ఊపందుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా | Red Sandle Illigal Transport | Sakshi
Sakshi News home page

ఊపందుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా

Published Sat, Nov 5 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 7:17 PM

ఊపందుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా

ఊపందుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా

- కర్ణాటక రాష్ట్రం హోస్‌కోటలో ప్రధాన స్థావరం
- ముక్కలుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి
- తెరవెనుక బడా స్మగ్లర్ల బాగోతం

ఖాజీపేట: మన ప్రాంతం నుంచి నరికి తీసుకు పోతున్న ఎర్రచందనం ఇతర దేశాలకు తరలి పోతోంది. విదేశీ మార్కెట్‌లో మంచి ధర ఉండటమే అక్రమ రవాణాకు ప్రధాన కారణం. ఎర్రచందనం కేసులో అరెస్టయి బయటకు వచ్చిన వారు తిరిగి తమ కార్యకలాపాలను యధావిధిగా సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఒకే వ్యక్తి పలు సందర్భాల్లో పోలీసులకు చిక్కడమే ఇందుకు నిదర్శనం. చైనా, జపాన్, తైవాన్, దుబాయ్‌ లాంటి దేశాలకు ఎక్కువగా ఎర్రచందనం ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చైనా, జపాన్‌ దేశాల్లో ఇంటీరియల్‌ డెకరేషన్‌కు అధికంగా వాడుతున్నట్లు తెలిసింది. అందుకు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. దీంతో  మన ఎర్రచందనం స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.  ఫలితంగా ఎర్ర దొంగలు ఎంత ఖర్చు చేసైనా.. ఎంత మంది చనిపోయినా.. ఎన్ని సార్లు పట్టుబడుతున్నా.. ఎన్ని సార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఎర్రచందనం రవాణాను వదలడం లేదు. అందుకు స్థానికంగా ఉన్న కొందరు సహకరిస్తుండటంతో ఈ అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
హోస్‌కోట్‌ కేంద్రంగా డంపింగ్‌
మన వద్ద నుంచి తీసుకుపోతున్న ఎర్రచందనాన్ని కర్ణాటక రాష్ట్రంలోని హోస్‌కోట, కడలిన్, పరిసర ప్రాంతాల్లో అధికంగా డంపింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.  వీటిని చిన్నచిన్న ముక్కలుగా తయారు చేసి వాటిని వేరే వస్తువులతో కలిపి విదేశాలకు పంపుతున్నారని సమాచారం. అలాగే బెంగుళూరుృ మైసూరు మార్గ మధ్యంలోని ప్రముఖ బొమ్మల తయారీ కేంద్రానికి కూడా ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం.  
తెర వెనుక బడాస్మగ్లర్లు
మన ప్రాంతంలోని అడవుల నుంచి తరలిపోతున్న ఎర్రచందనం చాలా మంది చేతులు మారి హోస్‌కోటకు చేరుతోంది. అడవుల్లోనుంచి రవాణాకు అనుకూల మయిన ప్రాంతాల్లోకి తెచ్చి వాహనంలో ఎక్కించినందుకు కూలీలకు ఇచ్చేది కేవలం కేజీకి రూ. 600. అలాగే ఇక్కడ ఉన్న వారితో బడా స్మగర్లర్లు బేరం కుదుర్చుకుని వారి సహకారంతో వాహనాల్లోకి ఎక్కించిన సరుకును తాము అనుకున్న చోటికి డంప్‌ చేయిస్తారు. అలా డంప్‌ చేసిన సరుకును మరో బడాస్మగ్లర్‌ తాను అనుకున్న చోటుకు తీసుకెళ్లి విదేశీ స్మగ్లర్లకు అమ్ముతున్నట్లు సమాచారం.
పోలీసు.. అటవీ సిబ్బంది అండ
ఎర్రచందనం అక్రమ రవాణాకు స్థానికులతోపాటు ఇటు పోలీసు, అటు అటవీ సిబ్బంది సహకారం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  గతంలో ఖాజీపేట ఫారెస్ట్‌ పరిధిలో సుమారు 8 మందికి పైగానే సస్పెండ్‌ అయిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అందులో నాగసానిపల్లె బీట్‌ పరిధిలో  పని చేస్తున్న శ్రీను  అనే గార్డును ఉద్యోగం నుంచి తొలగించారు. తరువాత ఎర్రచందనం వ్యాపారంలో బిజీగా మారి అనేక సార్లు పట్టుబడ్డాడు. అలాగే మైదుకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో చాలా మంది పోలీసులకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గతంలో ఉన్నతాధికారులు గుర్తించారు. కొందరిపై చర్యలు కూడా తీసుకున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉంటున్న స్మగ్లర్లు కూడా ఇప్పడు భారీగా ఎర్రచందనం రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ప్రత్యేక పోలీసు బృందాలు
ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఓయస్‌డీ నేతృత్వంలో  పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మైదుకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఎర్రచందనం వ్యవహారంపై పూర్తిగా ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతటి వారి పాత్ర ఉన్నా వదిలి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement