Redsandle
-
ఊపందుకున్న ఎర్రచందనం అక్రమ రవాణా
- కర్ణాటక రాష్ట్రం హోస్కోటలో ప్రధాన స్థావరం - ముక్కలుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి - తెరవెనుక బడా స్మగ్లర్ల బాగోతం ఖాజీపేట: మన ప్రాంతం నుంచి నరికి తీసుకు పోతున్న ఎర్రచందనం ఇతర దేశాలకు తరలి పోతోంది. విదేశీ మార్కెట్లో మంచి ధర ఉండటమే అక్రమ రవాణాకు ప్రధాన కారణం. ఎర్రచందనం కేసులో అరెస్టయి బయటకు వచ్చిన వారు తిరిగి తమ కార్యకలాపాలను యధావిధిగా సాగిస్తున్నారని స్పష్టమవుతోంది. ఒకే వ్యక్తి పలు సందర్భాల్లో పోలీసులకు చిక్కడమే ఇందుకు నిదర్శనం. చైనా, జపాన్, తైవాన్, దుబాయ్ లాంటి దేశాలకు ఎక్కువగా ఎర్రచందనం ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా చైనా, జపాన్ దేశాల్లో ఇంటీరియల్ డెకరేషన్‌కు అధికంగా వాడుతున్నట్లు తెలిసింది. అందుకు రూ.కోట్లు ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని తెలుస్తోంది. దీంతో మన ఎర్రచందనం స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఫలితంగా ఎర్ర దొంగలు ఎంత ఖర్చు చేసైనా.. ఎంత మంది చనిపోయినా.. ఎన్ని సార్లు పట్టుబడుతున్నా.. ఎన్ని సార్లు జైలుకు వెళ్లి వచ్చినా ఎర్రచందనం రవాణాను వదలడం లేదు. అందుకు స్థానికంగా ఉన్న కొందరు సహకరిస్తుండటంతో ఈ అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. హోస్కోట్ కేంద్రంగా డంపింగ్ మన వద్ద నుంచి తీసుకుపోతున్న ఎర్రచందనాన్ని కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట, కడలిన్, పరిసర ప్రాంతాల్లో అధికంగా డంపింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిని చిన్నచిన్న ముక్కలుగా తయారు చేసి వాటిని వేరే వస్తువులతో కలిపి విదేశాలకు పంపుతున్నారని సమాచారం. అలాగే బెంగుళూరుృ మైసూరు మార్గ మధ్యంలోని ప్రముఖ బొమ్మల తయారీ కేంద్రానికి కూడా ఎర్రచందనాన్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని కూడా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు సమాచారం. తెర వెనుక బడాస్మగ్లర్లు మన ప్రాంతంలోని అడవుల నుంచి తరలిపోతున్న ఎర్రచందనం చాలా మంది చేతులు మారి హోస్‌కోటకు చేరుతోంది. అడవుల్లోనుంచి రవాణాకు అనుకూల మయిన ప్రాంతాల్లోకి తెచ్చి వాహనంలో ఎక్కించినందుకు కూలీలకు ఇచ్చేది కేవలం కేజీకి రూ. 600. అలాగే ఇక్కడ ఉన్న వారితో బడా స్మగర్లర్లు బేరం కుదుర్చుకుని వారి సహకారంతో వాహనాల్లోకి ఎక్కించిన సరుకును తాము అనుకున్న చోటికి డంప్ చేయిస్తారు. అలా డంప్ చేసిన సరుకును మరో బడాస్మగ్లర్ తాను అనుకున్న చోటుకు తీసుకెళ్లి విదేశీ స్మగ్లర్లకు అమ్ముతున్నట్లు సమాచారం. పోలీసు.. అటవీ సిబ్బంది అండ ఎర్రచందనం అక్రమ రవాణాకు స్థానికులతోపాటు ఇటు పోలీసు, అటు అటవీ సిబ్బంది సహకారం పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఖాజీపేట ఫారెస్ట్ పరిధిలో సుమారు 8 మందికి పైగానే సస్పెండ్ అయిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. అందులో నాగసానిపల్లె బీట్ పరిధిలో పని చేస్తున్న శ్రీను అనే గార్డును ఉద్యోగం నుంచి తొలగించారు. తరువాత ఎర్రచందనం వ్యాపారంలో బిజీగా మారి అనేక సార్లు పట్టుబడ్డాడు. అలాగే మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలో చాలా మంది పోలీసులకు ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధాలు ఉన్నట్లు గతంలో ఉన్నతాధికారులు గుర్తించారు. కొందరిపై చర్యలు కూడా తీసుకున్నారు. వీరితో పాటు స్థానికంగా ఉంటున్న స్మగ్లర్లు కూడా ఇప్పడు భారీగా ఎర్రచందనం రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రత్యేక పోలీసు బృందాలు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఓయస్డీ నేతృత్వంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఎర్రచందనం వ్యవహారంపై పూర్తిగా ఆరాతీసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతటి వారి పాత్ర ఉన్నా వదిలి పెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. -
అడవుల్లో తమిళ తంబీలు..!
