జె.పంగులూరు మండలంలో మంత్రి గొట్టిపాటి అనుచరులు రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసే రైస్‌మిల్లు
బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఆ నేతల దందా
పేదల నుంచి కొట్టేసిన బియ్యం మంత్రి గొట్టిపాటి అడ్డాలో రీ సైక్లింగ్
కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు తరలింపు
బియ్యం అక్రమ రవాణాలో మంత్రి ప్రధాన అనుచరుడు
బియ్యం సేకరణ బాధ్యత పచ్చ నేతలకు
స్టాక్ పాయింట్ల నుంచీ తరలించుకుపోతున్న మాఫియా
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘పేదలకు అందాసన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఎగుమతులు జరుపుతున్న నౌకల యజమానులెవరో కనుక్కుంటాను. కేసును సీఐడీకి ఇవ్వాలా, సీబీఐకి అప్పగించాలా అన్నది కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం’ శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతులను పరిశీలించాక డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పిన మాటలివి. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యాన్ని పేదల నుంచి అక్రమంగా సేకరిస్తూ విదేశాలకు రవాణా చేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవాలి.
మాఫియా వెనుక చక్రం తిప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులను కట్టడి చేయాలి. అవన్నీ వదిలేసి పోర్టుకెళ్లి బియ్యం అక్రమ రవాణా అంటూ పవన్‌కళ్యాణ్ హంగామా చేయడాన్ని చూసి టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు. పేదల నోటికాడి బియ్యాన్ని కాజేస్తున్న పచ్చనేతల సంగతి వదిలేసి తమ పార్టీ అధినేత కాకినాడ పోర్టులో చేసిన విన్యాసాలు అర్థంగాక జనసేన శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.
నియోజకవర్గాల వారీగా సేకరించి..
పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లుకు చెందిన ఇద్దరు నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యాన్ని సేకరించి ఇడుపులపాడు ప్రాంతంలోని ఒక రైస్ మిల్లులో రీసైక్లింగ్‌చేసి అక్కడి నుంచి బియ్యాన్ని అద్దంకి కేంద్రంగా ఉన్న మాఫియాకు అందిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఒంగోలుకు చెందిన వ్యక్తి మొత్తం బియ్యాన్ని సేకరించి వాటిని మంత్రి అనుచరులకు అప్పగిస్తున్నారు. బాపట్ల నియోజకవర్గం వెదుళ్లపల్లి, రైల్‌పేట, అప్పికట్లకు చెందిన కొందరు రైస్ మిల్లుల యజమానులే నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేసి బియ్యాన్ని అద్దంకి మాఫియాకు అప్పగిస్తున్నారు.
వేమూరు నియోజకవర్గంలో భట్టిప్రోలుకు చెందిన నేత రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి ఇద్దరు చొప్పున పచ్చనేతలకు బియ్యం సేకరణ బాధ్యతలు అప్పగించారు. రేపల్లె నియోజకవర్గంలో నిజాంపట్నం మండలానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుడు బియ్యం మాఫియాను నడిపిస్తున్నాడు. పల్నాడు జిల్లా నుంచి సైతం చౌక బియ్యాన్ని సేకరించి అద్దంకికి తరలిస్తున్నారు. రీసైక్లింగ్ అనంతరం కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు.
మంత్రి ఇలాకా నుంచే..
బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని టీడీపీ నేతలే అక్రమంగా సేకరిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రధాన అనుచరుడితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత కలిసి అక్రమ బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల కార్డుదారులకు కిలోకు రూ.10 చొప్పున చెల్లించి బియ్యాన్ని సేకరిస్తున్న మాఫియా చాలా నియోజకవర్గాల్లో కార్డుదారులకు పైసా ఇవ్వకుండా కొందరు పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో స్టాక్ పాయింట్ల నుంచే బియ్యాన్ని తరలిస్తున్నారు. బియ్యం సేకరిస్తున్న పచ్చ నేతలకు కిలోకు రూ.4 నుంచి రూ.5 ఇస్తుండగా.. నియోజకవర్గ స్థాయి నేతలకు రూ.లక్షల్లో ముట్టజెపుతున్నారు.
బియ్యం ప్రస్తావన తెస్తే కార్డులు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతుండటంతో చాలామంది పేదలు బియ్యం అందకపోయినా నోరు మెదపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గ పరిధిలోని రేణంగివరం, కోనంకి, కశ్యాపురం ప్రాంతాల్లో లీజుకు తీసుకున్న కొన్ని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి బస్తాల్లో నింపి గోడౌన్లలో స్టాక్ పెడుతున్నారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలించి రూ.కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment