టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో రోహిత్ దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌లలో విఫలమైన హిట్‌మ్యాన్.. ఇప్పుడు ఆసీస్ పర్యటనలోనూ అదే తీరును కనబరుస్తున్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో రోహిత్ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు.
అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఈ క్రమంలో రోహిత్ శర్మపై విమర్శల వర్షం కురుస్తోంది. తాజాగా ఈ జాబితాలోకి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ చేరారు. రోహిత్ శర్మ స్వదేశంలో హీరో అని, విదేశాల్లో మాత్రం జీరో అని కల్లినన్ అన్నారు.
"రోహిత్ శర్మ కేవలం ఫ్లాట్ ట్రాక్‌లలో మాత్రమే ఆడగలడు. అందుకే అతడికి స్వదేశంలో మంచి రికార్డు ఉంది. కానీ విదేశీ గడ్డపై రోహిత్ ప్రదర్శన అంతంతమాత్రమే. అతడు బౌన్సర్లను ఎదుర్కొవడంలో ఎక్కువగా ఇబ్బంది పడతాడు.
ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో అయితే చాలా సందర్భాల్లో ఆ బౌన్సర్లకే అతడు తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. రోహిత్ ఫిట్‌నెస్ పరంగా కూడా అంత మెరుగ్గా కనిపించడం లేదు. విరాట్ కోహ్లి ఫిట్‌నెస్‌తో పోలిస్తే రోహిత్ చాలా వెనకబడి ఉన్నాడు.
రోహిత్ అధిక బరువు ఉన్నాడు. అతడు నాలుగు లేదు ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆడేందుకు సరిపోడు" అని ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్లినన్ పేర్కొన్నాడు. కాగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment