ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.
నాసిక్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.
ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్‌సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్‌ను రాజీనామా చేయిస్తారట.
.. నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.
బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు.
రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్‌బల్.. మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్‌బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment