యశస్వి జైస్వాల్‌పై రోహిత్‌ శర్మ ఫైర్‌ | Team Bus Leaves Without Jaiswal After Rohit Sharma Left Fuming Why | Sakshi
Sakshi News home page

యశస్వి జైస్వాల్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం.. ఆఖరికి యువ ఓపెనర్‌ లేకుండానే..

Published Thu, Dec 12 2024 11:23 AM | Last Updated on Thu, Dec 12 2024 11:54 AM

Team Bus Leaves Without Jaiswal After Rohit Sharma Left Fuming Why

టీమిండియా యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డ కారణంగా అతడి తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

మూడో టెస్టు ఆడేందుకు బ్రిస్బేన్‌కు
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలోని టీమిండియా.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఇక రెండో టెస్టుకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులోకి వచ్చినా భారత జట్టుకు భంగపాటు తప్పలేదు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్‌ బాల్‌ మ్యాచ్‌లో టీమిండియా కంగారూ జట్టు చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.

ఫలితంగా ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్‌- భారత్‌ మధ్య శనివారం(డిసెంబరు 14) నుంచి మూడో టెస్టు జరుగనుంది. ఇందుకోసం టీమిండియా అడిలైడ్‌ నుంచి బ్రిస్బేన్‌ చేరుకునే క్రమంలో జైస్వాల్‌ చేసిన పొరపాటు రోహిత్‌ ఆగ్రహానికి కారణమైనట్లు వార్తలు వచ్చాయి.

అతడు లేకుండానే వెళ్లిపోయిన బస్‌!
అడిలైడ్‌లో తాము బస చేసిన హోటల్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరేటపుడు యశస్వి జైస్వాల్‌ ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. సహచర ఆటగాళ్లు, హెడ్‌ కోచ్‌ గౌతం గంభీర్‌ తదితరులు అతడి కోసం సుమారు 20 నిమిషాల పాటు ఎదురుచూడాల్సి వచ్చిందట. అయినప్పటికీ యశస్వి రాకపోవడంతో టీమ్‌ బస్‌ అతడు లేకుండానే నిష్క్రమించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో టీమిండియా భద్రతా అధికారి.. హోటల్‌కు చెందిన కారులో యశస్వి జైస్వాల్‌ ఒక్కడిని ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టుకు తీసుకువెళ్లినట్లు సమాచారం. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కోపమొచ్చినట్లు తెలుస్తోంది.

కోహ్లి, బుమ్రా కుటుంబాలు ప్రత్యేక విమానంలో
ఇదిలా ఉంటే.. టీమిండియా సీనియర్లు విరాట్‌ కోహ్లి, జస్‌ప్రీత్‌ బుమ్రా తమ కుటుంబాలను కూడా ఆస్ట్రేలియాకు తీసుకువచ్చారు. కోహ్లి భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌లతో పాటు బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌, కుమారుడు అంగద్‌.. అంతా కలిసి చార్టెడ్‌ ఫ్లైట్‌లో బ్రిస్బేన్‌ చేరుకున్నట్లు సమాచారం. 

ఇక తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో జైస్వాల్‌ది కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. భారీ శతకం(161) బాది అతడు జట్టు గెలుపులో భాగమయ్యాడు.

చదవండి: IND vs AUS: 'రోహిత్‌ శర్మ ఓవర్‌ వెయిట్‌ ఉన్నాడు.. టెస్టు క్రికెట్‌కు పనికిరాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement