Vijaypat Singhania
-
‘ఆ కంపెనీని రక్షించండి.. ఈ ప్రశ్నలకు మీ సమాధానం’
రేమండ్ కంపెనీ ప్రమోటర్‌గా ఉన్న సింఘానియా కుటుంబంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కంపెనీ ఎండీగా ఉన్న గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్‌మోదీతో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అందుకు కంపెనీలో 75 శాతం వాటాను ఆమె డిమాండ్ చేశారు. దానిపై తాను కోర్టును ఆశ్రయించేందుకు న్యాయసలహాదారులను కూడా నియమించుకున్నారని వార్తలు వచ్చాయి. గౌతమ్ సింఘానియా మాత్రం ఆయన మరణం తర్వాత తన ఆస్తిని ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి దానికి చేరేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంతో కంపెనీ డైరెక్టర్లలో స్పష్టత లోపిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ బిజినెస్ మోడల్‌పై ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపబోతుందోనని ఆందోళనలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్(ఇయాస్) రేమండ్ కంపెనీని దాని ప్రమోటర్ల నుంచి రక్షించాలని స్వతంత్ర డైరెక్టర్లను కోరింది. సింఘానియా, నవాజ్‌మోదీ ఆరోపణలపై విచారణ జరిపించాలని తెలిపింది. విచారణ సమయంలో గౌతమ్, నవాజ్‌లను బోర్డు నుంచి దూరంగా ఉంచాలని సూచించింది. నవంబర్ 13న నవాజ్ మోదీ నుంచి గౌతమ్ సింఘానియా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాని తర్వాత ఆమె కంపెనీ నికర విలువ దాదాపు రూ.12వేల కోట్లలో 75 శాతం వాటా కావాలని కోరింది. గౌతమ్ సింఘానియా తనపై దాడి చేశారని ఆరోపించింది. కంపెనీ సృష్టికర్త, గౌతమ్ సింఘానియా తండ్రి విజయపత్ సింఘానియా తన కోడలికే తను మద్దతు ఇస్తానని ఓ మీడియా వేదికగా చెప్పారు. ఇదీ చదవండి: ఇషా అంబానీకి చెందిన ఆ కంపెనీ విలువ రూ.8 లక్షల కోట్లు! గౌతమ్, నవాజ్ ఇద్దరు బోర్డు సభ్యులు ఇంత తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ స్వతంత్ర డైరెక్టర్లు మౌనంగా ఉండడాన్ని ఇయాస్ తప్పబట్టింది. ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని, గత కొన్ని రోజులుగా స్టాక్ ధర భారీగా తగ్గిపోతుందని తెలిపింది. వీలైనంత త్వరగా ఈ విషయంపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇయాస్ స్వతంత్ర డైరెక్టర్లకు కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. 1. డైరెక్టర్లలో ఎవరైనా కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 2. కంపెనీ లేదా డైరెక్టర్లపై నేరారోపణలు ఉంటే ఏం చేస్తారు? 3. డైరెక్టర్ల చర్యలు కంపెనీ బ్రాండ్‌కు నష్టం కలిగిస్తున్నట్లయితే ఎలా స్పందిస్తారు? 4. సీఈఓ కొన్ని చర్యల ద్వారా అరెస్ట్ అయితే కంపెనీపై దాని ప్రభావం ఎలా ఉంటుంది? 5. గౌతమ్, నవాజ్ త్వరలో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోబోతుండగా కంపెనీ కార్యాకలాపాల కోసం తాత్కాలిక సీఈఓను నియమించకూడదా? ఇదీ చదవండి: ఈ రోజు బంగారం ధరలు ఎంతంటే? ఈ ప్రశ్నల ఆధారంగా స్వతంత్ర డైరెక్టర్లు కంపెనీ వాటాదారుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చర్యలు తీసుకోవాలని ఇయాస్ పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా నిష్పక్షపాతంగా ఎదుర్కొనేందుకు బోర్డు సభ్యలు సిద్ధంగా ఉండాలని సూచించింది. -
రాయల్ లైఫ్, అంబానీ కంటే రిచ్ : ఇపుడు అద్దె ఇంట్లో దుర్భరంగా..!
కుటుంబ తగాదాలలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన వ్యాపారం కుటుంబం రేమాండ్ గ్రూపు. భారతీయ వస్త్ర పరిశ్రమలో రేమాండ్ అనే బ్రాండ్‌ను, దానికొక ఇమేజ్ను తీసుకొచ్చిన వ్యక్తి రేమండ్ వ్యవస్థాపకుడు, సంస్థ మాజీ ఛైర్మన్, దేశీయ కుబేరుల్లో ఒకరు విజయపత్ సింఘానియా. గార్మెంట్ అండ్ టెక్స్టైల్ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుని లక్షలాదిమంది భారతీయులకు చేరువయ్యారు. "ది కంప్లీట్ మ్యాన్", "ఫీల్స్ లైక్ హెవెన్..ఫీల్స్ లైక్ రేమాండ్" ట్యాగ్‌లైన్‌లతొ అద్బుతమైన దుస్తులను అందించిన ఘనత ఆయనదే. రూ.1200 కోట్ల సామ్రాజ్యం ప్రఖ్యాత ఏవియేటర్, సర్క్యూట్ రేసింగ్ లవర్ , సాహస క్రీడల ప్రేమికుడు విలాసవంతమైన జీవితాన్ని గడిపిన విజయ్‌పథ్ కొడుకు గౌతం సింఘానియా విబేధాలతో ఆయన జీవితం దుర్భరంగా మారిపోయింది. ఇంటి నుండి గెంటేయడంతో నానా కష్టాలు పడుతున్నారు. ఒకపుడు 12వేల కోట్ల రూపాయల నెట్‌వర్త్‌తో అంబానీలకు (రేమండ్ గ్రూప్ యజమానిగా ఉన్నప్పుడు ముఖేష్ అంబానీ చాలా చిన్నవాడు) మించిన ధనవంతుడిగా, దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఒక వెలుగు వెలిగిన ఆయన 85 ఏళ్ల వయసులో అద్దె ఇంట్లో జీవితాన్ని గడుపుతున్నారు. మానవ సంబంధాలు, కుటుంబంలోని కుటుంబ వివాదాల దుష్పరిణామాలకు రేమండ్ వ్యవహారం, ఒక రిమైండర్.. ఒక హెచ్చరిక లాంటిది . 1900లో వాడియా మిల్లు నుండి ప్రారంభమై రేమండ్ అతి తక్కువ కాలంలోనే కొత్త శిఖరాలకు చేరింది. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక దుస్తుల కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విమానయానంలో అతని విజయాలు అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. ప్రపంచ రికార్డులను నెలకొల్పాయి. ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ ఆఫ్ హానర్ , లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కోసం టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు వంటి ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. విజయ్‌పత్ పెద్ద కుమారుడు మధుపతి, కుటుంబానికి దూరంగా సింగపూర్‌లో స్థిరపడ్డాడు. రేమాండ్ వ్యాపార వ్యవహరాలను చూసుకుంటున్న రెండో కొడుకు గౌతమ్‌తో మధ్య ఆస్తి వివాదం కోర్టు కెక్కింది. సంబంధాలు దెబ్బతిన్నాయి. అనూహ్యంగా విజయపత్ సింఘానియాను చైర్పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి తొలగించడం పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే గౌతమ్ భార్య నవాజ్‌మోడీతో విడాకుల వ్యవహారం రచ్చకెక్కింది. తన ప్రియమైన బిడ్డలు, గోప్యత అంటూ గౌతమ్ మౌనంగా తెరవెనుక ఉండిపోతుండగా, అతని భార్య నవాజ్మాత్రం తనను హింసించాడని ఆరోపించింది. గ్రూపు బోర్డులో ఉన్న తనకు గౌతమ్ ఆస్తిలో 75 శాతం భరణం కావాలని డిమాండ్ చేస్తోంది. 