క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది.. అక్కడి పేషెంట్లకు ఉచితంగా! | This Country Made Cancer Vaccine Provide Patients Free | Sakshi
Sakshi News home page

క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ వచ్చేస్తోంది.. అక్కడి పేషెంట్లకు ఉచితంగా!

Published Wed, Dec 18 2024 8:07 PM | Last Updated on Wed, Dec 18 2024 8:26 PM

This Country Made Cancer Vaccine Provide Patients Free

వైద్యరంగంలో అద్భుతానికి రష్యా కేరాఫ్‌గా మారనుంది. క్యాన్సర్‌ జబ్బు నయం చేసే వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాదు.. దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఆర్‌ఎన్‌ఏ(mRNA) ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు జనరల్‌ డైరెక్టర్‌ అయిన అండ్రే కప్రిన్‌ ప్రకటించారు.

చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌లో కణతి(ట్యూమర్‌) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. 

ఎలా పని చేస్తుందంటే.. 
కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ (ఎంఆర్‌ఎన్‌ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే.. రష్యా తయారుచేసిన క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ కూడా ఇదే తరహాలో పని చేయనుంది. అం‍టే..

RNA(రిబోన్యూక్లియిక్ యాసిడ్) అనేది ఒక పాలీమెరిక్ అణువు, ఇది జీవ కణాలలో చాలా జీవసంబంధమైన విధులకు అవసరం.  మెసేంజర్‌ ఆర్‌ఎన్‌ఏ పీస్‌ను వ్యాక్సిన్‌ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాలను ఒక నిర్దిష్టమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్‌ను విదేశీగా(బయటి నుంచి వచ్చిందిగా) గుర్తిస్తుంది. తద్వారా దానితో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. కాన్సర్ విషయంలో, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుందన్నమాట.

ఏఐ పాత్ర కూడా.. 
కాగా, ఈ క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ రూపకల్పనలో ఏఐ పాత్ర ఎంతో ఉందని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించుకున్నారు. పర్సనలైజ్డ్‌ వ్యాక్సిన్‌లను రూపొందించడానికి.. AI-ఆధారిత న్యూరల్ నెట్‌వర్క్ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించగలవని, ఈ ప్రక్రియను ఒక గంటలోపే పూర్తి చేయగలదని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. అతిత్వరలో క్యాన్సర్‌ వ్యాక్సిన్‌తో పాటు తర్వాతి తరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగానే.. వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ను జనాలకు.. అదీ ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement