Illigal Transport
-
ఎన్నికల సిత్రం.. కారు ఇంజిన్‌లో డబ్బు తరలిస్తుండగా..
సాక్షి, వరంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు దాదాపు రూ.650 కోట్లకు పైగానే నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇక, తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అయితే, కారు ఇంజిన్ డబ్బులు తరలిస్తుండగా హీట్ కారణంగా కరెన్సీ నోట్లు కాలిపోయి.. కారు నుంచి మంటలు, పొగ బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. ఎన్నికలవేళ వరంగల్ జిల్లాలో అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న డబ్బు అగ్నికి ఆహుతి అయింది. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ముందు భాగంలో(ఇంజిన్ వద్ద) డబ్బులను అమర్చారు. అనంతరం, వరంగల్ నుంచి వర్ధన్నపేట వైపు వెళ్తుండగా బొల్లికుంట క్రాస్ రోడ్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో, దట్టమైన పొగలు రావడంతో కారు అక్కడికక్కడే నిలిపివేసి డ్రైవర్ పరారయ్యాడు. అనంతరం, ఓ వ్యక్తి మరో కారులో వచ్చి కాలిపోతున్న నోట్ల కట్టలను మరో కారులో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, కారులో ఉన్న డబ్బు సుమారు 30 నుంచి 50 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా సినీ ఫక్కిలో జరిగినట్టు క్షణాల్లో జరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలంలోకి చేరుకున్న పోలీసులు కారు ఎవరది? డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారన్న కోణంలో విచారణ చేపట్టినట్టు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీసీ రవీందర్ తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణలో బీఆర్ఎస్ హాట్రిక్.. తేల్చిన మరో సర్వే -
ఐదుగురు తమిళ కూలీల అరెస్ట్
ఖాజీపేట: అక్రమంగా ఎర్రచందనం రవాణా జరుగుతోందన్న సమాచారంతో మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం, ఖాజీపేట ఎస్ఐ రంగారావు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఐదుగురు తమిళ కూలీలను అరెస్టు చేసి 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పుల్లూరు సమీపంలోని సెల్ టవర్ వద్ద తమిళ కూలీలు దుంగలను మోసుకుని పోతున్నట్లు ఆదివారం సాయంత్రం సమాచారం రావడంతో పోలీసులు దాడులు చేశారు. అందులో సుమారు 197 కేజీల బరువుల గల 10 దుంగలను స్వాధీనం చేసుకుని ఐదుగురు తమిళకూలీలను అదుపులోకి తీసుకున్నారు. 10 దుంగల విలువ సుమారు రూ. 5లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో పలువురు స్మగ్లర్లు తమపై దాడికి యత్నించారని సీఐ తెలిపారు. పట్టుబడిన వారందరూ తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం జిల్లా వారిగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
ఊపందుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా
- కర్ణాటక రాష్ట్రం హోస్కోటలో ప్రధాన స్థావరం - ముక్కలుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి - తెరవెనుక బడా స్మగ్లర్ల బాగోతం ఖాజీపేట: మన ప్రాంతం నుంచి నరికి తీసుకు పోతున్న ఎర్రచందనం ఇతర దేశాలకు తరలి పోతోంది. విదేశీ మార్కెట్లో మంచి ధర ఉండటమే అక్రమ రవాణాకు ప్రధాన కారణం. ఎర్రచందనం కేసులో అరెస్టయి బయటకు వచ్చిన వారు తిరిగి తమ కార్యకలాపాలను యధావిధిగా సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఒకే వ్యక్తి పలు సందర్భాల్లో పోలీసులకు చిక్కడమే ఇందుకు నిదర్శనం. చైనా, జపాన్, తైవాన్, దుబాయ్ లాంటి దేశాలకు ఎక్కువగా ఎర్రచందనం ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చైనా, జపాన్ దేశాల్లో ఇంటీరియల్ డెకరేషన్‌కు అధికంగా వాడుతున్నట్లు తెలిసింది. అందుకు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. దీంతో మన ఎర్రచందనం స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా ఎర్ర దొంగలు ఎంత ఖర్చు చేసైనా.. ఎంత మంది చనిపోయినా.. ఎన్ని సార్లు పట్టుబడుతున్నా.. ఎన్ని సార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఎర్రచందనం రవాణాను వదలడం లేదు. అందుకు స్థానికంగా ఉన్న కొందరు