవే. అదే విధంగా అతడి ఖాతాలో ద్విశతకం, ఒక త్రిశతకం కూడా ఉన్నాయి. ఇక వన్డేల్లోనూ హ్యారీ బ్రూక్ పేరిట ఒక సెంచరీ ఉంది.
మొత్తంగా ఇప్పటి వరకు తన కెరీర్‌లో హ్యారీ బ్రూక్ ఇంగ్లండ్ తరఫున 23 టెస్టులు, 20 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 2280, 719, 707 పరుగులు సాధించాడు.
మనోళ్ల పరిస్థితి ఏంటి?
ఇదిలా ఉంటే.. ఐసీసీ టాప్–10 టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ (4వ స్థానం), రిషభ్ పంత్ (9వ స్థానం) ఉండగా...శుబ్‌మన్ గిల్ 17వ, విరాట్ కోహ్లి 20వ స్థానంలో కొనసాగుతున్నారు.
మరోవైపు.. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (890) తన నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కగిసో రబాడ (856), హాజల్‌వుడ్ (851) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ ర్యాంక్ 4 నుంచి 5కు పడిపోగా, జడేజా 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్టు ఆల్‌రౌండర్లలో జడేజా (415) అగ్ర స్థానం, అశ్విన్ 3వ స్థానం (283) పదిలంగా ఉన్నాయి.
చదవండి: యశస్వి జైస్వాల్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్ లేకుండానే..
Comments
Please login to add a commentAdd a comment