- కూలీలు మృతి చెందుతున్నా ఆగని వలసలు - దళారులదే కీలక పాత్ర - పోలీసుల అదుపులో లారీ, డ్రైవర్ ఖాజీపేట: అడవుల నుంచి తమిళ కూలీలను ఏరివేయాలని ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా కింది స్థాయిలో అది సాధ్యం కావడంలేదు. అందుకు రెట్టింపుగా తమిళ కూలీలు అడవుల్లోకి వలసలు వెళుతూనే ఉన్నారు. విడతల వారీగా ఒకరి తరువాత ఒకరు అన్నట్లు గా అడవుల్లోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం లంకమల అడవులు తమిళ కూలీలకు అడ్డగా మారాయి. అడవుల్లో తమిళ తంబీలు ఖాజీపేట మండల పరిధిలోని అడవులకు వెళ్లే దారులు తమిళ కూలీలకు ప్రధాన రహదారులుగా మారాయి. రాక పోకలన్నీ ఈ దారుల గుండా జరుగుతున్నాయని సమాచారం. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం సుమారు 60 మందికి పైగా కూలీలు అడవుల్లోకి Ðð ళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే సుమారు 200 మందికి పైగానే అడవుల్లో తమిళ కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గొర్రెల కాపరులు, పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. పోలీసులు అడవుల్లోకి కూంబింగ్‌కు వెళ్లినప్పడు తమిళ కూలీలు పోలీసులకు చిక్కకుండా పరారవుతున్నారు. ముఖ్యంగా తమిళ కూలీలు కన్నెల వాగు చెరువు పై భాగం నుంచి, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ దగ్గర నుంచి అడవుల్లోకి వెళుతున్నారని తెలుస్తోంది. మృతి చెందుతున్నా మారని తంబీలు అడవుల్లో అనారోగ్యం కారణంగా, నీరు దొరకక పలువురు తమిళ కూలీలు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. వేసవి కాలంలో అడవుల్లో నీరు దొరకక నీటి కోసం వెతుక్కుంటూ వచ్చి చివరకు నాగసాని పల్లె చెరువు పైభాగాన ఓ తమిళ కూలీ మృతి చెందాడు. కన్నెల వాగు చెరువు పై భాగాన ఉన్న అడవుల్లో మరో తమిళ కూలీ మృతి చెందాడు. అలాగే దువ్వురు మండలం సమీపంలోని చెరువు సమీపంలో ఇంకొకరు మృతి చెందారు. ఇలా సుమారు 5 మందికి పైగానే మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. అయినా తమిళ కూలీలు స్థానికుల సహకారంతో అడవుల్లోకి వెళుతూనే ఉన్నారు. దళారులదే కీలక పాత్ర అడవుల్లోకి తమిళ కూలీలను పంపించేందుకు చాలా మంది దళారుల అవతారం ఎత్తినట్లు సమాచారం. స్థానిక స్మగ్లర్లకు, తమిళ కూలీలకు మధ్య దళారులుగా ఉంటూ తమిళ నాడు నుంచి ఇక్కడకు తీసుకుని వచ్చి అడవుల్లోకి పంపుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకు భారీగానే ముడుపులు స్మగ్లర్ల నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన కూలీలకు నష్టపరిహారం కూడా ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ పనులు లేక చాలా మంది ఇక్కడి అడవులకు తరలి వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో లారీ తమిళ కూలీలను అడవుల్లోకి వివిధ మార్గాల్లో తరలిస్తున్నారు. బస్సుల ద్వారా వస్తున్న చాలా మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేస్తుండడంతో ఇప్పడు పద్ధతి మార్చారు. లారీల