సహకరిస్తుండటంతో ఈ అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. హోస్కోట్ కేంద్రంగా డంపింగ్ మన వద్ద నుంచి తీసుకుపోతున్న ఎర్రచందనాన్ని కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట, కడలిన్, పరిసర ప్రాంతాల్లో అధికంగా డంపింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిని చిన్నచిన్న ముక్కలుగా తయారు చేసి వాటిని వేరే వస్తువులతో కలిపి విదేశాలకు పంపుతున్నారని సమాచారం. అలాగే బెంగుళూరుృ మైసూరు మార్గ మధ్యంలోని ప్రముఖ బొమ్మల తయారీ కేంద్రానికి కూడా ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. తెర వెనుక బడాస్మగ్లర్లు మన ప్రాంతంలోని అడవుల నుంచి తరలిపోతున్న ఎర్రచందనం చాలా మంది చేతులు మారి హోస్‌కోటకు చేరుతోంది. అడవుల్లోనుంచి రవాణాకు అనుకూల మయిన ప్రాంతాల్లోకి తెచ్చి వాహనంలో ఎక్కించినందుకు కూలీలకు ఇచ్చేది కేవలం కేజీకి రూ. 600. అలాగే ఇక్కడ ఉన్న వారితో బడా స్మగర్లర్లు బేరం కుదుర్చుకుని వారి సహకారంతో వాహనాల్లోకి ఎక్కించిన సరుకును తాము అనుకున్న చోటికి డంప్ చేయిస్తారు. అలా డంప్ చేసిన సరుకును మరో బడాస్మగ్లర్ తాను అనుకున్న చోటుకు తీసుకెళ్లి విదేశీ స్మగ్లర్లకు అమ్ముతున్నట్లు సమాచారం. పోలీసు.. అటవీ సిబ్బంది అండ ఎర్రచందనం అక్రమ రవాణాకు స్థానికులతోపాటు ఇటు పోలీసు, అటు అటవీ సిబ్బంది సహకారం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఖాజీపేట ఫారెస్ట్ పరిధిలో సుమారు 8 మందికి పైగానే సస్పెండ్ అయిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అందులో నాగసానిపల్లె బీట్ పరిధిలో పని చేస్తున్న శ్రీను అనే గార్డును ఉద్యోగం నుంచి తొలగించారు. తరువాత ఎర్రచందనం వ్యాపారంలో బిజీగా మారి అనేక సార్లు పట్టుబడ్డాడు. అలాగే మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో చాలా మంది పోలీసులకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గతంలో ఉన్నతాధికారులు గుర్తించారు. కొందరిపై చర్యలు కూడా తీసుకున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉంటున్న స్మగ్లర్లు కూడా ఇప్పడు భారీగా ఎర్రచందనం రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రత్యేక పోలీసు బృందాలు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఓయస్డీ నేతృత్వంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రచందనం వ్యవహారంపై పూర్తిగా ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతటి వారి పాత్ర ఉన్నా వదిలి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
పేదల బియ్యం.. పెద్దలపాలు
ఎంఎల్ఎస్ పాయింట్లలో మతలబు బస్తాకు రెండు కిలోల తగ్గుదల చౌక డిపోకు వస్తుంది బస్తాకు 48 కిలోలే! నెలకు వేయి టన్నులు పక్కదారి మిగిలిన బియ్యం మిల్లుకు తరలింపు ప్రతినెలా తెల్ల రేషన్ కార్డుదారులకు పంచాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారులు.. కింది స్థాయి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం పెద్దాపురం మండలం దివిలి గోదాముల నుంచి 198 బస్తాల రేషన్ బియ్యం ఉండూరులోని తేజ రైస్ మిల్లుకు తరలించగా, విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకోవడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. – సాక్షి, రాజమహేంద్రవరం సాధారణంగా సరుకుకు అయిన మొత్తానికి డీలర్ డీడీ తీసిన తర్వాత మండల స్థాయి సరుకు (ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి చౌక డిపోలకు ప్రతినెలా రేషన్ తరలిస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్‌కు వస్తున్న 50 కిలోల బస్తాలకు గాను 48 కిలోలే వస్తున్నాయి. డీలర్‌కు చేరే ముందు ప్రతి బస్తాను ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ–వేమెంట్ ద్వారా తూచి ఇవ్వాలి. అందుకు ప్రతి పాయింట్లో ఎలక్ట్రానిక్ కాటాలను ప్రభుత్వం సమకూర్చింది. ఈ యంత్రాలు వచ్చి 16 నెలలైనా ఇప్పటివరకు వినియోగించలేదు. సాధారణ కాటా ద్వారానే బస్తాలను తూకం వేసి పంపుతున్నారు. నెలకు వెయ్యి టన్నులు పక్కదారి! జిల్లాలో 2,444 చౌక డిపోల ద్వారా 15,79,555 కార్డుదారులకు