అడిగేవారు లేరు... దోచేద్దాం! | Employment opportunities in rural areas | Sakshi
Sakshi News home page

అడిగేవారు లేరు... దోచేద్దాం!

Published Sat, Sep 21 2013 4:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Employment opportunities in rural areas

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం అక్రమార్కులకు వరంగా మారింది. పౌరసరఫరాల శాఖలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఉద్యమంలో పాల్గొనడంతో ఎవరూ పట్టించుకోరన్న ధీమాతో దోపిడీ పంజా విసురుతున్నారు. జిల్లాలోని మండల లెవల్ స్టాకిస్ట్ (ఎంఎల్‌ఎస్) పాయింట్లు అక్రమాలకు అడ్డాగా మారాయి. జిల్లాలో మొత్తం 15 ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది నగరానికి సమీపంలో కొత్తూరులో ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్. ఈ పాయింట్ పరిధిలో 265 రేషన్ షాపులు ఉన్నాయి. నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని చౌకదుకాణాలకు 2,129 మెట్రిక్ టన్నుల బియ్యం, 65 టన్నుల పంచదార, 144 టన్నుల పామాయిల్‌తో పాటు అమ్మహస్తం సరుకులు సరఫరా అవుతున్నాయి.
 
 అవినీతి జరుగుతుంది ఇలా..
 జిల్లాలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా అవుతుంటాయి. ఎఫ్‌సీఐ నుంచి వచ్చే ప్రతి బస్తాను తూకం వేసి పంపుతారు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ చౌకదుకాణాలకు వెళ్లే బియ్యం బస్తాలను  తూకం వేసి పంపాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఇక్కడ చేపట్టడం లేదు. రేషన్ షాపులకు సరఫరా చేసే బియ్యంలో బస్తాకు కనీసం 2 నుంచి 3 కిలోలు లోడేస్తున్నారు. దీని వల్ల డీలర్లకు నష్టం వస్తున్నా.. ఏం చేయలేని పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే కొందరు అధికారులకు ‘మేము పంపాలి’ కదా అంటూ గోడౌన్ ఇన్‌చార్జి చెబుతుంటారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లా ఉన్నతాధికారుల పేరు చెప్పి గోడౌన్ ఇన్‌చార్జి బహిరంగంగా అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 15 స్టాక్ పాయింట్లు నుంచి జిల్లాలోని 1,872 రేషన్ షాపులకు 11,246 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,500 లారీల ద్వారా రేషన్ షాపులకు బియ్యం సరఫరా అవుతున్నాయి. మొత్తం మీద ప్రతి నెల 6 వేల బస్తాలకు పైగా బియ్యం పక్కదారిపడుతున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.75 లక్షలకుపైగా ఉంటుందని అంచనా. ఈ తరుగు నష్టం చివరకు లబ్ధిదారుల మీదనే పడుతుంది. డీలర్లు లబ్ధిదారులకు సరఫరా చేసే సరుకుల్లో తూకాల్లో మోసం చేసి తరుగు నష్టాన్ని డీలర్లు పూడ్చుకుంటున్నారు.   
 
 అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో..
 రేషన్ షాపులకు ఇచ్చే అలాట్‌మెంట్‌లో డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు, గోడౌన్ ఇన్‌చార్జి ‘అయిన వారికి ఆకుల్లో..కాని వారికి కంచాల్లో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉంటూ నచ్చిన వారికి అలాట్‌మెంట్ ఎక్కువ, నచ్చని వారికి అలాట్‌మెంట్ తక్కువ చేస్తున్నట్లు డీలర్లు వాపోతున్నారు. ర్యాప్, టాప్ కూపన్లకు సంబంధించిన అలాట్‌మెంట్‌లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి అలాట్‌మెంట్ ఉన్న డీలర్లుకు సరుకులు పంపకుండా, ర్యాప్, టాప్ లేని కొందరు డీలర్లుకు పంపుతున్నట్లు డీలర్లు లబోదిబోమంటున్నారు.
 
 పంచదార, పామాయిల్ పంపిణీలోనూ...
 డిమాండ్ డ్రాఫ్ట్‌లు చెల్లించిన ప్రతి డీలరుకు పంచదార సరఫరా చేయాల్సి ఉంది. అయితే సెప్టెంబరులో కేవలం 20 శాతం మంది డీలర్లకు పూర్తిస్థాయిలో పంచదార సరఫరా అయింది.  మిగిలిన 80 శాతం మంది డీలర్లకు సంబంధించి కోటాలో 17 శాతం తగ్గించి పంపినట్లు డీలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా బాలాజీనగర్, పొదలకూరురోడ్డు, పోస్టాఫీస్ ఏరియా, నవాబుపేట వంటి ప్రాంతాల్లోని డీలర్ల్లకు ఇంకా పామాయిల్ చేరలేదు. దీంతో ఆయా ప్రాంతాల డీలర్లు వినియోగదారులకు ఏమి చెప్పాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు.
 
 మా దృష్టికి రాలేదు
 ఎంఎల్‌ఎస్ పాయింట్లలో అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమాలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల కొత్తగా బాధ్యతలను స్వీకరించాను. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకుంటాను. టి. ధర్మారెడ్డి, డీఎం, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement