పేదల బియ్యం.. పెద్దలపాలు | ration rice issue | Sakshi
Sakshi News home page

పేదల బియ్యం.. పెద్దలపాలు

Published Sat, Aug 27 2016 9:16 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

పేదల బియ్యం.. పెద్దలపాలు

పేదల బియ్యం.. పెద్దలపాలు

ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో మతలబు     
బస్తాకు రెండు కిలోల తగ్గుదల
చౌక డిపోకు వస్తుంది బస్తాకు 48 కిలోలే!  
నెలకు వేయి టన్నులు పక్కదారి
మిగిలిన బియ్యం మిల్లుకు తరలింపు
 
ప్రతినెలా తెల్ల రేషన్‌ కార్డుదారులకు పంచాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారులు.. కింది స్థాయి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా రేషన్‌ బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం పెద్దాపురం మండలం దివిలి గోదాముల నుంచి 198 బస్తాల రేషన్‌ బియ్యం ఉండూరులోని తేజ రైస్‌ మిల్లుకు తరలించగా, విజిలెన్స్‌ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకోవడంతో ఈ బాగోతం వెలుగు
చూసింది.
– సాక్షి, రాజమహేంద్రవరం
 
సాధారణంగా సరుకుకు అయిన మొత్తానికి డీలర్‌ డీడీ తీసిన తర్వాత మండల స్థాయి సరుకు (ఎంఎల్‌ఎస్‌) పాయింట్ల నుంచి చౌక డిపోలకు ప్రతినెలా రేషన్‌ తరలిస్తారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్‌కు వస్తున్న 50 కిలోల బస్తాలకు గాను 48 కిలోలే వస్తున్నాయి. డీలర్‌కు చేరే ముందు ప్రతి బస్తాను ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ఈ–వేమెంట్‌ ద్వారా తూచి ఇవ్వాలి. అందుకు ప్రతి పాయింట్‌లో ఎలక్ట్రానిక్‌ కాటాలను ప్రభుత్వం సమకూర్చింది. ఈ యంత్రాలు వచ్చి 16 నెలలైనా ఇప్పటివరకు వినియోగించలేదు. సాధారణ కాటా ద్వారానే బస్తాలను తూకం వేసి పంపుతున్నారు.
నెలకు వెయ్యి టన్నులు పక్కదారి!
జిల్లాలో 2,444 చౌక డిపోల ద్వారా 15,79,555 కార్డుదారులకు ప్రతినెలా 20 వేల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ పంపిణీ జరుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో డీలర్‌ పరిధిలో 300 నుంచి వెయ్యి కార్డుల వరకూ ఉంటున్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో లోడింగ్‌కు ముందే బస్తాకు రెండు కిలోల చొప్పున బియ్యాన్ని తగ్గిస్తున్నారు. క్వింటాకు నాలుగు కిలోల బియ్యం తక్కువగా వస్తుండడంతో సరాసరిగా ఒక్కో డీలర్‌కు రెండు నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం తక్కువగా చేరుతోంది. ఇలా ప్రతినెలా సుమారు వెయ్యి టన్నుల బియ్యం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి పక్కదారి పడుతున్నాయి. ఇలా మిగిలిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గోడౌన్‌ సిబ్బంది, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ అధికారులు వారి స్థాయికి తగ్గట్టు వాటాలు పంచుకుంటున్నారు.
లబ్ధిదారులకే నష్టం
చౌకడిపోల వద్ద బియ్యం పక్కదారి పడకుండా ప్రభుత్వం అన్ని షాపుల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–పోస్‌ యంత్రం ద్వారా లబ్ధిదారుని వేలిముద్ర తీసుకున్న తర్వాతే డీలర్‌ రేషన్‌ ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. బియ్యం కూడా ఈ–వేమెంట్‌
(ఎలక్ట్రానిక్‌ కాటా) ద్వారా కొలిచి ఇచ్చేలా ప్రతి దుకాణానికి యంత్రాన్ని సమకూర్చింది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో కూడా ఈ–వేమెంట్‌ ద్వారా బస్తాలను తూకం వేయాల్సి ఉన్నా అక్కడ అమలు కావడంలేదు. తమకు బస్తాకు 50 కిలోల బియ్యం రావడం లేదని, ఈ–వేమెంట్‌ ద్వారా తూకం వేచి ఇవ్వాల్సిందిగా రేషన్‌ డీలర్లు సంయుక్త కలెక్టర్‌(జేసీ) సత్యనారాయణ, డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావుకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. చౌకడిపోలకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అంతిమంగా లబ్ధిదారులు నష్టపోతున్నారు.
 
డీలర్‌ దగ్గరుండి సరుకు తెచ్చుకోవచ్చు
రేషన్‌ బస్తాల్లో తరుగుదల వస్తోందని డీలర్లు ఫిర్యాదు చేశారు. వారే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్దకు వెళ్లి స్వయంగా తూకం వేయించుకుని తెచ్చుకోమని చెప్పాం. అందరూ వెళ్లలేరు కనుక వారి తరఫున ఒక డీలర్‌ను వెళ్లమని చెప్పాం. తక్కువగా వస్తున్నాయనుకుంటే బయట తూకం వేసి చూసుకోవచ్చు. త్వరలో ఎంఎస్‌ఎల్‌ పాయింట్ల వద్ద కూడా ఈ–పోస్‌ యంత్రాలు పెట్టే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తోంది. ఇది అమలులోకి వస్తే ఈ సమస్య ఉండదు.
– జి.ఉమామహేశ్వరరావు, డీఎస్‌ఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement