RNA vaccines
-
క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేస్తోంది.. అక్కడి పేషెంట్లకు ఉచితంగా!
వైద్యరంగంలో అద్భుతానికి రష్యా కేరాఫ్‌గా మారనుంది. క్యాన్సర్ జబ్బు నయం చేసే వ్యాక్సిన్‌ను రూపొందించడమే కాదు.. దానిని ఉచితంగా రోగులకు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఎంఆర్ఎన్ఏ(mRNA) ఆధారితంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు జనరల్ డైరెక్టర్ అయిన అండ్రే కప్రిన్ ప్రకటించారు.చాలా పరిశోధన సంస్థలు సమిష్టి కృషితో క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించాయని.. ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో కణతి(ట్యూమర్) పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్(వ్యాధికారక ఏజెంట్)ను నిరోధించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఎలా పని చేస్తుందంటే.. కరోనా నుంచి రక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొన్ని టీకాలు మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) పోగుల ఆధారంగా పనిచేస్తాయి. అవి కరోనా వైరస్‌ను గుర్తించేలా మానవ రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తాయి. అలాగే.. రష్యా తయారుచేసిన క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇదే తరహాలో పని చేయనుంది. అంటే..RNA(రిబోన్యూక్లియిక్ యాసిడ్) అనేది ఒక పాలీమెరిక్ అణువు, ఇది జీవ కణాలలో చాలా జీవసంబంధమైన విధులకు అవసరం. మెసేంజర్ ఆర్ఎన్ఏ పీస్‌ను వ్యాక్సిన్ ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. తద్వారా కణాలను ఒక నిర్దిష్టమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఈ ప్రోటీన్‌ను విదేశీగా(బయటి నుంచి వచ్చిందిగా) గుర్తిస్తుంది. తద్వారా దానితో పోరాడటానికి ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే.. కాన్సర్ విషయంలో, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేస్తుందన్నమాట.ఏఐ పాత్ర కూడా.. కాగా, ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ రూపకల్పనలో ఏఐ పాత్ర ఎంతో ఉందని రష్యా శాస్త్రవేత్తలు ప్రకటించుకున్నారు. పర్సనలైజ్డ్ వ్యాక్సిన్లను రూపొందించడానికి.. AI-ఆధారిత న్యూరల్ నెట్వర్క్ గణనలు అవసరమైన సమయాన్ని తగ్గించగలవని, ఈ ప్రక్రియను ఒక గంటలోపే పూర్తి చేయగలదని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. అతిత్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్‌తో పాటు తర్వాతి తరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులను ప్రజలకు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. చెప్పినట్లుగానే.. వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్ వ్యాక్సిన్‌ను జనాలకు.. అదీ ఉచితంగా అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. -
BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇక ఎంతో సమయం పట్టదని ఈ ప్రాణాంతక వ్యాధిపై సుదీర్ఘ కాలంగా పరిశోధన చేస్తున్న దంపతులు, ‘బయో ఎన్‌టెక్’ వ్యాక్సిన్ల తయారీ సంస్థ అధినేలు ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్, ప్రొఫెసర్ ఓజ్లెమ్ టురేసి చెబుతున్నారు. మహా అయితే ఎనిమిదేళ్లలోపే క్యాన్సర్ వ్యాక్సిన్ వాడుకలోకి రాబోతోందని వివరించారు. ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ ఇంటర్వ్యూలో వారు ఈ మేరకు వెల్లడించారు. ‘‘మేం డాక్టర్లుగా బాధితుల వెతలు, నిరాశా నిస్పృహలు చూసి చలించిపోయేవాళ్లం. ఆ అనుభవమే క్యాన్సర్ పరిశోధనల వైపు మళ్లించింది’’ అన్నారు. ‘‘కరోనాకు మంచి వ్యాక్సిన్ తయారు చేస్తున్న క్రమంలో ఆ పరిశోధన అనుకోకుండా క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేలా మలుపు తిరిగింది. ఇది మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్. మన ఒంట్లోని వ్యాధినిరోధక శక్తే క్యాన్సర్ కణాలను గుర్తించి తుదముట్టించేలా ఇది పని చేస్తుంది’’ అని డాక్టర్ సాహిన్ చెప్పారు. తమ వ్యాక్సిన్ అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని ఘంటాపథంగా చెప్పారు. అది క్యాన్సర్ కణాలను నేరుగా తుదముట్టించేలా రూపొందిందని టురేసి వివరించారు. ‘‘ట్రయల్స్‌లో బాధితులపై వ్యాక్సిన్‌ను వాడుతున్నప్పుడు ఎదురైన అడ్డంకులు దీన్ని మరింత ప్రభావవంతంగా మార్చేలా చేశాయి’’ అని దంపతులు చెప్పారు. ఈ పరిశోధనల వివరాలు తొలుత బిజినెస్ ఇన్సైడర్ మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. -
తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతి
న్యూఢిల్లీ: అర్ధరాత్రి పరిణామాల నడుమ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) తొలి స్వదేశీ ఎంఆర్ఎన్ఏ కొవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి అత్యవసర అనుమతులు జారీ చేసింది. పూణేకి చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్ ఈ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను వృద్ధి చేసింది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌కమిటీ(SEC) ఈ వ్యాక్సిన్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని చెబుతూ.. అత్యవసర వినియోగం శుక్రవారం ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో.. డీసీజీఐ మంగళవారం రాత్రి అనుమతులు జారీ చేసింది. రెండు డోసులతో పద్దెనిమిదేళ్లు పైబడిన వాళ్లు.. 28 రోజుల టైంతో ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత పూర్తి స్వదేశీయంగా తయారైన ఈ వ్యాక్సిన్‌కు ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే.. రెండు నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య కూడా ఈ వ్యాక్సిన్‌ను స్టోరేజ్ చేయొచ్చు. దేశంలోనే ఈ తరహా వ్యాక్సిన్ ఇదే మొదటిది కావడం గమనార్హం. సాధారణంగా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను.. అత్యంత లో-టెంపరేచర్లలో(సున్నా అంతకంటే తక్కువ) భద్రపరిచి.. సరఫరా చేస్తారు. అలాంటిది జెన్నోవా వ్యాక్సిన్‌కు అలాంటి ఆటంకాలేవీ లేవని కంపెనీ చెబుతోంది. పూణేకు చెందిన జెన్నోవా బయోఫార్మాసూటికల్స్.. దేశంలోనే తొలి కొవిడ్-19 m-RNA వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మూడు దశలుగా ఈ వ్యాక్సిన్ టెస్టింగ్‌లకు సంబంధించిన నివేదికలను డ్రగ్ రెగ్యులేటరీకి సమర్పించింది కూడా. ఫేజ్2, 3లను నాలుగు వేలమందిపై ప్రయోగించింది కంపెనీ. జెన్నోవా వ్యాక్సిన్‌తో పాటు సీరం ఇనిస్టిట్యూట్ రూపొందించిన కోవోవాక్స్ అత్యవసర వినియోగానికి (ఏడు నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులకు) డ్రగ్ రెగ్యులేటర్ అప్రూవ్ ఇచ్చింది. చదవండి: వైరస్ రూపాలెన్ని మార్చినా.. ఏమార్చే టీకా! -
ఓ చల్లటి వార్త!
అన్ని వ్యాధులకూ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో చెక్ మొన్నటికి మొన్న చికెన్ గున్యా.. నిన్న హెచ్1ఎన్1.. నేడు ఎబోలా, జికా వైరస్ ఇలా కొత్తకొత్త వ్యాధులు ముంచుకొస్తున్న తరుణంలో మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ చల్లటి వార్త మోసుకొచ్చారు. అన్ని రకాల సాంక్రమిక వ్యాధులకు విరుగుడుగా పనిచేసే వ్యాక్సిన్లను అభివృద్ధి చేసేందుకు వీరు ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. జీవ కణాల్లోని ఆర్ఎన్ఏతో కేవలం వారం రోజుల్లో ఎలాంటి వ్యాధికైనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయవచ్చునని వీరు నిరూపించారు. ఆర్ఎన్ఏ పోగును వైరస్, బ్యాక్టీరియాలతోపాటు ఎలాంటి పరాన్న భుక్కు ప్రొటీన్గానైనా మార్చేయవచ్చునని తెలిపారు. ఇవి కణాల్లోకి ప్రవేశించినప్పుడు ఉత్పత్తి అయ్యే ప్రొటీన్లు శరీర రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేసి నిర్ధిష్ట వ్యాధికారక వైరస్, బ్యాక్టీరియాలను అడ్డుకుంటుందని ఎంఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డేనియల్ ఆండర్సన్ తెలిపారు. ఎలుకల ద్వారా ఎబోలా, ఇన్ఫ్లూయెంజాలతో పాటు మలేరియా కారక బ్యాక్టీరియాపై ప్రయోగాలు జరిపి పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించామని ఆయన వివరించారు. సాధారణ వ్యాక్సిన్ల తయారీకి ఎంతో సమయం పడుతుంది. కొన్ని వ్యాధులకు సంబంధించినంత వరకు వ్యాక్సిన్లు ప్రమాదకరంగానూ మారవచ్చు. అంతేకాదు సాధారణ వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో పనిచేస్తాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లతో ఈ చిక్కులు ఉండవు. జీవకణాలు స్వయంగా వ్యాధిని ఎదుర్కొనే ప్రొటీన్లను ఉత్పత్తి చేయడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా స్పందిస్తుంది. ఆర్ఎన్ఏలతో వ్యాక్సిన్లు అభివృద్ధి చేయవచ్చునన్న ఆలోచన శాస్త్రవేత్తల్లో 30 ఏళ్లుగా ఉన్నా వాటిని జీవకణాల్లోకి చేర్చడం ఎలా అన్న అంశంపై స్పష్టత లేకపోయింది. నానోస్థాయి కణాలతో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ అడ్డంకిని అధిగమించారు.