2015 ఫిబ్రవరి 15 నా జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజు. నాజీవితాన్ని శాశ్వతంగా మార్చేసే లేఖంపై సంతకం చేసిన రోజు. నా జీవితంలో చేసిన అత్యంత మూర్ఖపు తప్పు - విజయ్‌పత్ సింఘానియా రేమాండ్ కుప్పకూలుతోంది.. నా గుండె బద్దలవుతోంది ఇది ఇలా ఉంటే ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించిన విజయపత్ సింఘానియా సొంత కొడుకు గౌతమ్‌కు బదులుగా నవాజ్‌కు , ఆమె ఇద్దరు ఆడపిల్లలకు మద్దతుగా నిలవడం విశేషం. తన కుమారుడు గౌతమ్ కంపెనీని నాశనం చేస్తున్నాడని, ఇది చూసి తన గుండె బద్దలవుతోందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి కష్టించి నిర్మించిన సామ్రాజ్యాన్ని కూల్చివేయడం బాధకలిగిస్తోందన్నారు. అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం, భర్త సంపదలో సగం స్వయంచాలకంగా విడిపోయిన భార్యకు వెళ్తుంది. మరి నవాజ్ 75 శాతం కోసం ఎందుకు పోరాడుతోందని అనేది తనకు అర్థం కాలేదని కానీ ? గౌతమ్ లొంగడని వ్యాఖ్యానించారు. విడాకుల వివాదంతో భారీ నష్టం రేమండ్ గ్రూప్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.10,985.33 కోట్లుగా ఉంది. ఇటీవలి కాలంలో రూ 11 వేల కోట్ల కంటే దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. రేమండ్ 64 సంవత్సరాలుగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కావడంతో పాటు చాలా స్ట్రాంగ్ స్టాక్‌గా ఉంది. సింఘానియా-మోడీ విడాకుల కథ స్టాక్ ధరను భారీగా దెబ్బతీసింది.నవంబర్ 23 నాటికి రేమండ్ స్టాక్ దాదాపు 5.15 శాతం నష్టపోయింది. ఫలితంగా గత 7 సెషన్లలో దాని మార్కెట్ క్యాప్‌లో దాదాపు రూ. 1,600 కోట్ల మేర నష్టపోయింది. -
బతికుండగానే మీ ఆస్తిని రాయకండి!
ఆస్తి కేసులో వ్యాపారదిగ్గజం చర్చలకు తనయుడు గౌతమ్ సిద్ధం కుదరదంటూ విజయ్ మొండిపట్టు? ముంబై: కోట్లకు పడగనెత్తి దేశంలో బిలీనియర్ జాబితాలో ఒకరిగా వెలుగొందిన విశ్రాంత వ్యాపారదిగ్గజం విజయ్‌పథ్ సింఘానియా ఇంటిపోరు కోర్టుకెక్కటం తెలిసిందే. వారసుడు, రేమండ్ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ గౌతమ్ సింఘానియా తండ్రి నుంచి ఆస్తులు మొత్తం లాగేసుకుని రోడ్డు మీద పడేయటం, ఓ అద్దె కొంపలో దుర్భర జీవితాన్ని గడుపుతున్న ఆయన తన వాటా, భరణం కోసం కోర్టుకెక్కటంతో వ్యవహారం వెలుగుచూసింది. అయితే ఇలాంటి వాళ్లు ప్రతీ ఇంట్లో ఉంటారని.. అందుకే పిల్లలను గుడ్డిగా నమ్మకండంటూ విజయ్ తల్లిదండ్రులందరికీ ఓ విజ్ఞప్తి చేస్తున్నారు. పుత్ర ప్రేమతో గౌతమ్ కు ఆస్తిలో వాటా ఇవ్వటం, వ్యాపార రహస్యాలను చెప్పటం, చివరకు విశ్రాంతి తీసుకోండి అన్న కొడుకు మాటను సలహాగా భావించి బిజినెస్ మొత్తం అప్పజెప్పటం, ఆపై ఓ అద్దె కొంపలో కాలం వెళ్లదీస్తుండటం.. కొడుకు చేతిలో మోసపోయానని తెలుసుకోవటానికి ఈ బిజినెస్ టైకూన్ కు ఎక్కువ సమయం పట్టలేదు. "79 ఏళ్ల