కోర్టుకెక్కిన రేమండ్స్ వారసులు!
ఆస్తి కోసం విజయపథ్ సింఘానియా మనవల పిటిషన్
♦ తమ తల్లిదండ్రులు 1998లో చేసుకున్న ఒప్పందం చెల్లదని వాదన
♦ తోసిపుచ్చిన ముంబాయి హైకోర్టు
ముంబై : రేమండ్స్ వ్యవస్థాపకుడు విజయపథ్ సింఘానియా వారసులు కోర్టుకెక్కారు. 1998లో విజయపథ్ ఇద్దరు కుమారుల్లో ఒకరైన మధుపతి సింఘానియా... రేమండ్స్‌పై తన హక్కును వదులుకుంటూ విజయపథ్‌తో చేసుకున్న ఒప్పందాన్ని... మధుపతి సంతానం ఇపుడు సవాలు చేశారు. ఈ మేరకు ఆయన పిల్లలు నలుగురూ కలిసి వేసిన పిటిషన్‌ను శుక్రవారం బోంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలున్న మధుపతి సింఘానియా ... పూర్వీకుల ఆస్తిపై తనకు, తన వారసులకు సంక్రమించిన హక్కులన్నిటినీ తండ్రికే వదిలి వేస్తూ 1998 డిసెంబరు 30న ఒప్పందం చేసుకున్నారు.
అప్పట్లో ఆ నలుగురు పిల్లలూ మైనర్లు. ఇపుడు అందర్లోకీ చిన్నవాడైన కుమారుడు రైవత్ హరి సింఘానియాకు 18 ఏళ్లు నిండటంతో తనతో పాటు అక్కలు అనన్య-29, రసాలిక-26, త రుణి-20 కలిసి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘ఈ ఒప్పందం చట్ట విరుద్ధం. సింఘానియా కుటుంబ సంప్రదాయాలకు విరుద్ధంగా మమ్మల్ని, మా తల్లిదండ్రుల్ని పూర్తి వివక్షతో చూస్తున్నారు’’ అని వారు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఏడాది మొదట్లో విజయపథ్ సింఘానియా తన మరో కుమారుడైన గౌతమ్ సింఘానియాకు రేమండ్స్‌లో 37 శాతం వాటాను గిఫ్ట్ డీడ్ రూపంలో దఖలు చేశారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.1,166 కోట్ల విలువ చేసే ఈ వాటాను గౌతమ్‌కు బదలాయించటమే ఈ కోర్టు వ్యాజ్యానికి ప్రధాన కారణం.
నలుగురు మనవలూ కలిసి వేసిన ఈ పిటిషన్లో వారు తమ తాత విజయపథ్‌ను, రేమండ్‌ను ప్రతివాదులుగా చేశారు. తమ తల్లిదండ్రులు మధుపతి, అనురాధలను వాదులుగా పేర్కొన్నారు. ‘‘హిందూ కుటుంబ చట్టం ప్రకారం వారసుల హక్కులను కాలరాస్తూ ఒక్కరికే ఆస్తిని కట్టబెట్టే అధికారం విజయపథ్‌కు లేదు. రేమండ్‌తో పాటు ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులపై కూడా మాకు, మా తల్లిదండ్రులకు ఉన్న హక్కుల్ని హరిస్తూ 1998లో చేసుకున్న ఒప్పందం కూడా చెల్లదు. ఇది చట్టవిరుద్ధం. ఎందుకంటే ఈ ఒప్పందం గురించి మాలో చిన్నవాడైన రైవత్ హరికి 18 ఏళ్లు వచ్చేకే మాకు తెలిసింది’’ అని వారు వివరించారు.
జరిగింది ఇదీ...
1998లో మేనేజిమెంట్ విధానాలకు సంబంధించి విజయపథ్ సింఘానియాకు, ఆయన కుమారుడు మధుపతికి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. ఈ మేరకు చేసుకున్న ఒప్పందం మేరకు మధుపతి తన కుటుంబంతో సహా సింగపూర్‌లో స్థిరపడ్డారు. తండ్రి ఆస్తిలో తనకున్న వాటాను, ఇతర హక్కుల్ని అన్నిటినీ వదిలేశారు. నాటి తన మైనర్ పిల్లల వాటాలను కూడా రాసిచ్చేశారు.
కోర్టు తీర్పు రేమండ్ షేరుపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. షేరు రూ.454 వద్ద ఏమాత్రం మార్పులేకుండా క్లోజయింది.