నిప్పు మీద ఉప్పు... ఆనక గప్‌చుప్
అక్రమబియ్యంపై దాడుల తీరిదీ
తొలుత హడావుడి
డీలర్లకు కొమ్ముకాస్తున్న అధికారులు
అధికార పార్టీ ఒత్తిడితో చర్యలు శూన్యం
నిప్పు మీద ఉప్పు వేస్తే ఏమవుతుంది ... ఈ తరం వారికి తెలియకపోవచ్చు... ఎందుకంటే గ్యాస్‌స్టౌలే కదా... నిప్పు ఎక్కడిదీ...ఇక దానిమీద ఉప్పు వేస్తే ఏమవుతుందని ప్రశ్నార్థకంగా మొహం పెట్టే వారికి మరికొంత వివరంగా... నిప్పు మీద ఉప్పు వేస్తే సీమ టపాకాయలా పేలుతాయి...తరువాత అంతా గప్‌చుప్. ఈ చందంగానే జిల్లాలో పేదల బియ్యంపై జరుగుతున్న దాడులు తయారయ్యాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా ... అక్రమంగా నిల్వ ఉన్నా విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తూ హడావుడి చేస్తున్నారు ... పట్టుకున్న వాటిని పౌరసరఫరాల శాఖ పరిధిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగిస్తున్నారు... తరువాత వీరిపై అధికార పార్టీ నుంచి ఒత్తిడులు రావడంతో తొలుత కన్నెర్ర చేసేవారంతా నీరుగారిపోతున్నారు... తనిఖీల అనంతరం కేసు నీరుగార్చేస్తున్నారు ... అవన్నీ సక్రమమేనంటూ తేల్చేయడంతో ఎంచక్కా బయటపడిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు, దర్శి : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం నల్లబజారుకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా స్పందించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. తొలుత హడావుడి చేసినవారంతా తరువాత వచ్చిన ఒత్తిళ్లకు లొంగి మౌనం వహిస్తున్నారు. రేషన్ దుకాణాల అక్రమాలను అరికట్టాల్సిన క్షేత్రస్థాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులే అక్రమార్కులతో చేతులు కలపడంతో విజిలెన్స్ దాడులు సైతం వృథాగా మారుతున్నాయి. రేషన్ డీలర్ల నుంచి బయటకు బియ్యం తరలిపోవడం వెనుక అధికార పార్టీకి చెందిన నేతల అదృశ్య హస్తాలుండడంతో దొంగలు కూడా దొరల్లా బయట తిరుగుతున్నారన్న విమర్శలున్నాయి.
దర్శిలో కూడా ఈ నెల 5వ తేదీ రాత్రి ఓ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారం అందుకుని విజిలెన్స్ అధికారులు 50 కిలోల బస్తాలు 138, 25 కిలోల బస్తాలు 199 పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను,కూలీలను అదుపులోకి తీసుకుని ఈ బియ్యం ఎక్కడివని విచారించగా కృష్ణాపురం,కొత్తపల్లిలో డీలర్లు పంపగా పొదిలిరోడ్డులోని మిల్లుకు తీసుకు వచ్చినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి ఆ గ్రామాల్లో దుకాణాలకు వెళ్ళి తనిఖీలు నిర్వహించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను విజిలెన్స్ అధికారులు కోరారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించ కుండా రెండు దుకాణాల వద్దకు వెళ్ళి అన్నీ సరిపోయినట్లు రికార్డులు రాసుకుని రావడం పట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణాపురంలో మాత్రం డీలరుకు చాలాసార్లు ఫోన్ చేశామని, అయినా రాకపోవడంతో వీఆర్వో సమక్షంలో తాళాలు తీసి నిల్వలు రాసుకున్నామని అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకున్న నిల్వలు ఎంతన్నదీ తెలి యకుండా గోప్యంగా ఉంచారు.
తరచూ పట్టుబడిన లారీయే గోడౌన్ నుంచి డీలర్లకు తరచూ సరుకు తోలుతుండడం మరీ విడ్డూరమని గ్రామస్తులే చెబుతున్నారు. లారీ డ్రైవర్, కూలీలు కూడా ఆ సరుకును ఆ రెండు దుకాణాల నుంచే తీసుకు వచ్చామని విజిలెన్స్ అధికారులకు తెలిపారు. అదే నిజమైతే కొత్తపల్లిలో రేషన్ షాపుల్లో మళ్లీ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
ఈ నెల 10వ తేదీన ఒంగోలులో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం పెద్ద ఎత్తున గోడౌన్లలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యమేనని తేలింది. అప్పటికే అధికార పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకొని రేషన్ బియ్యం పెద్దగా లేవంటూ లెక్క తేల్చేశారు.