ప్రతినెలా 20 వేల మెట్రిక్ టన్నుల రేషన్ పంపిణీ జరుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో డీలర్ పరిధిలో 300 నుంచి వెయ్యి కార్డుల వరకూ ఉంటున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్లో లోడింగ్‌కు ముందే బస్తాకు రెండు కిలోల చొప్పున బియ్యాన్ని తగ్గిస్తున్నారు. క్వింటాకు నాలుగు కిలోల బియ్యం తక్కువగా వస్తుండడంతో సరాసరిగా ఒక్కో డీలర్‌కు రెండు నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం తక్కువగా చేరుతోంది. ఇలా ప్రతినెలా సుమారు వెయ్యి టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి పక్కదారి పడుతున్నాయి. ఇలా మిగిలిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గోడౌన్ సిబ్బంది, ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు వారి స్థాయికి తగ్గట్టు వాటాలు పంచుకుంటున్నారు. లబ్ధిదారులకే నష్టం చౌకడిపోల వద్ద బియ్యం పక్కదారి పడకుండా ప్రభుత్వం అన్ని షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–పోస్ యంత్రం ద్వారా లబ్ధిదారుని వేలిముద్ర తీసుకున్న తర్వాతే డీలర్ రేషన్ ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. బియ్యం కూడా ఈ–వేమెంట్ (ఎలక్ట్రానిక్ కాటా) ద్వారా కొలిచి ఇచ్చేలా ప్రతి దుకాణానికి యంత్రాన్ని సమకూర్చింది. ఎంఎల్ఎస్ పాయింట్లో కూడా ఈ–వేమెంట్ ద్వారా బస్తాలను తూకం వేయాల్సి ఉన్నా అక్కడ అమలు కావడంలేదు. తమకు బస్తాకు 50 కిలోల బియ్యం రావడం లేదని, ఈ–వేమెంట్ ద్వారా తూకం వేచి ఇవ్వాల్సిందిగా రేషన్ డీలర్లు సంయుక్త కలెక్టర్(జేసీ) సత్యనారాయణ, డీఎస్ఓ ఉమామహేశ్వరరావుకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. చౌకడిపోలకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అంతిమంగా లబ్ధిదారులు నష్టపోతున్నారు. డీలర్ దగ్గరుండి సరుకు తెచ్చుకోవచ్చు రేషన్ బస్తాల్లో తరుగుదల వస్తోందని డీలర్లు ఫిర్యాదు చేశారు. వారే ఎంఎల్ఎస్ పాయింట్ వద్దకు వెళ్లి స్వయంగా తూకం వేయించుకుని తెచ్చుకోమని చెప్పాం. అందరూ వెళ్లలేరు కనుక వారి తరఫున ఒక డీలర్‌ను వెళ్లమని చెప్పాం. తక్కువగా వస్తున్నాయనుకుంటే బయట తూకం వేసి చూసుకోవచ్చు. త్వరలో ఎంఎస్ఎల్ పాయింట్ల వద్ద కూడా ఈ–పోస్ యంత్రాలు పెట్టే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తోంది. ఇది అమలులోకి వస్తే ఈ సమస్య ఉండదు. – జి.ఉమామహేశ్వరరావు, డీఎస్ఓ -
'పన్ను' లాగితే బియ్యం బయటపడ్డాయ్!
హైదరాబాద్: తీగ లాగితే డొంక కదిలినట్లు అంతర్రాష్ట్ర రవాణ పన్ను చెల్లించకుండా అక్రమంగా తెలంగాణలోకి ప్రవేశించి.. పట్టుబడ్డ ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా నుంచి శుక్రవారం హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు ఓ లారీ వచ్చింది. మార్గమధ్యలో అంతర్రాష్ట్రాల వాహనాల పన్నును చెల్లించకుండా తప్పించుకున్న ఆ వాహనాన్ని ఎస్ఓటీ పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. తీరా ఆ లారీని పరిశీలించగా దాదాపు 14 టన్నుల రేషన్ బియ్యం బయటపడ్డాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. -
బొలెరోలో రేషన్ బియ్యం అక్రమ రవాణా
నల్గొండ:: కోదాడ మండల పరిధిలో మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడులలో ఖమ్మం జిల్లా నుండి కోదాడకు తరలిస్తున్న సుమారు 41క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. కోదాడ పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్ పద్మనాభరావు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేటకు చెందిన ఉపేందర్ అనే వ్యక్తి తన బొలెరో వాహనంలో కోదాడకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు. ఈ విషయంపై సమాచామందుకున్న విజిలెన్స్ అధికారులు మంగళవారం ఉదయం మండల పరిధిలోని తమ్మర గ్రామం వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈ త నిఖీలలో 40క్వింటాళ్ళ 90కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న ఉపేందర్‌పై పౌరసరఫరాల చట్టం 6ఎ కింద కేసు నమోదు చేసి బియ్యాన్ని పట్టణ పరిధిలోని సాయిరాం మిల్లుకు, వాహనాన్ని అప్పగించారు.