ఈ వయసులో నేను కోర్టుకు ఎక్కాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. తలదాచుకునేందుకు ఆశ్రయం కూడా లేకపోవటంతోనే నా కుటుంబంపై పోరాటానికి సిద్ధమయ్యా. ఆస్తి మొత్తం రాసిచ్చాక నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. అంతేకాదు కంపెనీ డబ్బును సొంత అవసరాలకు వాడుకున్నా ఓపికపట్టా" అని ఆయన చెబుతున్నారు. "తల్లిదండ్రులకు చేసే విన్నపం ఒక్కటే. మీ పిల్లల్ని ప్రేమించండి. కానీ, అస్సలు నమ్మకండి. ప్రతీ పది మంది పిల్లలో ఆరుగురు మంచోళ్లు ఉండొచ్చు. ఒకరు మిమల్ని అమితంగా ఇష్టపడేవాళ్లు ఉండొచ్చు. కానీ, ఒక్కరైనా మోసం చేసేవాళ్లు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మీరు బతికి ఉన్నప్పుడు మీ ఆస్తి వాళ్ల పేరిట రాయకండి" అని విజయ్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు విజయ్ అనవసరంగా కుటుంబాన్ని కోర్టుకు లాగారని ఆరోపిస్తున్నారు తనయుడు గౌతమ్. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని చెప్పినప్పటికీ తండ్రి వినటం లేదంటూ ఆయన తెలిపారు. మలబార్ హిల్‌లోని 36 అంతస్తుల జేకే హౌస్ భవంతిలో తనకు రావాల్సిన డూప్లెక్స్‌ను ఇప్పించాలని విజయ్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించటంతోపాటు 18వ తేదీలోపు వివరణ ఇవ్వాలని రేమండ్ కంపెనీని జస్టిస్ గిరీష్ కులకర్ణి ఆదేశించారు. దీంతో గౌతమ్ తండ్రి వద్దకు మధ్యవర్తిలతో రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తన హక్కుల కోసమే పోరాడుతాను తప్ప జీవితంలో తిరిగి కొడుకు మొహం చూసే ప్రసక్తే లేదని విజయ్‌పథ్ ఖరాఖండిగా చెబుతున్నారు. జేకే హౌజ్ తో మొదలైన సింఘానియా ప్రస్థానం తర్వాత రేమండ్ లిమిటెడ్ సంస్థల అధిపతిగా బాధ్యతలు స్వీకరించాక పూలపాన్పు మీదే కొనసాగింది. వస్త్ర రంగంలో సవాళ్లను సలువుగా అధిగమించి ప్రతీనోట్లో రేమండ్ అనే బ్రాండ్ పేరును నానేలా ఆయన చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారంతోపాటు వ్యాపారవేత్తగా అరుదైన గౌరవాలు ఎన్నో అందుకున్నారు. -
అచ్చం సినిమాలా ఓ బిజినెస్ టైకూన్ స్టోరీ
ముంబై: మోస్ట్ పాపులర్ క్లోతింగ్‌బ్రాండ్ రేమండ్స్ మాజీ ఛైర్మన్, బిజినెస్ టైకూన్ విజయ్‌పత్ సింఘానియా (78) చేతిలో పైసాలేని పరిస్థితిలో రోడ్డున పడ్డారు. ముంబాయికి చెందిన మాజీ షెరీఫ్ డిసెంబరు 19, 2005 నుండి 18 డిసెంబరు 2006 వరకు రేమండ్ గ్రూప్‌కు చైర్మన్‌గా ఒక వెలుగు వెలిగారు. అలా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని అవోకగా నిర్వహించిన బడా వ్యాపారవేత్త ప్రస్తుతం కనీస అవసరాలకు కూడా కటకటలాడుతున్నారంటే నమ్మగలమా? కానీ తాజా వార్తల ప్రకారం ఇది నమ్మలేని నిజం. అచ్చం సినిమా స్టోరీని తలపిస్తూ...