జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలు
హిమాయత్‌నగర్‌కు చెందిన ఫార్మా ఉద్యోగి తరుణ్ (పేరు మార్చడమైంది) గతేడాది మార్చిలో మద్యం సేవించి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పట్టుబడ్డాడు. ఆయన బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ బైక్ ఖరీదు సుమారు రూ. 11 వేల వరకు ఉండటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారికి రూ. 10,500 జరిమానా విధిస్తుండటంతో బైక్ ఖరీదు, చలానా ఖరీదు ఒకే స్థాయిలో ఉండటంతో ఆయన బైక్‌ను స్టేషన్‌లో వదిలేశారు. ఇది ఒక్క తరుణ్ పరిస్థితి మాత్రమే కాదు. చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ద్విచక్ర వాహనదారులు జరిమానా రూ. 10,500 చెల్లించలేక బైక్ ఖరీదు దాదాపుగా అంతే ఉండటంతో అక్కడే వదిలేస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో 2019 మార్చి నుంచి 2021 డిసెంబర్ వరకు సుమారు 5,776 వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాయి. ఆయా వాహనాలను సీజ్ చేసి స్టేషన్ల ఆవరణల్లో ఉంచారు. అవికాస్తా దుమ్ముకొట్టుకుపోతున్నాయి. తమ వాహనాలు పాడవుతాయనే ఆందోళన ఉన్నా... అంత జరిమానా కట్టే పరిస్థితి లేక బాధపడని వారుండరు.
► అయితే ప్రభుత్వం వారందరికీ ఓ అవకాశాన్ని కల్పించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులు లోక్‌అదాలత్‌లో తాము మద్యం సేవించి వాహనం నడిపినట్లు అంగీకరిస్తే రూ. 2100 చెల్లించి ఆ కేసు నుంచి బయటపడి తమ వాహనాన్ని తీసుకెళ్లవచ్చు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్పించారు. 36 నుంచి 100 బీఏసీ ఉంటే రూ. 2100, 100 నుంచి 200 బీఏసీ ఉంటే రూ. 3100, 200 నుంచి 300 బీఏసీ ఉంటే రూ. 4100 చెల్లించాలి.
► వాహనదారుడు మాత్రం తాను మద్యం సేవించి వాహనం నడిపినట్లు లోక్ అదాలత్‌లో ఒప్పుకోవాల్సి ఉంటుంది.
► ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో 736 వాహనాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకొని వాహనాలను తీసుకున్నారు.
► మనో రంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న నాల్గవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కోర్టులో ఈ లోక్ అదాలత్ జరుగుతుంది. మరికొన్ని రోజులు ఈ అవకాశాన్ని కల్పించారు. సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొని వెళ్తే లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కరించి వాహనాన్ని రిలీజ్ చేస్తున్నారు.
వచ్చే నెల 12 వరకు...
► లోక్ అదాలత్ మార్చి 12వ తేదీ వరకు కొనసాగనుంది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు, లారీలు, డీసీఎంలు ఇలా అన్ని వాహనాలు సీజ్ అయి పోలీస్ స్టేషన్ల ఆవరణలో ఉండగా వీరంతా ఆయా పోలీస్ స్టేషన్లకు వచ్చి పోలీసులను సంప్రదిస్తే పోలీసులే మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి జరిమానా చెల్లింపజేసి వాహనాన్ని అందజేస్తారు.
మంచి అవకాశం
చాలా మంది వాహనదారులు వేలాది రూపాయలు చెల్లించుకోలేక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనాలు తీసుకోలేకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో సీజ్ చేసిన వాహనాలతో కిటకిటలాడుతున్నాయి.
► కొన్ని ఖరీదైన కార్లు, ఖరీదైన బైక్‌లు కూడా ఉన్నాయి. వీరందరికీ ఇదొక సువర్ణ అవకాశమనే చెప్పాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు అప్పటికే ప్రచారం చేశారు.
► సంబంధిత వాహనదారులకు కూడా లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించి సమాచారం ఇస్తున్నారు. రోజూ వంద నుంచి 200 వాహనాలు ఇలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వాహనాలు విడుదల అవుతున్నాయని సబంధిత వర్గాలవారు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment