పదో తేదీ దాటినా పత్తాలేని బియ్యం
-
నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం
-
బియ్యం కోసం నిరుపేదల ఎదురు చూపు
-
వర్షాల కారణంగా ఆలస్యమైందన్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు
లింగాలఘణపురం : ప్రభుత్వం చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. ప్రతీ నెల 1వ తేదీ లోపు మండల లెవల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్ నుంచి గ్రామాల్లోని చౌకధరల డిపోలకు సరుకులు అందాల్సి ఉంటుంది. గత మూడు మాసాలుగా ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రావాల్సిన సరకులు సకాలంలో రావడం లేదు.
దీంతో నిరుపేదలకు ప్రతీ నెల బియ్యం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వచ్చిన బియ్యం డీలర్లు సకాలంలో పంపిణీ చేయడం లేదని ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి రావడం ఆలస్యం కావడంతో పేదలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. లింగాలఘణపురం మండలంలోని 17 గ్రామ పంచాయితీల పరిధిలో 26 చౌకధరల దుకాణాలు ఉండగా 1,962.30 కిలోల బియ్యం, 11,048 కిలోల చక్కెర సరఫరా చేయాల్సి ఉంటుంది. కాగా 10వ తేదీ వరకు కూడా సగం షాపులకు కూడా బియ్యం సరఫరా కాలేదు. 15 తేదీలోగా స్టాక్ వివరాలను తెలియజేస్తూ డీలర్లు డీడీలు తీయాల్సి ఉంటుంది.
10 తేదీ వరకు కూడా బియ్యం రాకపోవడంతో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. వర్షాల కారణంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరాలో ఆలస్యమైందని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు విజయేందర్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో 2115 చౌకధరల దుకాణాలు ఉండగా 384 షాపులకు సరుకులు చేరలేదని ఆయన చెప్పారు.