ఒకప్పుడు దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన విజయ్‌పత్ సింఘానియా ప్రస్తుతం నిలువ నీడలేని స్థితిలో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే తన సొంత కుమారుడి పైనే బాంబే హైకోర్టులో కేసు వేశారు సింఘానియా కంపెనీలోని షేర్లను తన కుమారుడుకి అప్పజెప్పి, ఇపుడు తాము మోసపోయామని, తన డూప్లెక్స్ హౌస్ తదితర ఆస్తులను తనకు ఇప్పించాల్సిందిగా కోరుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. తన బాధాకరమైన ఆర్థిక పరిస్థితి గురించి కోర్టుకు వివరిస్తూ, మూడు రోజుల క్రితం సీనియర్ సింఘానియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. రూ. 1000 కోట్ల విలువ కలిగిన కంపెనీని, షేర్లను కొడుకు గౌతమ్ సింఘానియా అప్పగించానని చెప్పారు. అలాగే మలబార్ హిల్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన 36 అంతస్తుల జేకే హౌస్‌లో డూప్లెక్స్ ను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ముంబైలోని నెపియన్ సీ రోడ్లో ఓ ఇంటిలోకి నెలకు రూ. 7 లక్షలకు అద్దెకు ఉంటున్నామనీ, ఇప్పటివరకూ చెల్లించిన అద్దెను కూడా రీఎంబర్స్ చేయాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు తన కుమారుడి కోసం మొత్తం ఆస్తిని అంతా సింఘానియా త్యాగం చేస్తే.. ఇప్పుడా కొడుకు ఆయనను ఏమీ లేని స్థితికి చేరుస్తున్నాడని న్యాయవాదులు అంటున్నారు. ఈయన డాక్యుమెంట్స్, పర్సనల్ ఫైల్స్‌ను నిర్వహించిన ఇద్దరు రేమండ్ ఉద్యోగులు కూడా మిస్ కావడంతో, ఆయా పత్రాలను పొందేందుకు వీలు లేకుండా పోయిందని చెబుతున్నారు. కొడుకు గౌతమ్ వేధింపులు ఎక్కువయ్యాయని లాయర్లు చెబుతున్నారు. రీసెంట్గా గుండె ఆపరేషన్ కూడా చేయించుకున్న సింఘానియా కరియర్లో అనేక సాహసోపేత అవార్డులు, రివార్డులు కూడా ఉన్నాయి. నిర్విరామంగా 5,000 గంటలపాటు విమాన నడిపిన అనుభవం ఉంది. 1994 లో ఫెడేరేషన్ ఆఫ్ ఏరోనాటిక్ ఇంటర్నేషనల్ 24 రోజులు పాటు 34,000 కి.మీ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. భారత వైమానిక దళం నుంచి ఎయిర్ కమోడర్ పురస్కారం, 1998 లో యూకే నుండి భారతదేశం వరకు సోలో మైక్రోలైట్ విమానాన్ని నడిపి వరల్డ్ రికార్డ్, 2005 లో రాయల్ ఏరో క్లబ్ నుంచి బంగారు పతకం, 2006 లో భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ సత్కారాన్ని అందుకున్నారు. 'యాన్ ఏంజిల్ ఇన్ ది కాక్‌పిట్' అనే పుస్తకాన్ని కూడా రచించారు. మార్చి 2007 లో ఐఐఎం అహ్మదాబాద్ కు పాలక మండలి ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. కాగా ఆయన పెద్దకుమారుడు 1988లో మధుపతి సింఘానియా తన కుటుంబంతో తెగతెంపులు చేసుకున్నారు. ముంబైలోని పూర్వీకుల ఇంటిని, ఇతర ఆస్తులను వదులుకుని భార్యా, నలుగురు పిల్లలతో సహా సింగపూర్‌కి వెళ్లిపోయారు. అనంతరం గౌతం హరి సింఘానియా రేమాండ్స్ ఎండీగా ఎన్నికయ్యారు. అయితే దీనిపై సీనియర్ సింఘానియా కుమారుడు గౌతం ఇంకా స్పందించలేదు. -
కోర్టుకెక్కిన రేమండ్స్ వారసులు!
