‘రేషన్’ దొంగల కొత్త మార్గాలు!
- క్వింటా బియ్యం మించకుండా రైళ్లలో మూటల తరలింపు
- రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తున్న ‘సివిల్ సప్లైస్’
- పటిష్టమైన చర్యలతో కాకినాడపోర్టుకు బందైన అక్రమ బియ్యం లారీలు
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పట్టించేం దుకు అక్రమార్కులు కొత్త మార్గాలు కనిపెట్టారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ దొంగలు తమ అక్రమాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇటీవల వరసగా జరిగిన సంఘటనలు చౌకధరల బియ్యం అక్రమార్కుల వ్యూహాన్ని బయటపెట్టింది. ఏభై కేజీలు, క్వింటా పరిమాణంలో మూటలు కట్టి బియ్యాన్ని రైళ్లలో రాష్ట్రసరిహద్దులు దాటిస్తున్నారు. ఇన్నాళ్లూ రోడ్డు మార్గంలో లారీలు, వ్యాన్లు, ఆటోల్లో మాత్రమే బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు.
కేవలం నెల వ్యవధిలోనే నాంపల్లి స్టేషన్‌లో 8 క్వింటాళ్లు, కాచిగూడ స్టేషన్‌లో 22 క్వింటాళ్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 18.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసకున్నారు. పట్టుబడిన ఈమొత్తం కలిసినా 48.50 క్వింటాళ్లే అయినా, ప్రతీ నిత్యం చిన్న, చిన్న మూటలుగా పెద్ద మొత్తంలోనే తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలకు బియ్యాన్ని అక్రమం గా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లపై దృష్టి పెట్టాలని పౌర సరఫరాల శాఖల అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. దాడులు కూడా నిర్వహిస్తున్నారు.
ఏటా రూ.25 వందల కోట్ల సబ్సిడీలు
రాష్ట్రంలోని 2.70కోట్ల మంది లబ్ధిదారుల కోసం ప్రతీ నెలా 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీనికోసం ఏటా రూ.2 వేల నుంచి రూ.2500కోట్ల సబ్సిడీనీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సివిల్ సప్లైస్ కమిషనర్ సి.వి.ఆనంద్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కార్యాలయాలను, బియ్యం గోదా ములను, బియ్యం రవాణా చేసే వాహనాలను ఈ కేంద్రం తో అనుసంధానించారు.
సుమారు 13వందల రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చగా, మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇరవై మందితో ఎన్‌పోర్స్‌మెంటు విభాగాన్ని నెల కొల్పారు. దీంతో బియ్యం అక్రమార్కులకు చెక్ పెట్టిన ట్టయింది. ప్రధానంగా కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే లారీలను కట్టడి చేశారు. రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపా రులను గుర్తించి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. దీంతో కాకినాడ పోర్టుకు తరలిపోయే రేషన్ బియ్యం దాదాపు బందైనట్లు పేర్కొం టున్నారు. ఈ కారణంగానే బియ్యం వ్యాపారులు కొత్త మార్గాల అన్వేషణలో పడినట్లు తెలుస్తోంది.