ద్వారా కూలీలను తీసుకు వచ్చి రాత్రి వేళల్లో అడువులకు దగ్గరి రహదారుల్లో వదలి వెళుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం రావుల పల్లె చెరువు సమీపంలోని అడవుల్లో తమిళ కూలీలను దించి వస్తున్న లారీని పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు తెలిసింది. లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. తమిళ కూలీలకు అడ్డుకట్ట వేయలేరా..? అడవుల్లోకి వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం సంపదను దోచుకుని పోతున్న స్మగ్లర్లకు, అందుకు సహకరిస్తున్న తమిళ కూలీల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ శాతం ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారు. ఇక మిగిలిన కొద్ది సంపదను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికయినా ఎర్రచందనం అక్రమ రవాణాకు కారణమయిన తమిళ కూలీలకు అడ్డుకట్ట వేసి ఎర్రచందనం సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
లంకమలలో పోలీసుల కూంబింగ్
చెన్నూరు : లంకమల అడవుల్లో ప్రత్యేక పోలీసుల కూంబింగ్ రెండు రోజులుగా కొనసాగుతోంది. గురువారం రాత్రి ప్రారంభమైన ఈ కూంబింగ్ శుక్రవారం కూడా కొనసాగింది. ఎర్రచందనం దుంగల కోసం తమిళ కూలీలు భారీగా లంకమలలో తిష్ట వేశారనే స్పష్టమైన సమాచారంతో ఈ దాడులు చేస్తున్నారు. చెన్నూరు ఎస్ఐతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు 20 మందికి పైగా చెన్నూరు మండల సరిహద్దుల్లో నుంచి లంకమలలోకి వెళ్లారు. ఎర్రచందనం చెట్లు నరికిన ప్రదేశానికి వారు చేరినట్లు సమాచారం. కూలీలు పట్టుబడ్డారా లేదా అనేది తెలియాల్సి ఉంది. చెన్నూరు, ఖాజీపేట అటవీ ప్రాంతంలో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం: రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని డీవీ పెంట మంగమ్మ బరకలు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారు జామున ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో రూ. 20 లక్షలు విలువ జేసే 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రుద్రవరం రేంజర్ రామ్‌సింగ్ స్థానిక ఫారెస్ట్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వారం రోజులుగా నల్లమల అడవిలోకి కూలీలు వచ్చారని, వీరు ఎర్రచందనం దుంగలను లారీలో తరలించనున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో గస్తీ ముమ్మరం చేశామన్నారు. శుక్రవారం తెల్లవారు జామున మంగమ్మ బరకలు ప్రాంతంలో దుంగలను తరలిస్తున్న కూలీలను ప్రోటెక్షన్‌వాచర్ల గమనించి పట్టుకునేందుకు యత్నించేలోపు దుంగలను వదిలేసి పరారైనట్లు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాల్గొన్న వారు రుద్రవరం అటవీ రేంజ్ ప్రాంత గ్రామాలకు చెందినవారిగా భావిస్తున్నట్లు రేంజర్ తె లిపారు. ఈ సమావేశంలో డివి పెంట సెక్షన్ అధికారి విజయలక్ష్మి, బీట్ అధికారులు పెద్దన, వెంకటన్నలతోపాటు ప్రొటె క్షన్ వాచర్లు నరసింహ, హనుమంతు, అంకయ్యపాల్గొన్నారు.