ఆస్తి కోసం విజయపథ్ సింఘానియా మనవల పిటిషన్ ♦ తమ తల్లిదండ్రులు 1998లో చేసుకున్న ఒప్పందం చెల్లదని వాదన ♦ తోసిపుచ్చిన ముంబాయి హైకోర్టు ముంబై : రేమండ్స్ వ్యవస్థాపకుడు విజయపథ్ సింఘానియా వారసులు కోర్టుకెక్కారు. 1998లో విజయపథ్ ఇద్దరు కుమారుల్లో ఒకరైన మధుపతి సింఘానియా... రేమండ్స్పై తన హక్కును వదులుకుంటూ విజయపథ్తో చేసుకున్న ఒప్పందాన్ని... మధుపతి సంతానం ఇపుడు సవాలు చేశారు. ఈ మేరకు ఆయన పిల్లలు నలుగురూ కలిసి వేసిన పిటిషన్‌ను శుక్రవారం బోంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలున్న మధుపతి సింఘానియా ... పూర్వీకుల ఆస్తిపై తనకు, తన వారసులకు సంక్రమించిన హక్కులన్నిటినీ తండ్రికే వదిలి వేస్తూ 1998 డిసెంబరు 30న ఒప్పందం చేసుకున్నారు. అప్పట్లో ఆ నలుగురు పిల్లలూ మైనర్లు. ఇపుడు అందర్లోకీ చిన్నవాడైన కుమారుడు రైవత్ హరి సింఘానియాకు 18 ఏళ్లు నిండటంతో తనతో పాటు అక్కలు అనన్య-29, రసాలిక-26, త రుణి-20 కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఈ ఒప్పందం చట్ట విరుద్ధం. సింఘానియా కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా మమ్మల్ని, మా తల్లిదండ్రుల్ని పూర్తి వివక్షతో చూస్తున్నారు’’ అని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో విజయపథ్ సింఘానియా తన మరో కుమారుడైన గౌతమ్ సింఘానియాకు రేమండ్స్లో 37 శాతం వాటాను గిఫ్ట్ డీడ్ రూపంలో దఖలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.1,166 కోట్ల విలువ చేసే ఈ వాటాను గౌతమ్‌కు బదలాయించటమే ఈ కోర్టు వ్యాజ్యానికి ప్రధాన కారణం. నలుగురు మనవలూ కలిసి వేసిన ఈ పిటిషన్లో వారు తమ తాత విజయపథ్ను, రేమండ్‌ను ప్రతివాదులుగా చేశారు. తమ తల్లిదండ్రులు మధుపతి, అనురాధలను వాదులుగా పేర్కొన్నారు. ‘‘హిందూ కుటుంబ చట్టం ప్రకారం వారసుల హక్కులను కాలరాస్తూ ఒక్కరికే ఆస్తిని కట్టబెట్టే అధికారం విజయపథ్కు లేదు. రేమండ్‌తో పాటు ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులపై కూడా మాకు, మా తల్లిదండ్రులకు ఉన్న హక్కుల్ని హరిస్తూ 1998లో చేసుకున్న ఒప్పందం కూడా చెల్లదు. ఇది చట్టవిరుద్ధం. ఎందుకంటే ఈ ఒప్పందం గురించి మాలో చిన్నవాడైన రైవత్ హరికి 18 ఏళ్లు వచ్చేకే మాకు తెలిసింది’’ అని వారు వివరించారు. జరిగింది ఇదీ... 1998లో మేనేజిమెంట్ విధానాలకు సంబంధించి విజయపథ్ సింఘానియాకు, ఆయన కుమారుడు మధుపతికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. ఈ మేరకు చేసుకున్న ఒప్పందం మేరకు మధుపతి తన కుటుంబంతో సహా సింగపూర్‌లో స్థిరపడ్డారు. తండ్రి ఆస్తిలో తనకున్న వాటాను, ఇతర హక్కుల్ని అన్నిటినీ వదిలేశారు. నాటి తన మైనర్ పిల్లల వాటాలను కూడా రాసిచ్చేశారు. కోర్టు తీర్పు రేమండ్ షేరుపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. షేరు రూ.454 వద్ద ఏమాత్రం మార్పులేకుండా క్లోజయింది.