ఇప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నులు ఎవరు అంటే.. ముకేశ్ అంబానీ, గౌతమ్ ఆదానీ పేర్లు చెబుతారు. కానీ వీరికంటే ముందు, ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడు 'విజయపత్ సింఘానియా' (Vijaypat Singhania). పేరుకు తగ్గట్టుగానే వ్యాపార సామ్రాజ్యాన్ని విజయపథంలో నడిపించి.. ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
విజయపత్ సింఘానియా.. రేమండ్ గ్రూప్ మాజీ ఛైర్మన్. ఈయన సారథ్యంలో కంపెనీ బాగా అభివృద్ధి చెందింది. ఫ్యాషన్, టెక్స్‌టైల్ రంగంలో తిరుగులేని రారాజుగా ఎదిగారు. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, విజయవంతమైన బ్రాండ్‌లలో రేమండ్ ఒకటిగా నిలబడటానికి ఈయన కీలక పాత్ర పోషించారు.
వ్యాపార సామ్రాజ్యంలో.. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా, బిర్లా వంటి వారినే అధిగమించిన సింఘానియా అపారమైన సంపద కలిగి ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లు సమాచారం. కుటుంబ వ్యాపారాన్ని గౌతమ్ సింఘానియా చేతుల్లోకి తీసుకున్న తరువాత తండ్రి.. కొడుకుల మధ్య సంబంధాలు క్షిణించాయి.
నిజానికి విజయపత్ సింఘానియా.. తన వ్యాపారాన్ని ఇద్దరు కొడుకులను సమంగా పంచాలని ఆలోచించారు. కానీ పెద్ద కుమారుడు మధుపతి సింఘానియా సింగపూర్‌కు వెళ్లి కుటుంబ వ్యాపారానికి దూరమయ్యాడు. చిన్న కుమారుడు గౌతమ్ సింఘానియా కంపెనీని నియంత్రణలోకి తీసుకున్నాడు. ఆ సమయంలోనే విజయపత్ సింఘానియా.. రేమండ్ గ్రూప్‌లోని తన షేర్లన్నింటినీ గౌతమ్‌కు బదిలీ చేశాడు. చివరికి గౌతమ్ తన తండ్రిని తన సొంత ఇంటి నుంచి బయటకు గెంటేశాడు.
వ్యాపార సామ్రాజ్యంలో అగ్రస్థానములో నిలిచిన విజయపత్ సింఘానియా.. ఇప్పుడు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. 2015లో కుమారుడు గౌతమ్ సింఘానియాకు విజయపత్ కంపెనీ పగ్గాలను అప్పగించిన తరువాత.. తనకు నిలువ నీడ లేకుండా చేసినందుకు విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?
ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. దాంతో విజయ్‌పత్ తన కుమారుడికి దూరంగా ఉంటున్నారు. అతడు తన కొడుక్కి అన్నీ ఇచ్చేసి పొరపాటు చేశానని, తల్లిదండ్రులు పిల్లలకు అన్నీ ఇచ్చేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పారు. జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన ఈయన నేడు దీనస్థితిలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment