టీమిండియాతో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘోర ఓటమిని చవిచూసిన విషయం విదితమే. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బుమ్రా సారథ్యంలోని భారత జట్టు.. కంగారూలను 295 పరుగుల తేడాతో చిత్తు చిత్తు చేసింది.
ముఖ్యంగా బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో కమిన్స్ బృందానికి ఈ మేర ఘోర పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో మొదటి టెస్టు ఫలితం తర్వాత ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్ల మధ్య విభేదాలు వచ్చాయంటూ వార్తలు వినిపించాయి.
పెర్త్‌లో పరాజయం తర్వాత బ్యాటర్లదే తప్పు అన్నట్లుగా ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రవిస్ హెడ్.. ఇవన్నీ వట్టి వదంతులేనని కొట్టిపారేశాడు.
విభేదాలనే మాటకు తావు లేదు
‘ఏ జట్టులోనైనా గెలుపోటముల్లో బ్యాటర్లు, బౌలర్లందరి సమాన బాధ్యత ఉంటుంది. ఏ ఆటగాడైనా విజయం కోసం తాను వ్యక్తిగతంగా కూడా కీలకపాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తాడు.
మేం భారీ స్కోరు చేస్తే బౌలర్ల పని సులువవుతుందని తెలుసు. కాబట్టి సమష్టిగా ఉండటం తప్ప విభేదాలనే మాటకు తావు లేదు. మేం 0–1తో వెనుకబడి ఉన్నామనేది వాస్తవం. కానీ మాకు ఇంకా చాలా అవకాశం ఉంది. ఎన్నో సార్లు ప్రతికూల పరిస్థితుల్లో కోలుకొని చెలరేగిన సత్తా మా సొంతం’ అని హెడ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.
బుమ్రా సూపర్..
‘బుమ్రా బౌలింగ్ ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు మాకు అనుభవంలోకి వస్తోంది. అతను విసిరే సవాల్‌ను ఎదుర్కొంటూ పోటీ పడటం ప్రత్యేకంగా అనిపిస్తోంది. కెరీర్ ముగిసిన తర్వాత నేనూ బుమ్రాను ఎదుర్కొన్నాను అని మా మనవలకు చెప్పుకోగలను. ఈ సిరీస్‌లో మరికొన్నిసార్లు అతడితో తలపడే అవకాశం ఎలాగూ వస్తుంది. నా దృష్టిలో క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోయాడు’ అని హెడ్ వ్యాఖ్యానించాడు.
పెర్త్ టెస్టులో హెడ్ ఒక్కడే కాస్త బుమ్రాను సమర్థంగా ఎదుర్కొని అర్ధ సెంచరీ సాధించగా... స్మిత్, లబుషేన్, ఖాజా పూర్తిగా విఫలమయ్యారు. ‘బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. అయితే ఏ బౌలర్‌నైనా ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాటర్‌కు తనదైన శైలి ఉంటుంది.
వారు ఎలా ఆడగలరనేది వారికి మాత్రమే తెలుసు. నేను కాస్త మెరుగ్గా ఆడినంత మాత్రాన నా సహచరులు సలహాలు, సూచనల కోసం నా వద్దకు రాలేదు కదా’ అని బుమ్రా బౌలింగ్ గురించి హెడ్ అభిప్రాయపడ్డాడు.
‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైంది
నాలుగేళ్ల క్రితం ‘పింక్ బాల్’ టెస్టులో భారత్ 36 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తనకు గుర్తుందని, అయితే ఈసారి అలాంటిది జరగకపోవచ్చని అతను అన్నాడు.
తాము కూడా ‘పింక్ బాల్’ టెస్టు ఆడి చాలా కాలమైందని... పరిస్థితులకు తగినట్లుగా మన ఆటను మార్చుకోవడమే ఇరు జట్లకు కీలకమని హెడ్ చెప్పాడు. కాగా భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.
చదవండి: ‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
Comments
Please login to add a commentAdd a comment