అడవుల్లో తమిళ తంబీలు..!
- కూలీలు మృతి చెందుతున్నా ఆగని వలసలు
- దళారులదే కీలక పాత్ర
- పోలీసుల అదుపులో లారీ, డ్రైవర్
ఖాజీపేట: అడవుల నుంచి తమిళ కూలీలను ఏరివేయాలని ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా కింది స్థాయిలో అది సాధ్యం కావడంలేదు. అందుకు రెట్టింపుగా తమిళ కూలీలు అడవుల్లోకి వలసలు వెళుతూనే ఉన్నారు. విడతల వారీగా ఒకరి తరువాత ఒకరు అన్నట్లు గా అడవుల్లోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం లంకమల అడవులు తమిళ కూలీలకు అడ్డగా మారాయి.
అడవుల్లో తమిళ తంబీలు
ఖాజీపేట మండల పరిధిలోని అడవులకు వెళ్లే దారులు తమిళ కూలీలకు ప్రధాన రహదారులుగా మారాయి. రాక పోకలన్నీ ఈ దారుల గుండా జరుగుతున్నాయని సమాచారం. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం సుమారు 60 మందికి పైగా కూలీలు అడవుల్లోకి Ðð ళ్లినట్లు తెలిసింది. ఇప్పటికే సుమారు 200 మందికి పైగానే అడవుల్లో తమిళ కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని గొర్రెల కాపరులు, పోలీసులు ధ్రువీకరిస్తున్నారు. పోలీసులు అడవుల్లోకి కూంబింగ్‌కు వెళ్లినప్పడు తమిళ కూలీలు పోలీసులకు చిక్కకుండా పరారవుతున్నారు. ముఖ్యంగా తమిళ కూలీలు కన్నెల వాగు చెరువు పై భాగం నుంచి, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ దగ్గర నుంచి అడవుల్లోకి వెళుతున్నారని తెలుస్తోంది.
మృతి చెందుతున్నా మారని తంబీలు
అడవుల్లో అనారోగ్యం కారణంగా, నీరు దొరకక పలువురు తమిళ కూలీలు మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. వేసవి కాలంలో అడవుల్లో నీరు దొరకక నీటి కోసం వెతుక్కుంటూ వచ్చి చివరకు నాగసాని పల్లె చెరువు పైభాగాన ఓ తమిళ కూలీ మృతి చెందాడు.
కన్నెల వాగు చెరువు పై భాగాన ఉన్న అడవుల్లో మరో తమిళ కూలీ మృతి చెందాడు. అలాగే దువ్వురు మండలం సమీపంలోని చెరువు సమీపంలో ఇంకొకరు మృతి చెందారు. ఇలా సుమారు 5 మందికి పైగానే మృతి చెందిన సంఘటనలు ఉన్నాయి. అయినా తమిళ కూలీలు స్థానికుల సహకారంతో అడవుల్లోకి వెళుతూనే ఉన్నారు.
దళారులదే కీలక పాత్ర
అడవుల్లోకి తమిళ కూలీలను పంపించేందుకు చాలా మంది దళారుల అవతారం ఎత్తినట్లు సమాచారం. స్థానిక స్మగ్లర్లకు, తమిళ కూలీలకు మధ్య దళారులుగా ఉంటూ తమిళ నాడు నుంచి ఇక్కడకు తీసుకుని వచ్చి అడవుల్లోకి పంపుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకు భారీగానే ముడుపులు స్మగ్లర్ల నుంచి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన కూలీలకు నష్టపరిహారం కూడా ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ పనులు లేక చాలా మంది ఇక్కడి అడవులకు తరలి వస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు.
పోలీసుల అదుపులో లారీ
తమిళ కూలీలను అడవుల్లోకి వివిధ మార్గాల్లో తరలిస్తున్నారు. బస్సుల ద్వారా వస్తున్న చాలా మందిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేస్తుండడంతో ఇప్పడు పద్ధతి మార్చారు. లారీల ద్వారా కూలీలను తీసుకు వచ్చి రాత్రి వేళల్లో అడువులకు దగ్గరి రహదారుల్లో వదలి వెళుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం రావుల పల్లె చెరువు సమీపంలోని అడవుల్లో తమిళ కూలీలను దించి వస్తున్న లారీని పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు తెలిసింది. లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
తమిళ కూలీలకు అడ్డుకట్ట వేయలేరా..?
అడవుల్లోకి వెళ్లి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎర్రచందనం సంపదను దోచుకుని పోతున్న స్మగ్లర్లకు, అందుకు సహకరిస్తున్న తమిళ కూలీల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ శాతం ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించారు. ఇక మిగిలిన కొద్ది సంపదను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికయినా ఎర్రచందనం అక్రమ రవాణాకు కారణమయిన తమిళ కూలీలకు అడ్డుకట్ట వేసి ఎర్రచందనం సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.